బెయిల్ పిటిషన్ కొట్టివేత.. జైలుకు రియా చక్రవర్తి

ముంబై: బాలీవుడ్ హీరో సుశాంత్ మృతి కేసులో డ్రగ్స్ కోణం కీలకమవుతోంది. డ్రగ్స్ యాంగిల్ లో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో విచారణను వేగవంతం చేస్తోంది. మంగళవారం రియాను అరెస్ట్ చేసిన నార్కోటిక్స్ అధికారులు.. 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ నిమిత్తం ముంబైలోని బైకుల్లా జైలుకు తరలించారు. గత రాత్రి బెయిల్ కోసం రియా చేసుకున్న దరఖాస్తును మేజిస్ట్రేట్ కొ్ట్టేశారు. గత రాత్రి ఆమెను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఆఫీసులో ఉంచారు. ముంబైలో మహిళలను ఉంచే ఏకైక జైలు బైకుల్లాలోనే ఉంది. దీంతో ఇవ్వాళ ఉదయం ఆమెను అక్కడికి తరలించారు. ఈ రోజు సెషన్స్ కోర్టులో మరోమారు బెయిల్ కోసం రియా యత్నించే అవకాశం ఉంది.

బెయిల్ డ్రగ్ సిండికేట్ లో రియా యాక్టివ్ మెంబర్ అని రిమాండ్ అప్లికేషన్ లో ఎన్సీబీ పేర్కొన్నట్లు సమాచారం. సుశాంత్ తోపాటు డ్రగ్ ప్రొక్యూర్ మెంట్ కు సంబంధించిన ఆర్థిక పరమైన విషయాలను రియానే చూసుకొనేదని తెలుస్తోంది. సప్లయికి సంబంధించి డ్రగ్ సిండికేట్ లో తాను యాక్టివ్ మెంబర్ ను అని రియా స్టేట్ మెంట్ ద్వారా స్పష్టమవుతోందని ఎన్సీబీ తెలిపింది. డ్రగ్స్ సేకరణతోపాటు ఆర్థిక పరమైన లావాదేవీల విషయంలో దీపేశ్ సావంత్, షోవిక్ చక్రవర్తి, మిరందాకు ఆమె సూచనలు ఇచ్చేదని ఎన్సీబీ వివరించింది. ఈ కేసు విషయంలో సావంత్ తోపాటు షోవిక్, మిరందాను ఎన్సీబీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

Latest Updates