40 లక్షల వజ్రాలు కొట్టేసిండ్రు

హైదరాబాద్,వెలుగు: వజ్రాల వ్యాపారి దృష్టి మళ్లించి దొంగతనానికి పాల్పడిన అంతర్రాష్ట్ర ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బషీర్‌‌బాగ్‌‌లోని ఓ జ్యువెలరీ షాప్‌‌లో రూ.40 లక్షల విలువైన 60.20 క్యారెట్ల వజ్రాలను దోచుకెళ్లిన ఇద్దరిని సిటీ సెంట్రల్ జోన్ పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. డీసీపీ విశ్వప్రసాద్‌‌తో కలిసి సీపీ అంజనీకుమార్‌‌ కేసు వివరాలు చెప్పారు. ముుంబైలోని బోరివలీకి చెందిన రమేశ్ మన్సూర్ తండేశ్వర్ (65), మయూర్ కిశోర్ కుమార్(44) చిక్‌‌వాడీలో గోల్డ్ అండ్ డైమండ్ బ్రోకర్లుగా 15 ఏండ్లుగా పని చేస్తున్నారు. దీంతో వీరికి బంగారం,వజ్రాలపై మంచి అవగాహన ఉంది. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలని ప్లాన్‌‌ చేసిన వీరు… జ్యువెలరీ షాపులలో యజమానుల దృష్టి మళ్లించి దొంగతనాలు చేయడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో మెట్రో నగరాల్లోని వ్యాపారులపై కన్నేశారు.

ఇట్ల చేసిండ్రు…

ప్లాన్‌‌లో భాగంగా బషీర్‌‌బాగ్‌‌లోని రిధి సిద్ధి జ్యువెలర్స్‌‌ ను టార్గెట్ చేశారు. నవంబర్‌‌ 11న షాపుకు వెళ్లి యజమాని కరణ్ అగర్వాల్‌‌ను కలిశారు. తాము ఫంక్షన్‌‌ కోసం బ్యాంకాక్‌‌ నుంచి వచ్చామని, విలువైన వజ్రాలు కొంటామని చెప్పారు. ఫోన్‌‌ నంబర్‌‌ ఇచ్చి మళ్లీ వస్తామని వెళ్లిపోయారు. 30న మరోసారి దుకాణానికి వచ్చి, డైమండ్స్ చూపించాలని కోరారు. వజ్రాలను ఎన్వలప్ కవర్‌‌లో పెట్టి సీల్ చేయాలని చెప్పారు. ఫంక్షన్‌‌లో గిఫ్టు ఇచ్చేందుకు మరో ఎన్వలప్‌‌ కావాలని యజమానిని అడిగి తీసుకున్నారు. దాన్ని తీసుకొని వెళ్లిన దొంగలు.. ప్లాన్‌‌ ప్రకారం నకిలీ వజ్రాలను అందులో పెట్టుకొని సీల్‌‌ చేసుకొని ఈ నెల 1న షాప్‌‌కు వచ్చారు. అప్పటికే అగర్వాల్‌‌ సిద్ధంగా ఉంచిన వజ్రాల ఎన్వలప్‌‌ తీసుకొని బరువు చూస్తామని నమ్మించారు. ఇంతలోనే ఆయన దృష్టి మళ్లించి నకిలీ వజ్రాలున్న ఎన్వలప్‌‌ కవర్‌‌ను ఆయనకు అందజేశారు. మళ్లీ వస్తామని చెప్పి వెళ్లిపోయారు.  నాలుగు రోజులైనా వారు రాకపోవడంతో అనుమానించిన అగర్వాల్‌‌ ఎన్వలప్‌‌ ఓపెన్‌‌ చేసి చూడగా, అందులో నకిలీ వజ్రాలు ఉన్నట్లు గుర్తించాడు. 6న సైఫాబాద్‌‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సీసీ ఫుటేజీల ఆధారంగా నిందితులను గుర్తించిన పోలీసులు బోరివలీలో ఇద్దరినీ అరెస్టు చేశారు. అక్కడి వ్యాపారులకు అమ్మిన 58.71 క్యారెట్లు, రమేశ్ మన్సూర్ వద్ద 1.49 క్యారెట్ల వజ్రాలను స్వాధీనం చేసుకున్నారు.

Latest Updates