
‘బాహుబలి’ సినిమాతో తెలుగు సినిమాకు అంతర్జాతీయ ఖ్యాతిని అందించిన రాజమౌళి... తన తర్వాతి చిత్రం ‘ఆర్ఆర్ఆర్’తోనూ అదే స్థాయిలో మెప్పించాడు. ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా డీవీవీ దానయ్య నిర్మించిన ఈ చిత్రం మార్చిలో విడుదలై వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు సాధించి రికార్డు సృష్టించింది. థియేట్రికల్ వసూళ్ల పరంగానే కాక ఓటీటీ రిలీజ్ తర్వాత కూడా రికార్డులు క్రియేట్ చేస్తోంది. నెట్‌ఫ్లిక్స్‌లో నాన్ ఇంగ్లీష్ సినిమాల కేటగిరీలో వరుసగా మూడు వారాల పాటు ఎక్కువమంది చూసిన సినిమాగా రికార్డు సృష్టించింది. అలాగే ఆమధ్య హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ ప్రతి ఏడాది ఎంపిక చేసే పది బెస్ట్ సినిమాల జాబితాలోనూ నిలిచింది. నెట్ ఫ్లిక్స్‌లో విడుదలైన రోజు నుంచి ఈ సినిమాపై హాలీవుడ్ టెక్నీషియన్స్ కూడా పొగడ్తలు కురిపిస్తున్నారు. తాజాగా హాలీవుడ్ స్టార్ డైరెక్టర్ స్కాట్ డెర్రిక్‌సన్ ఈ వరుసలో చేరాడు. మార్వెల్ కామిక్స్‌లో ‘డాక్టర్ స్ట్రేంజ్’ ఎంత పాపులరో తెలిసిందే. ఆ మూవీ డైరెక్టర్ అయిన స్కాట్ సోషల్ మీడియాలో ‘ఆర్ఆర్ఆర్’ను పొగుడుతూ పోస్ట్ పెట్టాడు. ‘నా బర్త్ డే సందర్భంగా భార్యపిల్లలతో కలిసి ‘ఆర్ఆర్ఆర్’ సినిమాను చూశాను. చాలా నచ్చింది. ఇదో అద్భుతమైన రోలర్ కోస్టర్’ అంటూ ట్వీట్ చేశాడు. మరోవైపు చాలామంది విదేశీ ప్రేక్షకులు కూడా ఈ సినిమాకు ఫిదా అవుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.