దివ్య శక్తులున్నాయని పిలిచి.. ప్రసాదంలో సైనైడ్.. రెండేళ్లలో 10 మంది హత్య

  • చేసేదేమో ఏపీలోని ఏలూరులో వాచ్ మెన్‌ డ్యూటీ
  • రియల్ ఎస్టేట్ వ్యాపారినని.. దివ్యశక్తులున్నాయని వల
  • డబ్బు, బంగారం తీసుకుని.. ప్రసాదంలో సైనైడ్ విషం
  • రెండేళ్లలో పది మందిని చంపిన హంతకుడి అరెస్టు

జనాల డబ్బు ఆశే అతడి పెట్టుబడి అయ్యింది. బియ్యాన్ని ఆకర్షించే ‘రైస్ పుల్లర్ కాయిన్’తో కోట్లకు పడగలెత్తొచ్చన్న మూఢనమ్మకాన్ని ఎరగా వేశాడు. చేసే పనేమో అపార్ట్‌మెంట్‌లో వాచ్‌మెచ్ డ్యూటీ.. అయితేనేం క్రిమినల్ బుర్రలో ఐడియాలకేం తక్కువ లేవు.

రియల్ ఎస్టేట్ వ్యాపారినని, దివ్య శక్తులు ఉన్నాయని చెప్పి తన దగ్గరకు డబ్బు, బంగారంతో రప్పించుకునేవాడు. వెళ్లేటప్పుడు రైస్ పుల్లర్ కాయిన్ అని చెప్పి.. ఓ ఇత్తడి నాణెం ఇచ్చిపంపేవాడు. దానితో పాటు ప్రసాదం ఇచ్చి తప్పక తినాలని చెప్పడం, ఈ విషయాలన్నీ ఎవరితోనూ చెప్పకూడదని ముందుగా షరతు పెట్టడం ద్వారా తన గుట్టు బయటపడకుండా చూసుకున్నాడు.

తీరా ఆ ప్రసాదంలో సైనైడ్ కలిపాడని తెలియక అమాయకంగా తిని చనిపోవడంతో ఆ దుర్మార్గుడి విషయం చానాళ్లు రహస్యంగానే ఉండిపోయింది. ఇలా 2018 జనవరి నుంచి రెండేళ్లలోపే పది మందిని పొట్టనబెట్టుకున్నాడు. ఎట్టకేలకు పోలీసులు ఈ కిరాతకుడి ఆట కట్టించి.. కటకటాల వెనక్కి పంపారు. అతడి దగ్గర నుంచి 1.6 లక్షల డబ్బు, 20 బంగారు నాణేలు సీజ్ చేశారు.

ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో ఓ అపార్టుమెంట్‌లో వాచ్‌మెన్‌గా పని చేసేవాడు సింహాద్రి. ఇన్ని దారుణాలు చేసిన దుర్మార్గుడు వీడే. ఇటీవలే పశ్చిమ గోదావరిలో ఓ వ్యక్తి అనుమానాస్పదంగా మరణించిన కేసుతో మొత్తం డొంకంతా కదిలింది.

కాల్ రికార్డింగ్స్ పట్టించాయి…

పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఓ వ్యక్తి ఇటీవలే ఇంటి నుంచి రూ.1 లక్ష డబ్బు, నగలతో ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. కానీ కొద్ది గంటలకే ఆయన చనిపోయారు. ఇంట్లో వాళ్లకు బ్యాంకులో డిపాజిట్ చేయడానికి వెళ్తున్నా అని చెప్పి బయటకు వచ్చాడు. కానీ, కొన్ని గంటల్లోనే ఆయన చనిపోయాడని పోలీసుల నుంచి సమాచారం వచ్చింది. దీంతో వాళ్లు షాక్ అయ్యారు. ఆయనతో తెచ్చిన డబ్బు, నగలు కూడా అప్పటికే లేవు.

ఆయన శరీరంపై ఒక్క చిన్న గాయం కూడా లేకపోవడంతో గుండె పోటు వల్ల చనిపోయాడని భావించారు. కానీ పోస్టుమార్టం రిపోర్టు షాక్ ఇచ్చింది. సైనైడ్ వల్ల చనిపోయాడని డాక్టర్లు తేల్చారు. దీంతో పోలీసులు అతడి కాల్ డేటా ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు. ఎక్కువగా సింహాద్రి అనేవాడితో మాట్లాడినట్లు గుర్తించారు. కాల్ రికార్డింగ్స్ కూడా ఉన్నాయి. దీంతో పోలీసుల పని ఈజీ అయింది. వారి మధ్య జరిగిన సంభాషణ మొత్తం విన్నాక ఇది అతడి పనేనని పోలీసులకు క్లారిటీ వచ్చింది.

అదుపులోకి తీసుకుని తమ స్టైల్‌లో కూపీ లాగడంతో అసలు విషయం బయటకు వచ్చింది. అతడి ఫోన్‌లో మొత్తం 220 మంది నంబర్లు ఉండగా వారిలో 10 మంది అనుమానాస్పదంగా మరణించినట్లు పోలీసులు గుర్తించారు. ఇందులో ముగ్గురు మహిళలు కూడా ఉన్నారు. ఆ మరణాలపై కూడా ఇప్పుడు పూర్తి స్థాయి దర్యాప్తు చేస్తున్నామని పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ నవదీప్ సింగ్ చెప్పారు.

Latest Updates