కరోనాపై సమీక్ష: బెంగాల్ స‌హ‌క‌రించ‌డంలేద‌న్న కేంద్రం

కరోనా వైరస్ ( కోవిడ్ – 19 ) పరిస్థితిని సమీక్షించడానికి పలు రాష్ట్రాలకు కేంద్రబృందాలు వెళ్లాయి. ఇందులో మధ్య ప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర, పశ్చిమ్ బెంగాల్ ఉన్నాయి. అయితే పశ్చిమ్ బెంగాల్ ప్రభుత్వం కేంద్ర బృందాలకు కరోనా సోకిన వారి వివరాలను, అక్కడి పరిస్థితులను సమీక్షించడానికి అనుమతులు ఇవ్వలేదని అన్నారు కేంద్ర హోం శాఖ జాయింట్ సెక్రటరీ సలీల శ్రీవాత్సవ. కొన్ని ప్రాంతాలలో కరోనా వైరస్ ప్రభలుతున్న రిపోర్ట్ కేంద్రానికి సరిగ్గా అందటం లేదని ఆమె అన్నారు. దీంతో   కేంద్ర బృందాలను పంపించామని చెప్పారు… అయితే బెంగాల్ మినహా   అన్ని రాష్ట్రాలు కేంద్రానికి సహకరించాయని తెలిపారు.   కేవలం వెస్ట్ బెంగాల్‌కు మాత్రమే టీంలను పంపించలేదని..   పూణె,   జైపూర్,   కొల్ కతా, హౌరా, మిడ్రాపూర్ ఈస్ట్, 24 పరగనాస్ నార్త్, డార్జిలింగ్, కాలింపాంగ్, జల్పాయిగురి, ఇండోర్ లాంటి నగరాలకు తమ టీంలను పంపించామని తెలిపారు.

ఈ విషయంపై తృణముల్ కాంగ్రెస్ నాయకుడు, ఆ పార్టీ రాజ్యసభ లీడర్ డెరెక్ ఓబ్రెయిన్ మంగళవారం మీడియాతో మాట్లాడుతూ…  కరోనా విపత్తు సమయాన కేంద్రం రాజకీయాలు చేస్తుందని అన్నారు. అందుకు ఉదాహరణ.. కేంద్ర బృందాలను బెంగాల్ కు పంపడమేనని చెప్పారు. అన్ని రాష్ట్రాలు కరోనాతో పోరాడుతుండగా… కొన్ని రాష్ట్రాలకు మాత్రమే కేంద్ర బృందాలను పంపడం ఏంటని ఆయన ప్రశ్నించారు. వెస్ట్ బెంగాల్ లోని ఏడు జిల్లాలను మాత్రమే ఎందుకు పరిశీలించాలనుకున్నారో తెలుపాలని ఆయన అన్నారు. ఈ విషయంపై సోమవారం మమతా బెనర్జీ కూడా కేంద్ర వైఖరిని తప్పుపట్టారు.

గుజరాత్, తమిళనాడు, ఉత్తర ప్రదేశ్, తెలంగాణ, ఢిల్లీకి ఎందుకు కేంద్ర బృందాలను పంపించలేదని ఓబ్రెయిన్ ప్రశ్నించారు. కేంద్రం కావాలనే పశ్చిమ్ బెంగాల్‌ ను టార్గెట్ చేసిందని ఆయన అన్నారు. ఇందుకు సమాదానంగా.. పరిస్థితి తీవ్రతను బట్టి తమటీంలను ఆయా నగరాలకు పంపుతున్నామని చెప్పారు  సలీల శ్రీవాత్సవ.  ఏ రాష్ట్రం అయితే సరైన వివరాలు తెలపడంలేదో అక్కడికి కేంద్రబృందాలు వెళ్తున్నాయని చెప్పారు. కరోనాను ఎదుర్కునేందుకు దేశం మొత్తం ఏకమవ్వాలని ఆమె తెలిపారు. అయితే బెంగాల్ లో మాత్రం ఆ రాష్ట్రం చెప్తున్న లెక్కల కంటే అక్కడ ఎక్కువ మరణాలు నమోదవుతున్నట్టు తమకు రిపోర్ట్ అందిందని అన్నారు.

Latest Updates