సోషల్ ఇంజనీరింగ్ తో పెరుగుతున్న సైబర్ నేరాలు

తరచుగా పాస్ వర్డ్ లను మార్చడంతోపాటు అపరిచితులు సోషల్ మీడియాలో పంపే రిక్వెస్ట్ లకు స్పందించకుండా ఉండడం, వ్యక్తిగత వివరాలు, ఫోటోలను పోస్ట్ చేయకుండా ఉండడం వల్ల సైబర్ నేరాలకు గురి కాకుండా ఉండవచ్చని సైబర్ రంగ నిపుణులు సూచిస్తున్నారు. తెలంగాణ పోలీస్ మహిళా భద్రతా విభాగం ఆధ్వర్యంలో నెలరోజుల పాటు నిర్వహిస్తున్న సైబ్-హర్ కార్యక్రమంలో భాగంగా ఇవాళ “సోషల్ ఇంజినీరింగ్ – హ్యూమన్ వీక్ నెస్” అనే అంశంపై వెబ్ ఆధారిత చైతన్య సదస్సు నిర్వహించారు. సింబయాసిస్ లా స్కూల్, సైబర్ జాగృతి ల సహకారంతో యువత, గృహిణులు, పిల్లలకు  నిర్వహించిన ఈ సదస్సులో సైబర్ జాగృతి ఫౌండర్ రూపేష్ మిట్టల్ మాట్లాడారు.

మారుతున్న కాలంతో పాటు ఇంటర్నెట్ వినియోగం ఊహించనంత అధికం అవుతోందని, అదే స్థాయిలోనూ సైబర్ నేరాలు అధికమవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.  2019 సంవత్సరంలో నిమిషానికి ఇంటర్నెట్ ను పది లక్షల మంది ఉపయోగిస్తే, 2020 నాటికి అది 18 లక్షలకు చేరిందని వివరించారు. ప్రస్తుత లాక్ డౌన్ లో పిల్లల దగ్గరి నుండి గృహిణులు, యువకులు ఇంటర్నెట్ ఆధారిత సోషల్ మీడియా ను ఉపయోగించడం ఎక్కువ అయ్యిందని అన్నారు. ఈ క్రమంలో ఫేస్ బుక్, ట్విట్టర్ తదితర మీడియాల్లో తమకు సంబందించిన వ్యక్తిగత అంశాలు, వివరాలు, సెల్ఫీ ఫోటోలను అప్ లోడ్ చేస్తున్నారన్నారు. అయితే, సైబర్ నేరస్తులు ఆ సమాచారాన్ని సోషల్ ఇంజనీరింగ్ ద్వారా సేకరించి ముందు ముందు పలు రకాలుగా అక్రమ పద్ధతులకు ఉపయోగిస్తారని వివరించారు. తమ దగ్గర విలువైన సమాచారం ఏమీ లేదని, ఇతరులకు ఏ మాత్రం ఉపయోగపడదని కొందరు అభిప్రాయం పడతారని, అయితే, సైబర్ నేరస్తులు ఈ సమాచారాన్ని తమ స్వప్రయోజనాలకు, ఇతర అంశాలకు ముడిపెట్టి పలు రకాలుగా ఉపయోగించుకుంటారని తెలిపారు. సైబర్ సెక్యూరిటీ కి గాను అనేక సంస్థలు, కంపెనీలు పెద్ద మొత్తం నిధులను కేటాయిస్తూ తమ సమాచారాన్ని గోప్యంగా ఉంచేందుకు అనేక చర్యలు చేపడుతున్నారని తెలియ చేశారు. సోషల్ ఇంజనీరింగ్ ద్వారా సమాచారాన్ని హ్యాక్ చేయడం ద్వారా ఒకరి వ్యక్తిగత లేదా సంస్థ యొక్క రెప్యుటేషన్ కు భంగం కలగడం,ప్రజల్లో పలుకుబడి తగ్గడం,కొత్త కస్టమర్లను కోల్పోవడం, న్యాయపరమైన అవరోధాలు ఏర్పడే ప్రమాదముందని రూపేష్ మిట్టల్ హెచ్చరించారు.

ఈ ప్రమాదాలను తప్పించుకునేందుకు గాను తమ పాస్ వర్డ్ లను తరచుగా మార్చడం, ఆ పాస్ వర్డ్ లు కూడా సులభమైన పదాలతో కాకుండా ఏదైనా లాజిక్ ను సూచించే కఠినమైన అక్షరాలతో పెట్టుకోవాలని సూచించారు. పే-టీఎం, కార్డు స్వైపింగ్, ఇంటర్నట్ బ్యాంకింగ్ సందర్బంగా అత్యంత జాగ్రత్తగా ఉండాలని, ఎట్టి పరిస్థితుల్లో మీ కార్డు వివరాలు, సి.వీ.వీ, ఇతర నెంబర్లు ఇతరులకు ఇవ్వకూడదని మిట్టల్ చెప్పారు. ముఖ్యంగా ఆర్థిక పరమైన లావాదేవీల సందర్బంగా అప్రమత్తంగా ఉండాలని, ప్రతి రోజూ మీ అక్కౌంట్ లావాదేవీలను తనికీ చేసుకోవాలని సూచించారు. ఎవరైనా సైబర్ నేరాలకు గురైతే వెంటనే సంబంధిత పోలీస్ కు సమాచారం ఇవ్వడంతోపాటు సైబర్ పోలీస్ స్టేషన్లో తగు ఆదారాలతో సహా ఫిర్యాదు చేయాలని ఆయన సూచించారు.

Latest Updates