మిద్దె మీద తీరొక్క మొక్కలు

కరీంనగర్, వెలుగు: దాదాపుగా  ఇప్పుడు అందరికీ డాబా ఇండ్లే  ఉంటున్నాయి. ఖాళీగా ఉన్న డాబా మీద ఇంట్లో పనికిరాని వస్తువులు ఓ మూలకు పడేయడం… మహా అయితే  ఏవైనా దినుసులు ఆరబెట్టుకోవడానికి… చిన్నపాటి ఫంక్షన్లు  చేసుకోవడానికి పనికి వస్తుంది. కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని రేకుర్తి లో జోత్స్న రాణి తన డాబా మీద ఇంట్లో కి కావలసిన కూరగాయలు,  ఆకుకూరలు, పండ్లు చక్కగా పెంచుతూ.. బయట నుంచి  కొనుగోలు చేయాల్సిన అవసరం లేకుండానే వెళ్లదీస్తున్నారు. సొంతంగా సేంద్రియ పద్ధతిలో  మొక్కలను పెంచుతూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఉన్నారు.

గులాబీలతో మొదలై..

కరీంనగర్‌‌‌‌‌‌‌‌ కార్పొరేషన్లో ఇటీవల విలీనమైన రేకుర్తిలో ఉంటున్న తొగరు జ్యోత్స్నా రాణికి పూల మొక్కలు పెంచడం చాలా కాలం నుంచి అలవాటు. ఐదారేళ్ల కిందట ఇంటి డాబా మీద గులాబీ మొక్కలను పెంచారు. ఒకటి, రెండు వెరైటీలు కాకుండా దాదాపు పదిహేను వరకు గులాబీలను పెంచేవారు. ఆ తర్వాత రెండేళ్ల కిందట గులాబీ మొక్కలు కాకుండా, ఇంటికి పనికొచ్చే కూరగాయలు, ఆకుకూరలు సాగు చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచన వచ్చింది. ఆలోచన వచ్చిందే తడవుగా ఇంట్లో ఇతరత్రా కుండీలు,  పనికిరాని డబ్బాలు.. ఇలా మొక్కలను పెంచడానికి అనువుగా ఉన్న ప్రతి వస్తువును కూడా వినియోగించుకున్నారు. డాబా మీద నాలుగైదు వరుసలు వేసుకొని అందులో ఆకుకూరలు, కూరగాయలు,  పండ్లు, తీగ జాతి  మొక్కలు నాటారు. రోజువారీగా కూరలకు పనికి వచ్చే టమాట, వంకాయ, బీర, సొర, అలసంద, చిక్కుడు, పాలకూర, దుంప బచ్చలి, పొన్నగంటి కూర, మిర్చి పెంచుతున్నారు.

సేంద్రియ పద్ధతిలోనే

డాబా మీద పెంచుతున్న రకరకాల మొక్కలన్నింటికి  ఈమె ఎటువంటి రసాయనిక ఎరువులు వినియోగించరు. కేవలం సేంద్రియ ఎరువులు మాత్రమే వాడుతున్నారు. వీళ్ళ ఇంట్లో కిచెన్ వేస్టేజ్ ఏది కూడా బయట పడేయరు. కూరగాయల వ్యర్ధాలు, మిగిలిపోయిన కూరలు.. ఇతరత్రా ఏదీ కూడా  వంటగది నుంచి బయటకు పోదు. ఈ వ్యర్థాలు అన్నింటిని ఒక కుండలో వేసి… సేంద్రియ ఎరువుగా మార్చి మొక్కలకు  అందిస్తుంటారు. మొక్కలకు చీడ పీడలు ఆశిస్తే.. వెల్లుల్లి, వేపాకు కషాయం వంటివి చల్లుతారు. ఇలా సేంద్రియ ఎరువులతో పండించిన కూరగాయలు తినడం వల్ల ఆరోగ్యం మెరుగ్గా ఉంటుందని చెబుతున్నారు జ్యోత్స్నా రాణి.

వెరైటీ ప్లాంట్స్

సాధారణంగా అందరికీ అల్లం మాత్రమే తెలుసు. కానీ ఇక్కడ  మామిడి అల్లం అనే వెరైటీ ఉంది. దీంతోపాటు లెమన్ గ్రాస్. దీంట్లో  సి విటమిన్ అధికంగా ఉంటుంది. ఈ ఆకును రోజువారి గ్రీన్ టీ లో ఒకటి  వేసుకుంటే అద్భుతంగా పనిచేస్తుంది. తులసి లో వెరైటీ అయిన మింట్ తులసి మొక్కలు ఇక్కడ ఉన్నాయి. స్వీట్ లైమ్ అనే సిట్రస్ జాతి మొక్క ఉంది. అన్ని మసాలా దినుసులు కలిపితే వచ్చే సువాసన వెదజల్లే ఆల్ స్పైస్  పెంచుతున్నారు. దీని ఒక్క ఆకును మనం వండుకునే బిర్యానీలో వేసుకుంటే ఘుమఘుమలు వస్తాయి.  వీటితో పాటు పంపర పనస, ఆపిల్ బేర్, స్టార్ ఫ్రూట్, అంజీర వంటి పండ్ల మొక్కలు డాబా మీద కనిపిస్తాయి.

ఇష్టంతోనే ఇవన్నీ

మొదట్ని నుంచి మొక్కలు పెంచడం హాబీ. అయితే అందరిలా కాకుండా కాస్త కొత్త పద్ధతిలో మొక్కలు పెంచాలనుకుని, డాబా గార్డెన్‌‌‌‌ స్టార్ట్‌‌‌‌ చేశా. మనకు రోజు అవసరం అయ్యే కూరగాయలను ప్లాన్ ప్రకారం నారు పోసి మొక్కలను పెంచుతాను.ఒక మొక్క కాతకు రాగానే దానికి మళ్లీ నారు పోస్తాను. ఈ మొక్క  ఆగిపోయే వరకు కొత్తవి కాతకు వస్తాయి. ఇలా మనకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇక వెరైటీ మొక్కలను హైదరాబాద్ కు వెళ్లినప్పుడు అక్కడ ఎంత ఖర్చైనా సరే తీసుకొస్తాను. ఇలా తెచ్చినవే… ఆల్ స్పైస్, లెమన్ గ్రాస్, మింట్ తులసి. యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. అప్పుడప్పుడు వీడియోలు కూడా అప్ లోడ్ చేస్తుంటాను. చాలా మంది మహిళలు ఇక్కడ చూసి వారి డాబాల మీద గార్డెన్లు ఏర్పాటు చేస్తున్నారు.

Latest Updates