పేదల కోసం రోటీ బ్యాంక్.. 11 రోజుల్లో లక్షకు పైగా చపాతీల పంపిణీ

కరోనావైరస్ వల్ల దేశం మొత్తం లాక్డౌన్ లో ఉంది. దాంతో ఎక్కడివారు అక్కడే స్తంభించిపోయారు. లాక్డౌన్ వల్ల తినడానికి తిండి కూడా లేక చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా వలస కూలీలు, పేదవాళ్లు, రోడ్డు పక్కన నివసించేవాళ్లు, అనాథలు, అడక్కునేవాళ్లు ఒక్క పూట తిండి కోసం కూడా ఇబ్బందిపడుతున్నారు. అటువంటి వాళ్ల ఆకలి తీర్చేందుకు చాలా మంది సమూహాలుగా ఏర్పడి వాళ్లకు చేతనైనంత ఆహారాన్ని పంచిపెడుతున్నారు. ఆ విధంగానైనా కొంతమంది ఆకలి తీరుస్తున్నారు.

అలాగే భావించిన నోయిడాకు చెందిన శైలేష్ యాదవ్ తమ అపార్ట్ మెంట్ కు సంబంధించిన కొంతమందితో కలిసి ఏప్రిల్ 12న రోటీ బ్యాంకును మొదలుపెట్టాడు. ఆ రోటీ బ్యాంకు కేవలం 11 రోజుల్లో లక్షా పదివేల చపాతీలను పంచింది. నోయిడాలోని శైలేష్ యాదవ్ 7ఎక్స్ సొసైటీ అనే తమ కాలనీ సొసైటీ ద్వారా రోటీ బ్యాంకును నెలకొల్పి మొదటి రోజు 400 చపాతీలను పంచారు. ఆ తర్వాత ఈ విషయం చుట్టు పక్కల సొసైటీలు, అపార్ట్ మెంట్ లకు తెలిసింది. తాము కూడా ఈ రోటీ బ్యాంకు కు చపాతీలను పంపి.. పేదవాళ్లను ఆదుకుంటామని ఆ సొసైటీ సభ్యులు తెలిపారు. దాంతో ప్రతిరోజూ అక్కడినుంచి కూడా చపాతీలను సేకరించి దాదాపు 3 నుంచి 4 వేల మంది ఆకలి తీరుస్తున్నారు.

ఈ రోటీ బ్యాంకు గురించి శైలేష్ యాదవ్ మాట్లాడుతూ.. ‘మేం ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకు కొన్ని వాహనాలను ఖాళీ బాక్సులతో సోసైటీలకు పంపిస్తాం. సోసైటీ వాసులు తాము చేసిన చపాతీలను ఆ ఖాళీ బాక్సులలో పెడతారు. అలా చపాతీల సేకరణ కోసం ఒక గంట పాటు రోటీ బ్యాంకు వాహనం అక్కడే ఉంటుంది. అలాగే మరో సొసైటీ నుంచి సేకరించిన పదార్థాలతో సబ్జీ లేదా పప్పు తయారుచేస్తాం. గంట తర్వాత వాహనాలు అక్కడి నుంచి బయలుదేరి పేదవాళ్లు ఉన్న చోటుకు చేరతాయి. అక్కడ ఆకలితో ఉన్న వారికి ఆ చపాతీలను పంచిపెడతాం. మొదట మూడు సొసైటీలు మాత్రమే ఈ రోటీ బ్యాంకులో పాల్గొనేవి. అది ఇప్పడు 25 సొసైటీలకు చేరింది. ఇప్పుడు మేం రోజూ 15 వేలకు పైగా చపాతీలను సేకరిస్తున్నాం. గురువారం 17,494 చపాతీల సేకరణ జరిగింది. దాంతో మేం లక్ష చపాతీల మార్కును దాటాం. పేదవారిని ఆదుకోవాలనే ఆలోచనే ఈ రోటీ బ్యాంకును ముందుకు నడిపిస్తోంది’ అని అన్నారు.

ఇప్పటివరకు ఉత్తరప్రదేశ్ లో 1510 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా.. 24 మంది మృత్యువాత పడ్డారు. దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 23 వేలు దాటింది. ఈ వైరస్ వల్ల దేశంలో 721 మంది చనిపోయారు.

For More News..

చెన్నై రోడ్లపై కరోనా ఆటో..

హౌజింగ్ మినిష్టర్ కు కరోనా పాజిటివ్

Latest Updates