2011 తర్వాతే రోహిత్ కెరీర్ ఊపులోకి: కోచ్ దినేశ్ లాడ్

స్వదేశంలో జరిగిన 2011 వరల్డ్‌‌కప్‌‌ జట్టులో చోటు దక్కకపోవడం హిట్‌‌మ్యాన్‌‌ రోహిత్‌‌ శర్మకు మంచి చేసిందని అతని చిన్ననాటి కోచ్‌‌ దినేశ్‌‌ లాడ్‌‌ అన్నాడు. అప్పటి నుంచే ఆటపై బాగా దృష్టిపెట్టడంతో కెరీర్‌‌ ఊపందుకుందని చెప్పాడు. ‘చిన్నప్పటి నుంచి రోహిత్‌‌ బ్యాటింగ్‌‌ చూస్తున్నా. ఏమాత్రం మారలేదు. గతంతో పోలిస్తే అతను చాలా పరిణతి చెందాడు. అనుభవం వల్ల ఇది సాధ్యమైంది. ఈ ఒక్కటే అతనిలో వచ్చిన మార్పు. 2007–09 మధ్యలో రోహిత్‌‌ బాగా ఆడాడు. జింబాబ్వేపై రెండు సెంచరీలు కొట్టాడు. దీని తర్వాత 2009–11లో డబ్బు, ఫేమ్‌‌ వల్ల డైవర్ట్‌‌ అయ్యాడు. దానివల్ల ఆట గాడి తప్పడంతో  వరల్డ్‌‌కప్‌‌ జట్టు నుంచి ఉద్వాసనకు గురయ్యాడు’ అని లాడ్‌‌ పేర్కొన్నాడు. వరల్డ్‌‌కప్‌‌ టీమ్‌‌లో రోహిత్‌‌కు చోటు దక్కపోవడంతో తామంత ఆశ్చర్యానికి గురయ్యామన్నాడు. ‘ఓసారి అతన్ని మా ఇంటికి పిలిచి ఈ విషయంపై మందలించా. చూడు రోహిత్‌‌.. క్రికెట్‌‌ వల్లే నీవు ఈ స్థాయిలో ఉన్నావు. ఆట నీకు డబ్బు, పేరు ఇచ్చింది. కానీ నీవు క్రికెట్‌‌నే వదిలేశావు. ఇప్పటికైనా మించిపోయింది లేదు… ప్రాక్టీస్‌‌ మొదలుపెట్టు. విరాట్‌‌ నీ కంటే వెనుకాల వచ్చాడు. ఇప్పుడు వరల్డ్‌‌కప్‌‌ జట్టులోనూ ఉన్నాడు. మీ ఇద్దరి మధ్య తేడా అదే. క్రికెట్‌‌ తర్వాత నీవు దేని గురించైనా ఆలోచించని గట్టిగా చెప్పా’ అని లాడ్‌‌ చెప్పుకొచ్చాడు. తాను ఇచ్చిన సలహా వల్ల రోహిత్‌‌ పూర్తిగా మారిపోయాడన్నాడు. మార్నింగ్‌‌ ఏడు నుంచి ఈవెనింగ్‌‌ ఐదు వరకు ప్రాక్టీస్‌‌లోనే ఉండేవాడన్నాడు. ముంబై ఇండియన్స్‌‌ జట్టులోకి తీసుకోవడం కూడా రోహిత్‌‌ కెరీర్‌‌ను పూర్తిగా మార్చేసిందన్నాడు.

Latest Updates