టెండరే రాలేదు.. పనులు మొదలెట్టిన్రు

టెండర్ రానే లేదు.. పనులు మొదలెట్టిన్రు

కరీంనగర్–-ఎల్కతుర్తి రోడ్డు రిపేర్ వర్క్స్‌లో మతలబు

రూ.41 కోట్ల పనుల్లో ఆర్​అండ్​బీ ఆఫీసర్ల ఇష్టారాజ్యం

అధికార పార్టీకి ఫేవర్​గా ఉన్న ఓ కాంట్రాక్ట్ ఏజెన్సీతో మిలాఖత్

టెండర్లు ఓపెన్​చేయకముందే పనులకు గ్రీన్​సిగ్నల్

భారీ మొత్తంలో డబ్బు చేతులు మారిందనే ఆరోపణలు

రోడ్డు రిపేర్​లో కనిపించని క్వాలిటీ మెజర్స్

కరీంనగర్–-ఎల్కతుర్తి రోడ్డు.. దీనికి రిపేర్లు చేసేందుకు కేంద్రం పైసలు మంజూరు చేసింది.. పనులు దక్కించుకునేందుకు లీడర్లు, ఆఫీసర్లతో కాంట్రాక్టర్లు కుమ్మక్కయిన్రు. ముందు రాష్ట్ర ఆఫీసర్లు టెండర్లు పిలిచిన్రు.. ప్లాన్ ప్రకారం కేవలం రెండే ఏజెన్సీలు టెండర్లు వేసినయ్. అందులో ఒకటి డమ్మీ సంస్థ!! ఇక మిగిలింది ఒకటే ఏజెన్సీ. టెండర్ తనకే వస్తుందని ఫిక్స్ అయిన కాంట్రాక్టర్.. ఉత్సాహం ఆపుకోలేక పనులు స్టార్ట్ చేసిండు. 15 కిలోమీటర్లకు పైగా రోడ్డుకు ప్యాచ్​వర్క్ పూర్తి చేసిండు. టెండర్లు తెరవకముందే కాంట్రాక్టర్ పనులు చేస్తుండటం ఒక వింతయితే.. దీన్ని ఆఫీసర్లు సమర్థించుకోవడం వెనుక మతలబు ఏందని జనం అనుమానిస్తున్నారు.

కరీంనగర్, వెలుగు: కరీంనగర్–-ఎల్కతుర్తి రోడ్డు రిపేర్ల విషయంలో అక్రమాలు జరుగుతున్నాయి. టెండర్లు ఖరారు చేయకముందే కాంట్రాక్టర్ పనులు చేస్తున్నారు. రూ.40.9 కోట్లతో సుమారు 50 కిలోమీటర్ల మేర జరుగుతున్న రోడ్డు రిపేర్ల విషయంలో ఆఫీసర్లు, కాంట్రాక్టర్లు మిలాఖత్ అయ్యారని విమర్శలు వస్తున్నాయి. ఈ వ్యవహారంలో పెద్దమొత్తంలో డబ్బు చేతులు మారిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఆగమాగం జరుగుతున్న ఈ రోడ్డు పనుల్లో ఎక్కడా క్వాలిటీ కనిపించడం లేదు. ఇదేంది సారూ అని ఆఫీసర్లను అడిగితే… ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగొద్దనే తెలిసిన కాంట్రాక్టర్ల ద్వారా ప్యాచ్ వర్క్ లు చేయిస్తున్నమని చెబుతుండటం గమనార్హం.

అంతా స్కెచ్​ ప్రకారమే

జగిత్యాల నుంచి ఖమ్మం వరకు సుమారు 270 కిలోమీటర్ల రోడ్డును నేషనల్ హైవే 563గా డెవలప్ చేయాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఫోర్ లేన్ విస్తరణ పనులను నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా చేపట్టింది. కానీ భూసేకరణ లేట్ అవుతుండటంతో ఆ లోపు రోడ్డుకు రిపేర్లు చేసే బాధ్యతలను స్టేట్​ పరిధిలోని ఆర్​అండ్​బీ (ఎన్​హెచ్ వింగ్)కి అప్పగించారు.

