మోడీ పాలనలో శ్రీమంతుల సంపద రెట్టింపు

2014లో మోడీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఈ ఏడాది వరకు దేశంలో సంపద బాగా పెరిగింది. ఆర్థిక వ్యవస్థ మరింత పటిష్టమయింది. ఈ ఐదేళ్లలో ఏడాదిన్నర మినహాయిస్తే జీడీపీ వృద్ధిరేటు ఏడుశాతానికిపైగా నమోదయింది. దీంతో సంపన్నుల ఆదాయాలు దాదాపు రెట్టింపు అయ్యాయి. సామాన్యుడి తలసరి ఆదాయం మాత్రం 58 శాతం పెరిగింది. ఇదే కాలంలో మనదేశ ప్రజల తలసరి ఆదాయం రూ.68,572 నుం చి రూ.1.25 లక్షల దాకా పెరిగింది. సంపన్నుల ఆదాయాలతో పోలిస్తే ఇది చాలా తక్కువ.

ఫోర్బ్స్‌ పత్రిక జాబితా ప్రకారం.. మనదేశంలోనే అత్యంత సంపన్నుడు రిలయన్స్‌‌ అధిపతి ముకేశ్‌ అంబానీ సంపద 2014లో 23 బిలియన్ డాలర్లు (దాదాపు 1.60 లక్షల కోట్లు) కాగా 2019లో ఇది 50 బిలియన్ డాలర్లకు (దాదాపు రూ.3.49 లక్షల కోట్లు) చేరింది. అంటే మూడురెట్లు పెరిగిందన్న మాట. రెండో స్థానంలో ఉన్న విప్రో అధిపతి అజీమ్‌ ప్రేమ్‌ జీ సంపాదన 16.4 బిలియన్ డాలర్ల నుంచి 22.6 బిలియన్‌‌ డాలర్లకు ఎగిసింది. మూడోస్థానంలో ఉన్న హెచ్‌ సీఎల్‌ వ్యవస్థాపకుడు శివ్‌ నాడార్‌ సంపాదన 12.5 బిలియన్ డాలర్ల నుం చి 14.6 బిలియన్‌‌ డాలర్లకు చేరింది. నాలుగో ర్యాంకు దక్కించుకున్న అంతర్జాతీయ స్టీల్‌ కంపెనీ అర్సెలర్‌ మిట్టల్‌ సీఈఓ లక్ష్మీ మిట్టల్‌ ఆర్జన 15.8 బిలియన్ డాలర్ల నుంచి 18.3 బిలియన్‌‌ డాలర్లకు ఎగిసింది.

