ఎన్నికల రోడ్లు 6 నెలలకే ఖరాబ్

మున్సిపల్ ఎలక్షన్స్ ముందు హడావిడిగా పనులు
ఒక్కవానకే ఎక్కడికక్కడ కొట్టుకుపోతున్న రోడ్లు
నాడు క్వాలిటీ పట్టించుకోలే.. నేడు ప్రజలకు తప్పని ఇక్కట్లు

వెలుగు నెట్వర్క్: గతేడాది మున్సిపల్ ఎన్నికలకు ముందు రాష్ట్రంలోని వివిధ మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో హడావిడిగా చేపట్టిన రోడ్లు ఆరు నెలలు తిరగకముందే అధ్వానంగా తయారయ్యాయి. బీటీ, సీసీ రోడ్ల నిర్మాణంలో ఏమాత్రం క్వాలిటీ లేకపోవడంతో ఇటీవలి వానలకు ఎక్కడికక్కడ లేచిపోతున్నాయి. కొన్ని రోడ్లను చూస్తుంటే అసలు వాటిపై తారు, సిమెంట్ పోశారా? అన్నట్లుగా కంకర తేలి కనిపిస్తున్నాయి. మోకాళ్ల లోతు గోతులతో వాహనదారులకు నరకం చూపుతున్నాయి.

ఎన్నికల ముందు హడావిడిగా..
రాష్ట్రంలో 128 మున్సిపాలిటీలు,13 కార్పొరేషన్లు ఉండగా,120 మున్సిపాలిటీలు, 10 కార్పొరేషన్లకు ఈ ఏడాది జనవరిలో ఎన్నికలు జరిగాయి. అంతకుముందు 2019లో మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో సీసీ, బీటీ రోడ్లు, డ్రైనేజీలు, ఇతర అభివృద్ధి పనుల కోసం టీయూఎఫ్ఐడీసీ (తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ ఇన్ర్ఫాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్) కింద ప్రభుత్వం విడతలవారీగా ఫండ్స్ రిలీజ్ చేసింది. పాపులేషన్ ప్రాతిపదికన రూ.20 కోట్లనుంచి రూ.50 కోట్ల వరకు కేటాయించారు. ఇవేగాక కరీంనగర్, వరంగల్ లాంటి సిటీల్లో స్మార్ట్ సిటీ, సీఎం అస్యూరెన్స్, ఎల్ఆర్ఎస్ ఫండ్స్, కొన్నిచోట్ల జనరల్ ఫండ్స్, సింగరేణి ఏరియాల్లో డిస్ట్రిక్ మినరల్ ఫండును వాడుకున్నారు. ఎన్నికల్లో లబ్ధి పొందాలనే ఉద్దేశంతో చాలాచోట్ల హడావిడిగా పనులు చేపట్టారు. డిసెంబర్లో ఎన్నికల కోడ్ రావడానికి ముందు కొబ్బరికాయలు కొట్టి, ఒకటి, రెండు రోజుల్లో రోడ్లు కంప్లీట్ చేశారు. కొన్నిచోట్ల కోడ్ రావడంతో పనులు అర్ధంతరంగా ఆపేశారు. కొన్నిచోట్ల టీయూఎఫ్ఐడీసీ ఫండ్ కింద చేపట్టిన పనులు ఇప్పటికీ పూర్తికాలేదు. అప్పట్లో క్వాలిటీని ఆఫీసర్లు ఏమాత్రం పట్టించుకోలేదు.

కామారెడ్డి టౌన్లో మున్సిపల్ ఎన్నికలకు ముందు రూ.18 కోట్ల టీయూఎఫ్ఐడీసీ నిధులతో సీసీ రోడ్లు వేశారు. నాసిరకంగా పనులు చేయడంవల్ల చాలా చోట్ల పగుళ్లు వచ్చాయి. కాకతీయనగర్, సాయి సద్గురుకాలనీ, దేవునిపల్లి, ఆశోక్ నగర్ కాలనీల్లో రోడ్ల మీద సిమెంట్ కొట్టుకుపోయి గుంతలు పడ్డాయి. నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో రూ. 7.60 లక్షలతో వేసిన రోడ్ల మీద తారు కనిపించడం లేదు. శ్రీనివాస్ టాకీస్ రోడ్డుపై కొద్దిరోజులకే గుంతలు పడ్డాయి.

