హైదరాబాద్‌ SR నగర్‌లో దారుణం: యువతిని ఢీకొట్టి ఈడ్చుకెళ్లిన కారు

హైదరాబాద్‌లోని ఎస్ఆర్ నగర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు దాటుతున్న యువతిని కారు ఢీకొట్టి.. కొద్ది దూరం ముందుకు ఈడ్చుకెళ్లింది. ఈ ఘటనలో ఆమెకు తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు ఆస్పత్రికి తరలించారు.
సోమవారం మధ్యాహ్నం ఎస్ఆర్ నగర్‌లో అలేఖ్య అనే యువతి రోడ్డు దాటుతుండగా ఆమెను ఓ బైక్ ఢీకొట్టింది. ఆమెకు తగిలిన వెంటనే బైక్ నడుపుతున్న వ్యక్తి బ్రేక్ వేసినప్పటికీ అలేఖ్య కిందపడిపోయింది. వెంటనే రెప్పపాటు గ్యాప్‌లో వెనుక నుంచి కారు వచ్చి ఆమెను ఢీకొట్టింది. ఈ ఘటన సడన్‌గా జరిగిపోవడంతో కారు నడుపుతున్న ప్రణీత అనే మహిళ కంగారులో కారును కంట్రోల్ చేయలేకపోయింది. దీంతో కొంత దూరం అలేఖ్యను ముందుకు ఈడ్చుకెళ్లింది. బ్రేక్ వేసేలోపే కారు చక్రం ఆ యువతి పైనుంచి ఎక్కేయడంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. ఇది గమనించిన స్థానికులు వెంటనే కారు కింద నుంచి ఆమెను బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. తల సహా పలు భాగాల్లో తీవ్రంగా గాయపడిన అలేఖ్యకు డాక్టర్లు చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Latest Updates