లోన్లతో రోడ్ల పనులు: ఆర్ అండ్​ బీకి బ్యాంకుల నుంచి రూ. 2 వేల కోట్లు

నెలాఖరుకల్లా విడుదల కానున్న లోన్​

కాంట్రాక్టర్లకు ఇవ్వాల్సిన పెండింగ్​ బిల్లులే రూ. 1,500 కోట్లు

ఇప్పట్లో కొత్త ప్రాజెక్టులు లేనట్లే.. ఉన్న పనులే కొనసాగింపు

రాష్ట్రంలో రోడ్ల పనులకు నిధుల కొరత ఏర్పడింది. దీంతో చాలా ప్రాంతాల్లో పనులు చివరి దశలో ఆగిపోయాయి. వాటిని కొనసాగించేందుకు ఆర్​ అండ్​ బీ శాఖ అప్పులు చేయాల్సి వస్తోంది. ఎంతో కాలంగా రూ. 2 వేల కోట్ల లోన్​ కోసం ఆ శాఖ ప్రయత్నించగా.. విడుదల చేసేందుకు ఇటీవలే బ్యాంకులు అంగీకరించాయి. ఈ నెలాఖరులోగా  లోన్​ సొమ్ము శాఖకు చేరుతుందని అధికారులు చెబుతున్నారు.

కేటాయింపులు తక్కువ.. పెండింగ్​ బిల్లులే ఎక్కువ

రాష్ట్ర ప్రభుత్వం ఏటా బడ్జెట్​లో  రోడ్లు భవనాల శాఖకు నిధుల కేటాయింపుల్లో కోత పెడుతోంది. కేటాయిస్తున్న అరకొర నిధులను కూడా పూర్తిగా విడుదల చేయటం లేదు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత మొదటి మూడేండ్లు నిధులు మంచిగానే కేటాయించినప్పటికీ అటు తర్వాత తగ్గిస్తూ వస్తోంది. నిధుల కొరత, ఆర్థిక మాంద్యం ఉందని చెబుతూ కొత్త ప్రాజెక్టుల జోలికి వెళ్లకుండా ఉన్న ప్రాజెక్టుల పనులనే చేపడుతోంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన ఓట్ ఆన్ అకౌంట్ లో రూ. 2,176 కోట్లు కేటాయించగా, అందులో రూ. 764.06 కోట్లు తగ్గించి.. ఈ ఏడాది సెప్టెంబర్ లో ప్రవేశపెట్టిన పూర్తి బడ్జెట్​లో రూ. 1,411.94 కోట్లు కేటాయించింది. వీటిలో సుమారు రూ. 1,055 కోట్లు జీతభత్యాలకే ఖర్చు అవుతాయని అధికారులు చెబుతున్నారు. ఇక రోడ్ల అభివృద్ధికి రూ. 400 కోట్ల లోపే నిధులు ఉన్నాయి. రోడ్లు భవనాల శాఖలో కాంట్రాక్టర్లకు సుమారు రూ. 1,500 కోట్ల పెండింగ్​ బిల్లులు చెల్లించాల్సి ఉందని ఓ ఉన్నతాధికారి చెప్పారు. బ్యాంకుల నుంచి రూ. 2 వేల కోట్ల లోన్​ పైసలు రాగానే, కాంట్రాక్టర్లకు సగం బిల్లులు చెల్లించే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని ఆయన అన్నారు. బిల్లులు రాకపోవడంతో కొన్ని నెలల నుంచి కాంట్రాక్టర్లు పనులు కొనసాగించడం లేదు. కొంత కాలం క్రితమే మెదక్ లో ఓ కాంట్రాక్టర్.. రాష్ట్ర ప్రభుత్వం బిల్లులు విడుదల చేయటం లేదని ఆత్మహత్య చేసుకోవడం సంచలనంగా మారింది.

దెబ్బతిన్న రోడ్ల రిపేర్లకు త్వరలో నిధులు

ఇటీవల కురిసిన వర్షాలకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని రోడ్లు దెబ్బతిన్నాయి. వీటి రిపేర్లకు రాష్ట్ర ప్రభుత్వంతోపాటు, సింగరేణి కాలరీస్ కలిపి రూ. 571 కోట్లు నిధులు ఇస్తుందని, వచ్చే రెండు , మూడు నెలల్లో యుద్ధప్రాతిపదికన రిపేర్లు  చేపట్టాలని ఇటీవల మీడియా సమావేశంలో అధికారులను సీఎం కేసీఆర్​ ఆదేశించారు. దీంతో అన్ని జిల్లాల అధికారులతో ఈఎన్సీలు సమావేశమై ప్రతిపాదనలు తీసుకొని, ఆర్ అండ్​ బీ శాఖ మంత్రి ప్రశాంత్​రెడ్డికి అందజేశారు. ఈ నెలలో నిధులు విడుదల చేసే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

లోన్ రాగానే ఇస్తామన్నరు

రోడ్లు భవనాల శాఖ నుంచి కాంట్రాక్టర్లకు రూ.కోట్ల బిల్లులు రావాల్సి ఉంది. వీటిని విడుదల చేయాలని మంత్రిని, ఉన్నతాధికారులను కలిసి వినతి పత్రాలు ఇస్తూనే ఉన్నాం. త్వరలో లోన్ వస్తుందని, విడుదల చేస్తామని ఉన్నతాధికారులు చెబుతున్నారు. బిల్లులు విడుదల కాగానే.. చివరి దశకు చేరుకున్న పనులను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేస్తాం.

– డీవీఎన్ రెడ్డి, బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్   ఇండియా రాష్ట్ర అధ్యక్షుడు

Latest Updates