పాఠాలు విన్న తరగతి గదిలోనే పడుకోవాలి

  • కూర్చునేందుకు బల్లలు ఉండవ్.. పడుకోవడానికి బెడ్లు లేవ్​
  • అద్దె భవనంలో ఆర్.కె.పురం గురుకుల పాఠశాల

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేసిన గురుకుల పాఠశాలల నిర్వహణ పేరు గొప్ప, ఊరు దిబ్బ అన్నట్లుగా మారింది. ఉచిత విద్యే లక్ష్యంగా ఒక్కో విద్యార్థిపై రూ.లక్షకు పైగా ఖర్చుచేస్తున్నామని చెబుతూనే విద్యార్థుల సమస్యలను గాలికొదిలేసింది. దాదాపు 5 ఏండ్లుగా మలక్ పేట ముసారాంబాగ్​లోని ఓ అద్దె భవనంలో నిర్వహిస్తున్న ఆర్.కె.పురం బాలికల గురుకుల పాఠశాలే ఇందుకు నిదర్శనం. ఇక్కడి విద్యార్థుల అవస్థలు వర్ణనాతీతం. 5వ తరగతి నుంచి 10వ తరగతి వరకు మొత్తం 12 సెక్షన్లు ఉన్నాయి. 480 మంది విద్యార్థినులు చదువుకుంటున్నారు.

బిల్డింగ్ ఫస్ట్​ఫ్లోర్​లో ల్యాబ్, ప్రిన్సిపాల్​రూంలు కొనసాగుతున్నాయి. అందులోని ఓపెన్​కారిడార్​లోనే క్లాసులనూ నిర్వహిస్తున్నారు. ఆడనే పిల్లలు ఆడుకునేందుకు ఉపయోగిస్తున్నారు. సెకండ్​ఫ్లోర్​లోని గదులను అటు క్లాస్​రూంలుగా, ఇటు వసతి గృహాల రూమ్​లుగా వినియోగిస్తున్నారు. అక్కడే వారి బట్టలు, పెట్టెలు, స్కూలు బ్యాగులు పెట్టుకోవాలి. అక్కడే నిద్రపోవాలి. తరగతి గదిలోని పాఠాలు కూడా ఆడనే వినాలి. కూర్చునేందుకు బల్లలు ఉండవు. పడుకునేందుకు బెడ్​లు ఉండవు.

ఒక్కమాటలో చెప్పాలంటే రోజంతా ఆ గదులకే పరిమితం. ఆడుకోవాలంటే ఆట స్థలం లేదు. రోజంతా నేల మీద కూర్చుంటుంటే విద్యార్థినులకు మోకాళ్లు, నడుము నొప్పులు వస్తున్నాయని తల్లిదండ్రులు వాపోతున్నారు. బిల్డింగ్​సమస్య గురించి ప్రిన్సిపాల్, రీజినల్ కో–ఆర్డినేటర్లను ప్రశ్నిస్తే సొంత భవనం పూర్తయితే సాల్వ్​అవుతుందని చెప్పారని పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులు కమిటీ సభ్యులు వెల్లడించారు. అప్పటివరకు విశాలమైన భవనం అద్దెకు తీసుకుని, అన్ని గురుకుల పాఠశాలలో మాదిరిగానే తమ పిల్లలకూ సౌకర్యాలు కల్పించాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.

5 ఏండ్లుగా అదే చెప్తున్నరు

5 సంవత్సరాలుగా విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా సమస్య తీరడం లేదు. కొత్త భవనంలోకి షిఫ్ట్ చేస్తామని సమస్య దాటవేస్తున్నారు.– రమేష్, పేరెంట్స్ కమిటీ అధ్యక్షుడు

సమస్యలున్నా.. చదువులో ముందున్నాం

సౌకర్యాలు లేకపోయినప్పటికీ విద్యా బోధనలో లోటులేదు. ఈ పాఠశాల విద్యార్థిని టెన్త్​లో 10/10 జీపీఏ సాధించింది. చదువులో ముందున్నామనేందుకు ఇదే నిదర్శనం. – వాణిశ్రీ, ప్రిన్సిపాల్

త్వరలోనే పరిష్కరిస్తాం

అద్దె భవనంలో నిర్వహణతోనే సమస్యలు ఎదుర్కొంటున్నాం. ఫలక్ నుమా వద్ద కొత్త భవనం నిర్మాణం పూర్తికావొచ్చింది. త్వరలోనే అక్కడికి షిప్ట్​చేస్తాం. – శారద,  హైదరాబాద్, రంగారెడ్డి ఈస్ట్ రీజియన్ కో-ఆర్డినేటర్

Latest Updates