గ్యాస్ కట్టర్ తో ఏటీఎం మెషీన్ పగులగొట్టి చోరీ

  •           రూ.4లక్షల46వేలు ఎత్తుకెళ్లిన దొంగల
  •                ఆదిబట్ల పీఎస్ పరిధిలో ఘటన

ఏటీఎం మెషీన్ పగులగొట్టిన దొంగలు అందులో ఉన్న డబ్బును ఎత్తుకెళ్లారు. ఈ ఘటన ఆదిబట్ల పీఎస్ పరిధిలో సోమవారం అర్ధరాత్రి జరిగింది. ఇబ్రహీంపట్నం ఏసీపీ యాదగిరి రెడ్డి కథనం ప్రకారం..రాగన్నగూడలోని మన్నెగూడ వద్ద ఉన్న ఆర్టీఏ రీజనల్ ఆఫీసు ఎదురుగా ఉన్న టాటా ఇండిక్యాష్ ఏటీఎం లోపలికి  సోమవారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు వచ్చారు. గ్యాస్ కట్టర్ తో ఏటీఎం మెషీన్ ను ధ్వంసం చేశారు. అందులో ఉన్న రూ.4లక్షల46వేల500 డబ్బును ఎత్తుకెళ్లారు. మంగళవారం ఉదయం ఆదిబట్ల పోలీసులకు ఏటీఎం క్యాష్ చోరీ విషయం తెలిసింది. అక్కడికి చేరుకున్న ఇబ్రహీంపట్నం ఏసీపీ యాదగిరి రెడ్డి, సీఐ నరేందర్ తో కలిసి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. క్లూస్ టీం సాయంతో ఆధారాలను సేకరించారు. నిత్యం రద్దీగా ఉండే సాగర్ రహదారిపై ఉన్న ఈ ఏటీఎంలో భారీ చోరీ జరగడంతో తెలిసిన వారే పక్కా ప్లాన్ తో ఈ పని చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. వరుస సెలవులు రావడంతో ఏటీఎంలో పెద్ద ఎత్తున డబ్బు నిల్వ ఉంటుందని తెలుసుకుని నిందితులు ఈ చోరీకి పాల్పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. డబ్బు దొంగిలించిన వెంటనే ఔటర్ రింగ్ రోడ్డు కేవలం కి.మీ దూరంలోనే ఉండటంతో దుండగులు అక్కడి నుంచి సులువుగా పారపోయి ఉంటారని అనుమానిస్తున్నారు. సంబంధిత బ్యాంక్ సిబ్బంది ఏటీఎం సెంటర్ దగ్గరికి వచ్చి సీసీ ఫుటేజ్ ఇచ్చిన వెంటనే కేసులో పురోగతి సాధించవచ్చని ఏసీపీ యాదగిరి రెడ్డి తెలిపారు.

Latest Updates