స్మార్ట్ రోడ్లకు పొలిటికల్​ కోతలు..రూల్స్ కు విరుద్ధంగా పనులు

కరీంనగర్, వెలుగుకరీంనగర్ స్మార్ట్ సిటీ కింద ఎంపికైందని నగరవాసులు ఎంతో సంబరపడ్డారు. వెడల్పు రోడ్లు.. అందమైన పార్కులు వస్తాయని ఆశపడ్డారు. కానీ  వీరు ఊహించినట్లు  పనులు జరగట్లేదు. ప్రస్తుతం నగరంలో పలుచోట్ల స్మార్ట్ సిటీ నిధులతో రోడ్ల  నిర్మాణం చేపడుతున్నారు. కానీ రూల్స్​ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ముఖ్యంగా ఆఫీసర్లు రాజకీయ ఒత్తిళ్లకు లొంగిపోతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 60 ఫీట్లు ఉండాల్సిన రోడ్లను కాంట్రాక్టర్లు తక్కువ వెడల్పుతో నిర్మిస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు.  స్మార్ట్​సిటీలో భాగంగా శాతవాహన యూనివర్సిటీ నుంచి కోర్టు వరకు.. గాంధీ రోడ్డు నుంచి టవర్ సర్కిల్ వరకు..  కిసాన్ నగర్..  కలెక్టరేట్ రోడ్లు నిర్మిస్తున్నారు.  రూల్స్​ప్రకారం ఈ నాలుగు రోడ్లు డ్రైయిన్లతో కలిపి 60 ఫీట్ల వెడల్పు ఉండాలి. ఇందుకోసం  మాస్టర్​ ప్లాన్​ ప్రకారం ఆక్రమణలను తొలగించాలి. రోడ్లపక్కన ఇళ్ల స్థలాలకు మార్కింగ్ చేసి ఆమేరకు తొలగించి రోడ్డు వెడల్పు చేయాలి. పొలిటికల్​బ్యాక్​గ్రౌండ్​ లేనివారివి తొలగించి 60 ఫీట్లు వేసినా, స్థానిక లీడర్ల అనుచరుల ఇళ్లను మాత్రం ముట్టుకోవడం లేదు. దీంతో రోడ్ల వెడల్పు ఒక్కోచోట ఒక్కోలా ఉంటోంది.  గాంధీ రోడ్ లో గాంధీ బొమ్మ నుంచి  సిరి హోటల్ మీదుగా టవర్ సర్కిల్ వరకు ఎక్కడా 60 ఫీట్ల కన్నా తక్కువ ఉండరాదు. కానీ చాలాచోట్ల 52,  53, 55 ఫీట్లకు మించి లేదు. రాజకీయ పలుకుబడి ఉన్నవారి నిర్మాణాలను ముట్టుకోకపోవడం వల్ల ఆయా ప్రాంతాల్లో రోడ్డు వెడల్పు ఏడు  నుంచి ఎనిమిది  ఫీట్లు తగ్గుతోంది. రోడ్డు పనుల్లో రాజీపడబోమని, ఎంతటివారి నిర్మాణాలైనా తొలగిస్తామని అప్పట్లో ప్రజాప్రతినిధులు చెప్పిన మాటలు ఉత్తవయ్యాయి. ప్రస్తుతం వేస్తున్న అన్ని రోడ్ల పరిస్థితీ ఇలాగేఉండడంతో రానున్న రోజుల్లో నగరవాసులకు ట్రాఫిక్​ కష్టాలు తప్పేలా లేవు.

కొరవడిన సమన్వయం.. పర్యవేక్షణ

స్మార్ట్ సిటీ పనులను కాంట్రాక్టర్లు తమ ఇంజినీర్లతోనే  చేయిస్తున్నారు. కానీ వీటిని మున్సిపల్ ఆఫీసర్లు పర్యవేక్షించాలి. రూల్స్, క్వాలిటీ పాటించేలా చూడాలి.  కలెక్టరేట్ రోడ్ లో ఇష్టారాజ్యంగా డ్రైయిన్ నిర్మించారు. దాంతో కొంతదూరం నిర్మించిన తర్వాత కూల్చివేసి తిరిగి నిర్మించాల్సి వచ్చింది.  కొన్నిచోట్ల డ్రెయిన్లు ఇటు నిర్మిస్తుండగానే అటు  పగుళ్లు వస్తున్న తీరుపై విమర్శలు వస్తున్నాయి. ఆఫీసర్లు పట్టించుకోకపోవడం వల్లే స్మార్ట్  పనుల్లో క్వాలిటీ మంటగలుస్తోందనే అభిప్రాయాలున్నాయి. అనేక చోట్ల డ్రెయిన్లు, రోడ్లు వంకర్లు తిరుగుతున్నాయి. సాధారణంగా డ్రెయిన్లు పూర్తయ్యాకే సీసీ రోడ్లు వేయాల్సి ఉంటుంది. కానీ కొన్ని చోట్ల డ్రెయిన్లు కట్టకుండానే సీసీ రోడ్లు నిర్మిస్తున్నారు.  టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లు, ఇంజనీరింగ్ విభాగం అధికారులు, కాంట్రాక్టర్ల నడుమ ఎలాంటి సమన్వయ లేకపోవడం వల్లే ఇష్టారీతిగా పనులు జరుగుతున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ప్రారంభానికి ముందే పగుళ్లు

ఇది కలెక్టరేట్ నుంచి అంబేద్కర్ స్టేడియం  స్మార్ట్ సిటీ రోడ్. వారం రోజులుగా ఈ రోడ్డు మీద నుంచి వాహనాలు వెళ్తున్నాయి. హెచ్ డీ ఎఫ్‍సీ భగత్ నగర్ బ్రాంచి వద్ద అప్పుడే సీసీ రోడ్డు పగుళ్లు పట్టింది. ప్రారంభానికి కూడా నోచుకోకముందే పగుళ్లు రావడం ఏమిటని నగరవాసులు ముక్కున వేలేసుకుంటున్నారు.

ఆపరేషన్ వికటించి ఇద్దరు మహిళల మృతి

 

 

Latest Updates