బిల్లులు ఇవ్వండి సారూ.. కాంట్రాక్టర్ల ఎదురుచూపులు

హైదరాబాద్ కు చెందిన వినోద్ రెడ్డి అనే కాంట్రాక్టర్.. మెదక్ జిల్లాలో రోడ్ వర్క్స్ చేస్తున్నారు. గతేడాది మార్చి నుంచి ఇప్పటివరకు రూ.6 కోట్లు బిల్లులు రావాల్సి ఉంది. అధికారుల చుట్టూ తిరుగుతున్నా నిధుల్లేవని చెప్తున్నారని ఆయన వాపోయారు. ప్రభుత్వం నుంచి 26 వర్క్స్ వస్తే.. ఇండ్లు, ఆస్తులు తాకట్టు పెట్టి లోన్ డబ్బులతో తొమ్మిది రోడ్ల పనులు పూర్తిచేశానని, కొన్ని పనులు చివరి దశలో ఉన్నాయని చెప్పారు. ఇప్పుడు డబ్బుల్లేక పనులు ఆపేశానన్నారు. అటు సర్కారు నుంచి బిల్లులు రాక లోన్ కట్టలేదని, ఆస్తులు, ఇండ్లు వేలం వేస్తామని బ్యాంకు వాళ్లు నోటీసులు పంపారని ఆవేదన వ్యక్తం చేశారు. బిల్లులు విడుదల చేయడం లేదేమని ఆర్ & బీ అధికారులను నిలదీస్తే.. తనకిచ్చిన ఆరు పనులను వేరే కాంట్రాక్టర్ కు ఇచ్చారని వాపోయారు.

ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన ప్రభాకర్ రెడ్డి అనే కాంట్రాక్టర్.. నాగార్జునసాగర్ కాల్వ మరమ్మతు పనులు, పక్క జిల్లాల్లో పబ్లిక్ హెల్త్ డిపార్ట్ మెంట్లో పనులు చేశారు. ప్రభుత్వం నుంచి సుమారు రూ.15 కోట్ల మేర బిల్లులు రావాల్సి ఉంది. బిల్లులు విడుదల చేయాలంటూ కొంతకాలంగా ఉన్నతాధికారుల చుట్టూ తిరుగుతున్నారు. నిధుల కొరత ఉందని, పూర్తిస్థాయి బడ్జెట్  రాగానే విడుదల చేస్తామని అధికారులు చెప్పారని ఆయన తెలిపారు. అక్టోబర్ 1 నుంచి పూర్తిస్థాయి బడ్జెట్ వచ్చినా.. ఆర్థిక మాంద్యం కారణంగా నిధుల కొరత ఉందని చెప్తున్నారంటూ వాపోయారు.

రాష్ట్రంలో నిధుల కొరతతో ఎక్కడి బిల్లులు అక్కడే ఆగిపోతున్నాయి. సాగునీటి శాఖ, ఆర్​ అండ్​ బీ శాఖల పరిధిలో పనులు చేసిన చిన్న కాంట్రాక్టర్లకు బిల్లులు రాక లబోదిబోమంటున్నారు. నిధులు విడుదల చేయాలంటూ అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా వందల కోట్ల మేర బకాయిలు పేరుకుపోయినట్టు సమాచారం. సమారు ఏడాదిగా బిల్లులు రావడం లేదని కాంట్రాక్టర్లు చెప్తున్నారు. రెండు నెలల కిందటిదాకా పూర్తిస్థాయి బడ్జెట్​ అమల్లో లేక ఇవ్వడం లేదన్నారని, ఇప్పుడేమో ఆర్థిక మాంద్యం కారణంగా నిధులిచ్చే పరిస్థితి లేదని అంటున్నారని వాపోతున్నారు. చిన్న చిన్న పనులకు సంబంధించిన రూ.50 లక్షలు, కోటి బిల్లులు కూడా రావటం లేదని అంటున్నారు.

