శంషాబాద్ పోలీస్ స్టేషన్‌కు రామ్ గోపాల్ వర్మ

దిశ అత్యాచారం, హత్య ఘటనపై సినిమా తీస్తానని ప్రకటించిన ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వివరాలు సేకరించే పనిలో పడ్డారు. క్రైమ్ సీన్ మొదలు, పోలీసుల ఎంక్వైరీలో నిందితులు చెప్పిన విషయాల వరకు అన్నీ తెలుసుకునేందుకు స్వయంగా ప్రయత్నిస్తున్నారు. ఈ పనిలో భాగంగా సోమవారం ఆయన శంషాబాద్ ఆర్జీఐఏ పోలీస్ స్టేషన్‌కు వచ్చారు. దిశ కేసు గురించి మాట్లాడేందుకు ఏసీపీ అశోక్ కుమార్ గౌడ్‌తో సమావేశం కావాలని వర్మ భావించారు. కానీ ఆయన అందుబాటులో లేకపోవడంతో స్టేషన్ ఎస్ఐ వెంకటేశ్వరరావుతో కాసేపు ముచ్చటించి.. హైదరాబాద్ చేరుకున్నారు వర్మ.

దిశ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిందని చెప్పారు రామ్ గోపాల్ వర్మ. అందువల్ల ఈ ఉదంతం పై మూవీ తీయాలని నిర్ణయం తీసుకున్నానని అన్నారు. శంషాబాద్ ఏసీపీ అశోక్ కుమార్ గౌడ్‌తో సమావేశమై ఈ కేసుకు సంబంధించిన అన్ని కోణాలను తొలుసుకుంటానని చెప్పారు. పూర్తి వివరాలు సేకరించాకే షూటింగ్ పనులు మొదలుపెడతానని తెలిపారు. ఇందులో భాగంగానే ఇప్పటికే నిందితుడు చెన్నకేశవులు భార్యను కలిశానన్నారు. త్వరలో దిశ కుటుంబం సహా ఈ ఘటనకు సంబంధించిన మిగతా వారిని కూడా కలిసి సినిమా గురించిన వివరాలు వెల్లడిస్తానని చెప్పారు వర్మ.

Latest Updates