ఇందుకోసం కేంద్రం రూ.220 కోట్లు కేటాయించింది. ఇందులో భాగంగానే కరీంనగర్–ఎల్కతుర్తి నడుమ రోడ్డు రిపేరు కోసం రూ.40.9 కోట్లు మంజూరయ్యాయి. గత నవంబర్ 20న ఆర్​అండ్​బీ ఆఫీసర్లు పనులను నాలుగు బిట్లుగా చేసి టెండర్లు  పిలిచారు. డిసెంబర్ 14తో టెండర్లు ముగించారు. ప్లాన్ ప్రకారం కేవలం రెండు ఏజెన్సీలే టెండర్లు దాఖలు చేశాయి. అందులో ఒక ఏజెన్సీ అధికార పార్టీకి అనుకూలమైంది. మరొకటి దానికి డమ్మీ అని భావిస్తున్నారు. ఇలా రెండు టెండర్లే పడటం వెనుక కూడా చాలా తతంగం నడిచిందని చెప్పుకుంటున్నారు. నిజానికి డిసెంబర్​15న బిడ్ తెరవాల్సి ఉన్నా పలు కారణాల వల్ల ఓపెన్ చేయలేదు.

ఆఫీసర్లు, కాంట్రాక్టర్ ములాఖత్

టెండర్లు తెరవకున్నా తమకే పనులు దక్కుతాయని భావించిన కాంట్రాక్ట్ ఏజెన్సీ.. రోడ్డు రిపేర్​వర్క్స్ స్టార్ట్ చేసింది. కరీంనగర్–ఎల్కతుర్తి రోడ్డు వెంట మానకొండూరు మండలం పరిధిలో ఇప్పటికే సుమారు15 కిలోమీటర్ల మేర ప్యాచ్ వర్క్ పూర్తి చేసింది. అంటే దాదాపు రూ.10 కోట్లకు పైగా విలువైన పనులు కంప్లీట్​ చేసింది. చిత్రమేమిటంటే ఈ పనులను ఆఫీసర్లు కూడా పర్యవేక్షిస్తున్నారు. పైగా పబ్లిక్​ ఇబ్బందులు పడుతున్నందునే పనులు చేయిస్తున్నామని అమాయకంగా చెబుతున్నారు. దీంతో టెండర్లు ఓపెన్ చేయకున్నా ఆఫీసర్ల సూచన మేరకే కాంట్రాక్టర్ పనులు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆర్​అండ్​బీ ఆఫీసర్లు, కాంట్రాక్టర్​ముందే ఒక అండర్​స్టాండింగ్​కు వచ్చారని స్పష్టమవుతోంది. ఈ వ్యవహారంలో అధికార పార్టీ లీడర్లకు, ఆఫీసర్లకు భారీ మొత్తంలో డబ్బు ముట్టజెప్పారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.

గుంతలు నింపేసి..

ప్రస్తుతం జరుగుతున్న పనుల్లో ఏమాత్రం క్వాలిటీ మెజర్స్ పాటించడం లేదు. గుంతలు పడిన చోట స్క్వేర్ కటింగ్ చేసి కంకర, డాంబరు మిక్చర్​తో నింపి.. పాత రోడ్డుకు సమాంతరంగా లెవల్ చేయాల్సి ఉంటుంది. కానీ స్క్వేర్ కటింగ్ చేయకుండానే​హడావుడిగా గుంతలు నింపి చేతులు దులుపుకుంటున్నారు. దీంతో ఓ వైపు పనులు జరుగుతుండగానే మరోవైపు ఎప్పట్లాగే తారు లేచి గుంతలు ఏర్పడుతున్నాయి.

పబ్లిక్ ఇబ్బంది పడొద్దనే!

కరీంనగర్–ఎల్కతుర్తి రోడ్డు అధ్వానంగా మారింది. దీని రిపేర్ల కోసం ఫండ్స్ వచ్చాయి. టెండర్ల ప్రక్రియ ఇంకా ప్రాసెస్ లో ఉంది. అప్పటి వరకు ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలుగకూడదనే ఉద్దేశంతోనే తెలిసిన కాంట్రాక్టర్ల ద్వారా ప్యాచ్ వర్క్ లు చేయిస్తున్నం. టెండర్లు పూర్తయిన తర్వాత పూర్తి స్థాయిలో రోడ్డుకు రిపేర్లు చేపడుతం

– బలరామకృష్ణ, ఈఈ, ఆర్​అండ్​బీ(ఎన్ హెచ్), కరీంనగర్

For More News..

నాలుగేండ్లలో 5 వేల యాక్సిడెంట్లు

ఈ ఏడాది 20 ఎమ్మెల్సీ సీట్లకు ఎన్నికలు

ఉమ్మడి రాష్ట్రంలో కబ్జాలు.. ఇప్పుడు సెటిల్‌మెంట్లు

Latest Updates