పెద్దపల్లి పట్టణంతో పాటు మున్సిపాలిటిలో విలీనమైన రంగంపల్లి, చందపల్లి, బంధంపల్లి గ్రామాల్లో ఎన్నికలకు ముందు కోడ్ను కూడా పట్టించుకోకుండా ఒకే రోజు రూ. 6.4 కోట్లతో 85 సీసీ రోడ్లు చేపట్టారు. కంకర రెడీమిక్స్ పోసి వదిలేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇదే జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోనూ ఎన్నికలకు ముందు రూ. 5 కోట్లతో 105 సీసీ రోడ్ల పనులు ప్రారంభించినా ఒక్కటి కూడా పూర్తి కాలేదు.

యాదాద్రి జిల్లాలోని మున్సిపాలిటీలకు టీయూఎఫ్ఐడీసీ కింద రూ. 20 కోట్ల చొప్పున మంజూరయ్యాయి. ఎన్నికలలోపు పూర్తి చేయాలన్న తొందరలో చాలావరకు పనులు నాసిరకంగా చేశారు. ఆలేరు మున్సిపాలిటీలో రూ. 4 కోట్లతో సీసీ రోడ్లువేయగా, బీసీ కాలనీలో గుంతలు పడ్డాయి. ఒక రోడ్డు పూర్తిగా కుంగిపోయింది.

జనగామ జిల్లా కేంద్రానికి టీయూడీఎఫ్ఐడీసీ కింద రూ.30 కోట్లుమంజూరు కాగా, లోకసభ ఎన్నికలకు ముందు ఒకసారి, మున్సిపల్ ఎలక్షన్స్ కు ముందు మరోసారి పనులు చేశారు. రోడ్లు, డివైడర్లు నాసిరకంగా నిర్మించడంవల్ల పగుళ్లు వచ్చాయి. ఇటీవలి వర్షాలకు కంకర తేలుతున్నాయి.

ఖమ్మం జిల్లాలోని వైరా, మధిర, సత్తుపల్లి మున్సిపాలిటీల్లో ఎన్నికలకు ముందు రూ. కోట్లతో చేపట్టిన ప్యాచ్లన్నీ కొట్టుకుపోయాయి. రోడ్ల మీద మళ్లీ గుంతలు పడ్డాయి. ఖమ్మం, సత్తుపల్లి మెయిన్ రోడ్డు మీద 5 కి.మీ. పరిధిలో 20 చోట్ల ప్రమాదకరంగా గుంతలు ఏర్పడ్డాయి. ఖమ్మం బైపాస్ రోడ్ పై మళ్లీ ప్యాచ్ వర్క్ చేస్తున్నా నాణ్యత పాటించడం లేదు.

కొత్తగూడెం మున్సిపాల్టీలో ఎన్నికలకు ముందు సుమారు రూ. 44 కోట్లతో చేపట్టిన సీసీ, బీటీ రోడ్లు, డ్రైనేజీల్లో క్వాలిటీ కరువైంది. 36 వార్డుల పరిధిలో సుమారు110 పనులను మూడు ప్యాకేజీలుగా టెండర్లు పిలిచారు. వీటిలో కొన్ని పూర్తికాగా, కొన్ని కొనసాగుతున్నాయి. ఓల్డ్ బస్ డిపో నుంచి పెనుబల్లి వరకు, రామా టాకీస్ ఏరియా, సూర్యా ప్యాలెస్ నుంచి సింగరేణి మెయిన్ హాస్పిటల్ వైపు బీటీ రోడ్లు పనుల్లో క్వాలిటీ లేక చేసిన ఆరు నెలలకే బీటలువారాయి. ఓ రోడ్డయితే పలుచోట్ల ఎక్కడికక్కడ
కుంగిపోయింది.

ఒక్క వానకే కంకర తేలినయ్
మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో ఎన్నికలకు ముందు కోట్లుపెట్టి వేసిన బీటీ, సీసీ రోడ్లలో ఏమాత్రం క్వాలిటీ లేక ఇటీవలి వర్షాలకు కొట్టుకుపోతున్నాయి. కొన్ని రోడ్లను చూస్తుంటే అసలు వాటిపై తారుగానీ, సిమెంట్ గానీ వేశారా? అన్నట్లుగా కంకర తేలి అధ్వానంగా తయారయ్యాయి. మోకాళ్ల లోతు గుంతలతో వాహనదారులకు పట్టపగలే చుక్కలు కనిపిస్తున్నాయి. రాత్రిపూట గోతుల్లో పడి పలువురు కాళ్లు, నడుములు విరగ్గొట్టుకొని ఆసుప్రతుల పాలవుతున్నారు.

For More News..

ఉస్మానియాను కూల్చేందుకు స్కెచ్!

ఆర్టీఏలో..ఇంటి నుంచే మరో 5 సేవలు

పురిటి నొప్పులతో 15 గంటలు.. 180 కిలోమీటర్ల జర్నీ..

Latest Updates