2014లో ఫోర్బ్స్‌ జాబితాలో స్థానం సంపాదించు కోలేకపోయిన కోటక్‌‌ బ్యాంకు ఎండీ ఉదయ్‌ కోటక్‌‌ ఈసారి 11.8 బిలియన్ల సంపాదనతో ఐదో ర్యాంకుకి వచ్చారు. 2014లో ఈయన నెట్‌ వర్త్‌‌ 6.1 బిలియన్‌‌ డాలర్లుగా తేలింది. ఆదిత్య బిర్లా గ్రూప్‌‌ చైర్మన్‌‌ కుమార మంగళం బిర్లా 11.1 బిలియన్ల సంపాదనతో ఆరో ర్యాంకుకు వచ్చారు. 2014లో ఆయన నెట్‌ వర్త్‌‌ 9.2 బిలియన్లు! బిర్లా మాదిరే డిమార్ట్‌‌ సూపర్‌ మార్కెట్ల అధిపతి రాధాకృష్ణ దమానియా 2014లో ఫోర్బ్స్‌ జాబితాలో చోటు దక్కించుకోకున్నా ఈ ఏడాది మాత్రం 11.1 బిలియన్ల సంపాదనతో ఏడో ర్యాంకు పొందారు. ఐదేళ్ల క్రితం ఈయన నెట్‌ వర్త్‌‌ బిలియన్‌‌ డాలర్లు మాత్రమే. సీరమ్‌ ఇన్‌‌స్టి ట్యూట్‌ అధిపతి సైరస్‌ పూణావాలా సంపాదన 6.2 బిలియన్‌‌ డాలర్ల నుంచి 9.5 బిలియన్లకు చేరింది. ఈయన ఎనిమిదో ర్యాంకులోకి వచ్చారు. ఎన్నో వ్యాపారాలు చేసే గౌతమ్‌ ఆదానీ సంపాదన 7.1 బిలియన్ల నుంచి 8.7 బిలియన్లకు చేరింది. ఈయన తొమ్మిదో ర్యాంకులో ఉన్నారు. పదో ర్యాంకులో నిలిచిన దిలీప్‌‌ సంఘ్వి ఫార్మా దిగ్గజం. 2014లో ఈయన నెట్‌ వర్త్‌‌ 18 బిలియన్ డాలర్లు కాగా, ఈ ఏడాది ఇది 7.6 బిలియన్‌‌ డాలర్లకు పడిపోయింది. ఈ లెక్కలను గమనిస్తే ఒకరిద్దరిని మినహాయిస్తే టాప్‌‌ టెన్‌‌ ధనికుల సంపాదన ఈ ఐదేళ్లలో కనీసం కనీసం 75 శాతం పెరిగింది. చాలా మంది ఆదాయాలు రెట్టింపయ్యాయి.

భారీగా పెరుగుతున్న అంతరాలు
ఇండియాలో సంపదపై ఆక్స్ ఫామ్ అనే అంతర్జాతీయ సంస్థ చేసిన సర్వే దిగ్భ్రాంతికర విషయాలను వెల్లడించింది. దీని నివేదిక ప్రకారం భారతదేశంలోని సంపదలో ఎక్కువ భాగం కేవలం ఒక్క శాతం మంది సంపన్నుల దగ్గరే ఉంది. రూపాయిలో 73 పైసలు.. కేవలం ఒక్క శాతం మంది దగ్గరే ఉన్నా యి. అంటే మిగిలిన 27శాతం డబ్బు.. 99 శాతం మంది పంచుకుంటున్నా రు. దేశంలోని 99 శాతం మంది జనం.. కేవలం 27శాతం డబ్బుతో బతికేస్తున్నా రు. వీళ్లందరూ ఉద్యోగాలు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటే అరకొర సంపాదనతో బతుకు బండి లాగుతున్నారు. భారతదేశంలో ఆర్థిక అసమానతలు విపరీతంగా పెరిగిపోతున్నా యనడానికి ఈ లెక్కలే నిదర్శనం అని ఆక్స్ ఫామ్ సర్వే వెల్లడించింది. ఇది ఆందోళన కలిగించే అంశమని తెలిపింది. మరో ఆశ్చర్యకర విషయం ఏంటంటే.. 67 కోట్ల మంది భారతీయుల సంపద గత రెండేళ్లలో పెరిగింది కేవలం ఒక్క శాతం మాత్రమే! అంటే అంటే వెయ్యికి .. 10 రూపాయలు పెరిగింది వీరి సంపాదన. ప్రపంచవ్యాప్తంగా చూస్తే పరిస్థితి మరింత దారుణంగా ఉంది. గతేడాది ప్రపంచవ్యాప్తంగా సృష్టించిన మొత్తం సంపదలో 82శాతం ధనివంతులైన కేవలం ఒక్క శాతం మంది దగ్గరే ఉంది. అంటే 370 కోట్ల మంది ప్రజలకు వారి సంపాదనలో ఏ మాత్రం అభివృద్ధి లేదు. ధనికులు మరింత ధనవంతులవుతుండగా.. పేదవాళ్లు మరింత పేదవాళ్లుగా మారుతున్నారని సర్వేలో తేలింది.

Latest Updates