లిఫ్ట్ అడిగి..నిలువు దోపిడీ

చిల్లర దొంగలు రెచ్చిపోతున్నారు. సిటీ శివారు ప్రాంతాలను టార్గెట్ చేసి దారిదోపిడీలకు పాల్పడుతున్నారు.  నిర్మానుష్య ప్రాంతాల్లో వాహనదారుల వద్ద సెల్ ఫోన్లు,డబ్బు దోచుకు పోతున్నారు. రాత్రి 9 గంటలు దాటితో  రోడ్లపైకి వచ్చి ఒంటరిగా బైక్ పై వెళ్లే వారిని లిఫ్ట్ అడిగి ఎవరూ లేని ప్రాంతాల్లో వారిని బెదిరించి చోరీలు చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు పాతబస్తీ పరిసర ప్రాంతాల్లోని వాహనదారులను  భయాందోళనకు గురి చేస్తున్నాయి. హైదరాబాద్,రాచకొండ పోలీసులు అలర్ట్ అయ్యారు. చిల్లరదొంగలు,పాతనేరస్థులు,రౌడీషీటర్లపై నిఘా పెట్టారు. యాకత్ పురలో దారిదోపిడీకి స్కెచ్ వేసిన ఐదుగురు సభ్యు ల ముఠాను నాలుగు రోజుల క్రితం సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ముఠా వద్ద కారంపొడి,డాగర్లను స్వాధీనం చేసుకుని రిమాండ్ కి తరలించారు.పహడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాల్లో చిల్లర దొంగలు ఈ విధంగా చోరీలు చేస్తున్నట్టు పోలీసులు చెబుతున్నారు.

క్యాబ్ లో సెల్ ఫోన్ చోరీ
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి జల్ పల్లి మీదుగా మైలార్ దేవ్ పల్లి వెళ్ళే వెహికల్స్ ను చిల్లర దొంగలు టార్గెట్ చేస్తున్నారు. లిఫ్ట్ పేరుతో అందినకాడికి దోచేస్తున్నారు.  ఆ ప్రాంతాల్లో ఇలాంటి ఘటనే ఈ నెల 18న జరిగింది. ఆ రోజు  రాత్రి 8 గంటల సమయంలో ఇద్దరు యువకులు ఓ క్యాబ్ డ్రైవర్ ను  లిఫ్ట్ అడిగారు. ఎయిర్ పోర్ట్ రోడ్ నుంచి మైలార్ దేవ్ పల్లి వస్తు్న్న ఆ క్యాబ్ లో తమను కిలో మీటర్ దూరంలో ఉన్న దర్గా వరకు డ్రాప్ చేయాలని క్యాబ్ ఓనర్ లాల్  రెడ్డిని  ఆ యువకులు కోరారు. ఆ రూట్ లో వెహికల్స్ రాకపోకలు ఎక్కువగా ఉండకపోవడంతో లాల్ రెడ్డి వాళ్ళను కారులో ఎక్కించుకున్నాడు. కొంత దూరం వచ్చాక ఆ ఇద్దరు యువకులు కారు ఆపమని చెప్పి దిగి వెళ్ళిపోయారు. ఆ తర్వాత తన క్యాబ్ లో తన మొబైల్ తో పాటు క్యాష్ కనిపించకుండా పోవడంతో లాల్ రెడ్డి కంగారు పడ్డాడు.  లాల్ రెడ్డి ఆ యువకులు దిగిన చోటుకి వెళ్లినా వారు అక్కడ కనిపించలేదు. అప్పటికే యువకులు అక్కడి నుంచి పారిపోయారు. దీంతో పహడీ షరీఫ్ పోలీసులకు బాధితుడు లాల్ రెడ్డి కంప్లయింట్ చేశాడు.

దొంగిలించిన బైక్ లతో
ఈ నెల 4న ఇద్దరు దొంగలను టాస్క్ ఫోర్స్ పోలీ సులు అరెస్ట్ చేశారు. చెడు అలవాట్లకు బానిసై దొంగగా మారిన డిగ్రీ విద్యార్ధి మామిడి ప్రణయ్(19) బైకుల చోరీలు చేస్తున్నాడని పోలీసు లు గుర్తించారు.  ప్రణయ్ మరో మైనర్ తో కలిసి చందానగర్,దుండిగల్,తార్నాకలో మూడు బైకులను దొంగిలించాడు. ప్రణయ్, మైనర్ ఇద్దరూ కలిసి ఆ బైక్ లపైనే రెక్కీ వేసి ఒంటరిగా వెళ్తున్న వ్యక్తుల దగ్గరి నుంచి సెల్ పోన్లు ఎత్తుకెళ్లేవారు.  బేగంపేట బైసన్ పోల్ వద్ద నడుచుకుంటూ వెళ్తున్న ఓ వ్యక్తి చేతిలో ఉన్న సెల్ ఫోన్ ను లాక్కొని పారిపోయారు. కుషాయిగూడ,రామ్ గోపాల్ పేట్,మియాపూర్ లలోనూ ఈ ఇద్దరు దొంగలు దారి దోపిడీలు చేశారు. బాధి తుల కంప్లయింట్ తో దర్యాప్తు చేపట్టిన టాస్క్ ఫోర్స్ పోలీసులు సీసీ ఫుటేజ్ తో బైక్ నంబర్ ఆధారంగా ప్రణయ్ ను అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద దొంగిలించిన 4 బైకులు,సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు.

