ఆర్థిక వ్యవస్థ నెమ్మదించడం జస్ట్​ కొన్నాళ్లే..

  • మళ్లీ పుంజుకుంటాం
  • కొన్ని రంగాలు నెమ్మదించాయి
  • మరిన్ని సంస్కరణలు అవసరం
  • డిమాండ్‌ ను మరింత పెంచుతాం
  • ద్రవ్యోల్బణంపై భయాలొద్దు
  • యాన్యువల్‌ రిపోర్టులో ఆర్‌ బీఐ

ముంబైదేశ ఆర్థిక వ్యవస్థ నెమ్మదిస్తోందనే ఆందోళన వ్యక్తమవుతున్న సమయంలో దీనిపై ఆర్‌‌బీఐ స్పందించింది. ఇలాంటి పరిస్థితులు మామూలేనని, మందగమనం తాత్కాలికమని పేర్కొంది. అయితే ప్రస్తుత స్థితికి కారణాలను స్పష్టంగా చెప్పడం సాధ్యం కాదని ఆర్‌‌బీఐ 2018–19 వార్షిక నివేదిక తెలిపింది.  ఏడాది మార్చితో ముగిసిన క్వార్టర్‌‌లో మన ఆర్థిక వ్యవస్థ వృద్ధిరేటు గత ఐదేళ్లలో ఎన్నడూ లేనంత కనిష్టస్థాయి 5.8 శాతం మాత్రమే నమోదయిందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం తెలిసిందే. తాజా పరిస్థితిని ఆర్థికమాంద్యంగా పరిగణించలేమని, ఇది తాత్కాలిక మందగమనమేనని ఆర్‌‌బీఐ వివరణ ఇచ్చింది. అయితే భూమి, కార్మికులు, వ్యవసాయ మార్కెటింగ్‌‌ వంటి అంశాల్లో మరిన్ని సంస్కరణలు అవసరమని, ఈ రంగాల్లో పరిష్కరించాల్సిన సమస్యలూ ఎన్నో ఉన్నాయని పేర్కొంది. మాన్యుఫ్యాక్చరింగ్‌‌, వాణిజ్యం, హోటల్స్‌‌, రవాణా, కమ్యూనికేషన్‌‌, బ్రాడ్‌‌కాస్టింగ్‌‌, నిర్మాణం, సాగురంగాలు నెమ్మదించాయని తెలిపింది. ‘‘ఈ ఏడాదిలో స్వార్థపూరిత విధానాల (ప్రొటెక్షనిజం) వల్ల అంతర్జాతీయ వ్యాపారానికి ఇబ్బందులు ఏర్పడ్డాయి. చాలా ఆర్థిక వ్యవస్థలు దెబ్బతిన్నాయి. విపరీతమైన డిమాండ్‌‌ వల్ల చమురు ధరలు పెరిగాయి’’ అని నివేదిక విశదీకరించింది.

గ్రోత్‌‌ను గాడిలో పెట్టడమే లక్ష్యం

వినిమయాన్ని, ప్రైవేటు ఇన్వెస్ట్‌‌మెంట్లను మళ్లీ పెంచడమే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తమ లక్ష్యమని ఆర్‌‌బీఐ ప్రకటించింది. ‘‘ఇన్‌‌ఫ్రాను అభివృద్ధి చేయడానికి బ్యాంకింగ్‌‌, నాన్‌‌–బ్యాంకింగ్‌‌ సెక్టర్లను మరింత బలోపేతం చేయాలి. కార్మిక చట్టాలు, పన్నుల వంటి వాటిలో సంస్కరణలు చేయడం వల్ల ఈజ్‌‌ ఆఫ్‌‌ డూయింగ్ బిజినెస్‌‌లో మన ర్యాంకింగ్‌‌ మెరుగుపడుతుంది ’’ అని రిపోర్టు వివరించింది.

రిపోర్టులోని ముఖ్యాంశాలు

  •  2018–19 ఆర్థిక సంవత్సరంలో ఆర్‌‌బీఐ ఆదాయం రెట్టింపై రూ.1.93 లక్షల కోట్లకు చేరింది.
  •  ఓపెన్‌‌ మార్కెట్‌‌ ఆపరేషన్స్‌‌, వేటెడ్‌‌ యావరేజ్‌‌ కాస్ట్‌‌ విధానాన్ని అమలు చేయడం, రిస్క్‌‌ ప్రొవిజనింగ్‌‌కు దూరంగా ఉండడంతో ఆదాయం గణనీయంగా పెరిగింది.
  • సాగు రుణాల మాఫీ, ఏడో పేకమిషన్ రిపోర్టును అమలు చేయాల్సి రావడం, ఆర్థికంగా లబ్ధి చేకూర్చే పథకాలను అమలు చేయడం వల్ల రాష్ట్రాలు ఆర్థికసహాయ ప్యాకేజీలు ఇవ్వలేకపోతున్నాయి.
  •  బ్యాంకులకు ప్యాకేజీ ఇవ్వడం వల్ల అవి మరింత పటిష్టమవుతాయి. దివాలా చట్టం వల్ల మరిన్ని మొండిబకాయిలను వసూలు చేసుకోగలుతున్నాయి. ఎన్‌‌బీఎఫ్‌‌సీల పరిస్థితి మాత్రం ఇప్పటికీ ఇబ్బందికరంగానే ఉంది. అప్పులు ఎక్కువ, ఆస్తులు తక్కువ ఉన్నాయి.

Latest Updates