మనీ లాండరింగ్ కేసు: రాబర్ట్ వాద్రాను విచారించిన ఈడీ

మనీ లాండరింగ్ కేసులో ప్రముఖ పారిశ్రామికవేత్త, ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రాను విచారణకు పిలిచింది ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్. నిన్న సాయంత్రం 4 గంటలనుంచి 8 గంటల మధ్య సుమారు నాలుగు గంటల పాటు వాద్రాపై ఈడీ ప్రశ్నల వర్షం కురిపించింది. ఐతే తనకు లండన్ లో ఎలాంటి  ఆస్తులు లేవని ఈడీకి తెలిపారు రాబర్ట్ వాద్రా.

ప్రముఖ పారిశ్రామిక వేత్త, కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రాను విచారించింది ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్. మనీ లాండరింగ్ కేసులో రాబర్ట్ వాద్రాను బుధవారం నాలుగు గంటల పాటు ప్రశ్నించింది ఈడీ. లండన్ లోని 1.9 మిలియన్ పౌండ్ల విలువైన 8 ఆస్తులకు సంబంధించి వాద్రాపై ఆరోపణలున్నాయి. విచారణలో రాబర్ట్ వాద్రాను ఆస్తులకు సంబంధించి వివరాలు అడిగినట్లు అధికారులు తెలిపారు.

గతవారం వాద్రాకు  ఫిబ్రవరి 16 వరకు మధ్యంతర బెయిల్ జారీ చేసిన ఢిల్లీ హైకోర్టు ఫిబ్రవరి 6న విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. దీంతో నిన్న సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు సుమారు 4 గంటలపాటు వాద్రాను విచారించారు ఈడీ అధికారులు. ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ జేడీ, డిప్యూటీ డైరెక్టర్ తో పాటు మరో ఐదుగురు అధికారులు రాబర్ట్ వాద్రాపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఇవాళ మళ్లీ విచారణకు హాజరు కావాలని వాద్రాకు నోటీసులు ఇచ్చారు.

విచారణ సమయంలో భార్య ప్రియాంక గాంధీ వాద్రా వెంటే ఉన్నారు. ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరెట్ కార్యాలయం దగ్గర వాద్రాను డ్రాప్ చేసిన ప్రియాంక..అక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి వెళ్లారు. ఈ సమయంలో మాట్లాడిన ప్రియాంక…ఏం జరుగుతుందో అందరికీ తెలిసిందేనని, నా కుటుంబానికి నేను అండగా నిలుస్తానని చెప్పారు.

ఈ కేసుకు సంబంధించి డిసెంబర్ లో ఢిల్లీలోని రాబర్ట్ వాద్రాకు చెందిన ఓ సంస్థలో ఈడీ సోదాలు నిర్వహించింది. ఐతే రాబర్ట్ వాద్రాను ఈడీ విచారణకు పిలవడం రాజకీయ కోణమేనంటూ కాంగ్రెస్ పార్టీ వర్గాలు మండిపడుతున్నాయి.

Latest Updates