ఈడీ ముందుకు తల్లితో సహా రాబర్ట్ వాద్రా హాజరు

జైపూర్ : మనీలాండరింగ్ కేసులో యూపీఐ చైర్ పర్సన్ సోనియాగాంధీ అల్లుడు, ప్రియాంకా గాంధీ వాద్రా భర్త, పారిశ్రామికవేత్త రాబర్ట్ వాద్రాకు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ విచారణ కొనసాగుతోంది. జైపూర్ లో ఇవాళ రాబర్ట్ వాద్రా ఈడీ అధికారుల విచారణకు హాజరయ్యారు. రాబర్ట్ వాద్రా తల్లి మౌరీన్ వాద్రా కూడా విచారణకు వచ్చారు. వీరిద్దరూ విచారణకు హాజరుకావడంతో… పోలీసులు హై సెక్యూరిటీ ఏర్పాటు చేశారు.

రాజస్థాన్ లోని సరిహద్దు పట్టణం బికనీర్ లో ల్యాండ్ స్కామ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న తల్లీ,కొడుకులను ఈడీ ప్రశ్నిస్తోంది. తన భర్త, అత్తలకు మద్దతుగా నిలిచేందుకు కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ ప్రియాంకగాంధీ వాద్రా కూడా నిన్న రాత్రి లక్నో నుంచి జైపూర్ నగరానికి వచ్చారు. భర్త, అత్తలతో పాటే ఈడీ ఆఫీస్ వరకు వచ్చిన ప్రియాంక గాంధీ వాద్రా.. వారిని దింపి అక్కడినుంచి వెళ్లిపోయారు. 

బికనీర్ లో స్కైలైన్ హాస్పిటాలిటీ సంస్థ ఏర్పాటులో మనీ లాండరింగ్ లావాదేవీలు జరిగాయంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు రాబర్ట్ వాద్రా. 69 హెక్టార్లను అతి తక్కువ ధరకు రాబర్ట్ వాద్రా దక్కించుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. వాద్రా ఈ భూములను ఎక్కువ ధరకు స్కైలైన్ హాస్పిటాలిటీ కంపెనీకి అమ్మారని అలిగేషన్స్ ఉన్నాయి. నిర్వాసితుల భూములను వాద్రా కొన్నట్టుగా  ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో దర్యాప్తు కోసం ఈడీ సమన్లు పంపినా కంపెనీ ప్రతినిధులు హాజరుకాకపోవడంతో.. అధికారులు రాజస్థాన్ హైకోర్టుకు వెళ్లారు. జనవరి 22న కేసు విచారణ చేసిన హైకోర్టు… ఫిబ్రవరి 12న స్కైలైన్ రాబర్ట్ వాద్రా, అతడి తల్లి, స్కైలైన్ హాస్పిటాలిటీ కంపెనీ ప్రతినిధులను హాజరుకావాలని ఆదేశాలు జారీచేసింది. కోర్టు ఆదేశాలతో జైపూర్ లో ఈడీ విచారణకు వాద్రా మంగళవారం హాజరయ్యారు.

Latest Updates