మండుతున్న ఎండలు

రోజురోజుకూ ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 8 గంటల నుంచే భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. ఏప్రిల్ ప్రారంభంలో ఉష్ణోగ్రతలు చాలా పెరిగాయి. 39 నుంచి 42 డిగ్రీల సెంటిగ్రేట్ మధ్య టెంపరేచర్ రికార్డవుతోంది. నిన్న అత్యధికంగా నిజమాబాద్ లో 42.4, హైదరాబాద్ లో 40.9, హన్మకొండ 39.6, మహబుబ్ నగర్ 40.6 , నల్గొండ 41.0 , రామగుండంలో 39.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ సీజన్ కి ఈ ఉష్ణోగ్రతలే ఎక్కువ అంటున్నారు.. వాతావరణ శాఖ అధికారులు.

ప్రస్తుతం ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 4 డిగ్రీలు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఎండ తీవ్రత ఇదే స్ధాయిలో కొన్ని రోజులు నమోదయ్యే అవకాశం ఉంది. ఏప్రిల్ నెలలో ఆదిలాబాద్ , నల్గొండ , ఖమ్మం , కరీంనగర్ వంటి జిల్లాల్లో 44 డిగ్రీలకు చేరుతుందని అంచనా. మే వచ్చే నాటికి ఉత్తర, తూర్పు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 46 నుంచి 47 డిగ్రీలకు చేరే అవకాశం ఉందంటున్నారు.

మరోవైపు మహారాష్ట్ర , కర్ణాటక  మరట్ వాడ ప్రాంతాల్లో 1.5 కిలో మీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో 3 రోజుల పాటు అక్కడక్కడా తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. ఉష్ణోగ్రతలు కూడా సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది.

పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందంటున్నారు అధికారులు . వీలైతే ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయటకు వెళ్ళకపోవడమే మంచిదని చెప్తున్నారు.

Latest Updates