సికింద్రాబాద్  సయ్యద్ గ్యాంగ్
 సికింద్రాబాద్ మౌలాలీకి చెందిన సయ్యద్ హరుణ్(19) గ్యాంగ్ ఒంటరిగా వెళ్తున్న వారి దగ్గరి నుంచి సెల్ ఫోన్ లు ఎత్తుకెళ్లేది. ఈ ముఠా ముగ్గురు మైనర్లతో కలిసి సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో సెల్ ఫోన్ చోరీలకు ప్లాన్ చేసింది. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న వారినే టార్గెట్ చేసి సెల్ ఫోన్ చోరీలు చేసింది. నాలుగు టీమ్ లు గా విడిపోయి ఈ ముఠా సభ్యులు సెల్​ఫోన్లు దొంగిలించేవారు .హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో 34 ఫోన్లను ఈ ముఠా స్నాచింగ్ చేసింది. ఈ ముఠా సభ్యులు రాత్రి 9 నుంచి 11 గంటల మధ్య సిటీ రోడ్లపై చక్కర్లు కొడుతూ ఒంటరి వ్యక్తులను గమనించేవారు. ఎవరైనా ఫోన్ మాట్లాడుతూ కనిపిస్తే వెనుక నుంచి వచ్చి చేతిలోని ఫోన్లను లాక్కుని పారిపోయేవారు. ఇందుకోసం ఓ బైక్ పై ఇద్దరు మొబైల్ స్నాచింగ్ కి పాల్పడితే మరో  బైక్ పై ఎస్కార్ట్ గా వస్తున్న మరో ఇద్దరు పరిసరాలను గమనిస్తూ పారిపోతారు.  సయ్యద్  హరుణ్​ తో తో పాటు ఈ గ్యాంగ్ కు చెందిన 8 మంది సభ్యులను ఈ ఏడాది మార్చి 14న నార్త్ జోన్ పోలీసులు అరెస్టు చేశారు. వీరి దగ్గరి నుంచి 34 సెల్ ఫోన్లు, 4 బైక్ లను స్వాధీనం చేసుకున్నారు.

సెల్ ఫోన్ దొంగలు దొరికారు
హైదరాబాద్, వెలుగు: సెల్ ఫోన్ చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు సభ్యుల ముఠా దొరి కింది. క్యాబ్ డ్రైవర్స్ ను టార్గెట్ చేసి మొబైల్ ఫోన్లను దొంగిలిస్తున్న ముగ్గురు దొంగలను గోల్కొండ పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. అసిఫ్ నగర్ ఏసీపీ నర్సింహా రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం…టోలిచౌకీకి చెం దిన ఇమ్రాన్ ఖాన్(25), మహ్మద్ మథీన్ ఉద్దీన్(23), ఖాజా(29) ముగ్గురూ ఫ్రెండ్స్. ఇమ్రాన్,మథీనుద్దీన్ ఫర్నీచర్, ఏసీ మెకానిక్ లుగా పనిచేస్తుండగా.. ఖాజా ఐటీఐ చదువుతున్నాడు. ఈ ముగ్గురూ గంజా,సిగరెట్ స్మోకింగ్,లిక్కర్ కు బానిసలై చోరీల బాటపట్టారు. ఇందులో భాగంగా తమ అవసరాల కోసం ఈ నెల 6న చోరీకి ప్లాన్ చేశారు. ముగ్గురు ఒకే బైక్ పై తిరుగుతూ రెక్కీ వేశారు. ఆ రోజు మధ్యాహ్నం 3.30గంటల సమయంలో టోలీచౌకిలోని ఎంఎఫ్ గార్డెన్ వద్దకు చేరుకున్నారు. అదే సమయంలో నానాల్ నగర్ కు చెందిన క్యాబ్ మహ్మద్ ముస్తాక్(30) రోడ్డు పక్కనే కారు నిలిపి తన భార్యతో సెల్​ఫోన్ లో మాట్లాడుతున్నాడు. దీన్ని గమనించిన ఇమ్రాన్ గ్యాంగ్ అక్కడికి వెళ్లింది.  ఖాజా బైక్ నడుపగా ఇమ్రాన్,మథీనుద్దీన్ వెనుకాల కూర్చున్నారు. బైక్ పై క్యాబ్ డ్రైవర్ గా దగ్గరగా వచ్చి అతడి చేతిలో ఉన్న సెల్ ఫోన్ లాక్కొని బైక్ పై పారిపోయారు. క్యాబ్ డ్రైవర్ ముస్తాక్.. ఇమ్రాన్ గ్యాంగ్ ను  కొంత దూరం వెంబడించారు. కానీ అప్పటికే దొంగలు చాలాదూరం వెళ్లిపోయారు. ముస్తాక్ ఇచ్చిన కంప్లయింట్ తో గోల్కొండ పోలీసులు కేసు నమోదు చేశారు. దొంగల కోసం బైక్ నంబర్ ఆధారంగా గాలింపు ప్రారంభించారు. సెవెన్ టూంబ్స్ సమీపంలోని సనా హోటల్ వద్ద  ఇమ్రాన్ గ్యాంగ్ ను సోమవారం ఉదయం అదుపులోకి తీసుకున్నారు.  నిందితుల వద్ద చోరీ చేసిన ఒప్పొ ఫోన్ తో పాటు డిస్కవర్ బైక్ ను స్వాధీనం చేసుకున్నారు. ఇమ్రాన్ ఖాన్, మహ్మద్ మథీనుద్దీన్, ఖాజా ముగ్గురిని రిమాండ్ కి తరలించినట్టు ఏసీపీ నర్సింహారెడ్డి చెప్పారు.

Latest Updates