అమ్మవారికి మొక్కాడు.. కిరీటం కొట్టేశాడు

గన్​ఫౌండ్రీలో దుర్గాభవానీ ఆలయంలో చోరీ

అబిడ్స్,వెలుగు: భక్తుడిలా గుడికి వచ్చాడు. అమ్మవారికి మొక్కాడు. గుంజీలు తీశాడు. ఎవరూ లేనిది చూసి అమ్మవారి వెండి కిరీటాన్ని ఎత్తుకెళ్లాడు. ఈ ఘటన అబిడ్స్ పీఎస్ పరిధిలో జరిగింది. అడ్మిన్ ఎస్సై లక్ష్మయ్య కథనం ప్రకారం..బుధవారం రాత్రి గన్ ఫౌండ్రీలోని దుర్గాభవానీ ఆలయానికి ఓ వ్యక్తి వచ్చాడు. లోపలికి వెళ్లి అమ్మవారికి మొక్కి కొద్దిసేపు ప్రార్థించాడు. ఆ తర్వాత గుంజీలు తీశాడు. ఎవరూ లేనిది చూసి అమ్మవారిపై ఉన్న అరకిలో వెండి కిరీటాన్ని తీసుకున్నాడు. ఆ తర్వాత ఆ వ్యక్తి కిరీటంతో అక్కడి నుంచి వెళ్లిపోయాడు. పక్కనే ఉన్న మరో ఆలయంలో పూజ చేసేందుకు వెళ్లిన అమ్మవారి ఆలయ పూజారి శుక్లా కిరీటం లేకపోవడాన్ని గమనించాడు. వెంటనే ఆలయ నిర్వాహకుల దృష్టికి తీసుకెళ్లాడు. వారు అబిడ్స్ పీఎస్ లో కంప్లయింట్ చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న దొంగ భక్తుడి కోసం గాలిస్తున్నట్టు చెప్పారు. రూ.20 వేలు విలువ చేసే కిరీటాన్ని దొంగ ఎత్తుకెళ్తున్నట్టు సీసీ ఫుటేజ్ లో రికార్డైందని పోలీసులు తెలిపారు. పాత నేరస్థుడిగా అనుమానిస్తున్నట్టు చెప్పారు.

Latest Updates