ప్రభుత్వ పథకాలకే కొరత

సంక్షేమ పథకాల అమలుకు సంబంధించి ఎలాంటి జాప్యం కలిగించబోమని సీఎం గత బడ్జెట్ సమయంలో చెప్పారు. అయితే ఆసరా పెన్షన్లు, రైతుబంధుకు మాత్రం నిధులు విడుదల చేస్తున్నారు. మిషన్ భగీరథ, డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణానికి నిధుల కొరత ఉంది. వచ్చే నెలలో రైతుబంధు సొమ్ము చెల్లించడానికి రూ.7 వేల కోట్లు అవసరమని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక రైతుల రుణమాఫీకి సంబంధించి ఇంతవరకు గైడ్ లైన్స్ ఖరారు కాలేదు. మరోవైపు నిధుల్లేక కాంట్రాక్టర్లకు బిల్లుల విడుదల ఆగిపోయింది.

భూములు అమ్ముదామనుకున్నా..

వివిధ సంక్షేమ పథకాల అమలు, నీటిపారుదల ప్రాజెక్టులు, రోడ్లు, డబుల్ బెడ్రూం ఇండ్లు, రైతుబంధు, రుణమాఫీ, కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన బిల్లులకు వేల కోట్ల నిధులు అవసరం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సర్కారీ భూములు అమ్మడం ద్వారా రూ.10 వేల కోట్లు రాబట్టుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కోకాపేటతోపాటు మరికొన్ని చోట్ల, రాజధాని శివారు జిల్లాల్లో సర్కారీ భూములు, వాటి మార్కెట్​ విలువపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. కానీ ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ఇది ముందుకు పడటం లేదు. ఒకవేళ భూముల అమ్మకం మొదలైనా వచ్చే పైసలు ఏ మూలకూ సరిపోవని ఆర్థికశాఖ అధికారి ఒకరు చెప్పారు. అందుకే నిధులు ఎలా రాబట్టుకోవాలన్న దానిపై కసరత్తు చేస్తున్నట్టు తెలిపారు. అయితే ఇటీవల చేపట్టిన మద్యం షాపుల కేటాయింపులకు సంబంధించి.. అప్లికేషన్ ఫీజుల ద్వారా సుమారు రూ.850 కోట్లు, లైసెన్సు ఫీజులతో మరో రూ. 650 కోట్లు రావటంతో సర్కారుకు అదనపు నిధులు అందాయి.

మందగించిన పనులు..

బిల్లులు విడుదల కాకపోవటంతో రాష్ట్రవ్యాప్తంగా అన్ని శాఖలకు సంబంధించిన పనుల వేగం మందగించింది. కేవలం చివరిదశకు చేరుకున్న వాటిని మాత్రమే పూర్తి చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి బిల్లులు విడుదల కావడం లేదంటూ.. అసలు ప్రారంభించనివి, కొంతవరకు పూర్తయిన పనులు ఎక్కడికక్కడే ఉండే పరిస్థితి నెలకొంది. సుమారు ఏడాది నుంచి బిల్లులు రావల్సి ఉందని కాంట్రాక్టర్లు చెబుతున్నారు. సర్కారు నుంచి సకాలంలో బిల్లులు అందుతాయన్న భావనతో కొందరు కాంట్రాక్టర్లు ఫ్లాట్లు, ఇండ్లు జమానతుగా పెట్టి అప్పులు తెచ్చి, పనులు చేసినట్టు తెలుస్తోంది.

పెండింగ్ లో ఉన్న బిల్లులు

ఇరిగేషన్:              రూ.9 వేల కోట్లు

మిషన్ కాకతీయ:                                    రూ.1,200 కోట్లు

మిషన్​ భగీరథ:     రూ.9 వేల కోట్లు

రైతుబంధు:                రూ.2 వేల కోట్లు (వచ్చే నెల

మరో రూ.7,200 వేల కోట్లు)

ఆర్​అండ్​బీ          :   రూ.700 కోట్లు

ఆరోగ్యశ్రీ  :               రూ.500 కోట్లు

మార్చి వరకు ఎదురు చూపులేనా?

వచ్చే ఏడాది ఫిబ్రవరి లేదా మార్చిలో రాష్ట్ర ప్రభు త్వం పూర్తిస్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టనుంది. అప్పటివరకు కొన్ని బిల్లులైనా విడుదల చేస్తుం దా, కొత్త బడ్జెట్ వచ్చాకే ఇస్తారా అని కాంట్రా క్టర్లలో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో బిల్లులు విడుదల చేసే అవకాశం లేదని అధికారవర్గాలు అంటుం డటమే దీనికి కారణం.

Latest Updates