ఫ్యూచర్‌లో మంత్రినవుతా : రోజా

roja-says-she-will-become-minister-in-future

విజయవాడలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో సమావేశం అయ్యారు నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా. సీఎం ఇంటికి రావాలంటూ ఉదయం విజయసాయిరెడ్డి ఫోన్ చేయడంతో.. ఆమె హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లి జగన్ ను కలుసుకున్నారు. రోజాకు మంత్రి పదవి దక్కలేదని.. ఆమె అసంతృప్తిగా ఉన్నారంటూ వార్తలు రావడంతో… జగన్- రోజా భేటీ ఆసక్తి రేపింది.

జగన్ తో భేటీ తర్వాత ఉత్సాహంగా కనిపించారు రోజా. మీడియాతోనూ అదే జోష్ లో మాట్లాడారు. సీఎంగా జగన్ ప్రమాణం చేశాక ఇవాళే కలిశానననీ.. రేపటినుంచి అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి కాబట్టి.. ఏం చేయాలనేదానిపై చర్చించానని చెప్పారు. జగన్ ను సీఎం చేయాలని తాము అందరం కోరుకున్నామని.. అది నెరవేరినందుకు సంతోషంగా ఉందని చెప్పారు. 9ఏళ్ల కల పూర్తయిందని అన్నారు.

పదవులు ఆశించి వైసీపీలో పనిచేయలేదన్నారు రోజా. జగన్ సీఎం అయితే తాము అందరం సీఎం అయినట్టే అన్నారు. తనకు, జగన్ కు మధ్య దూరం పెంచేలా మీడియాలో వచ్చిన వార్తలతో అభిమానులు ఆందోళన చెందుతున్నారని.. అలాంటిదేం లేదన్నారు. అంతా బాగుంటే.. అందరూ కోరుకున్నట్టయితే.. భవిష్యత్తులో మంత్రినవుతా అంటూ అక్కడినుంచి నవ్వుకుంటూ వెళ్లిపోయారు రోజా.

Latest Updates