చచ్చే దాకా.. రూపాయికే అమ్ముతా!

జనాల్లో రోజురోజుకీ ఆరోగ్యంపై శ్రద్ధ పెరుగుతోంది. ఉప్పు, చక్కెర, నూనె వంటిని తగ్గిస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారు. అందుకే ఉదయం ‘ఏం టిఫిన్​ చేశావ్​?’ అని ఎవర్ని అడిగినా.. ‘ఇడ్లీ’ అని చెప్తున్నారు. దాంతో ఒకప్పుడు ఐదు, పది రూపాయలకు దొరికే ఇడ్లీ… ఇప్పుడు హోటల్​ని బట్టి ప్లేట్​ ఇడ్లీల రేటు రూ.20, రూ.50 దాకా ఉంటోంది. ఇంక స్టార్​ హోటళ్ల సంగతైతే చెప్పనక్కర్లేదు. అలాంటి ఇడ్లీని రూపాయికే అమ్ముతోంది తమిళనాడుకు చెందిన 80 ఏళ్ల బామ్మ.

ఈ బామ్మ పేరు ‘కమలతాల్​’. కోయంబత్తూర్​ సమీపంలోని వడివేలంపాలయంలో ఉండే ఈ బామ్మ గత ముప్ఫై ఏళ్లుగా రూపాయికే ఇడ్లీలు అమ్ముతోంది. స్థానికంగా ఉండే కార్మికులు వాటితో రోజూ తమ ఆకలిని తీర్చుకుంటున్నారు. ఇలా చేస్తోందని ఆమేదో స్వచ్ఛంద సంస్థకు చెందిన వాలంటీర్ అనుకుంటే పొరపాటే. కేవలం పేదల ఆకలిని అర్థం చేసుకుని తనకు తానుగా చేస్తున్న పని ఇది.

రుచితో పాటు ఆరోగ్యమూ…

బామ్మ రోజూ పొద్దున 5.30 గంటలకు నిద్రలేస్తుంది. ఆరు గంటలకల్లా పొయ్యి వెలిగించి… చట్నీ, సాంబార్​ తయారు చేస్తుంది. అలా మధ్యాహ్నం 12 గంటల దాకా ఇడ్లీలు అమ్ముతుంది. రోజుకు బియ్యం, పప్పు, కొబ్బరి, నూనె, ఇతర సామగ్రికి కలిపి మొత్తం రూ.300 దాకా ఖర్చు అవుతుందట. ఆ ఖర్చులన్నీ పోను రోజుకు  రూ.200 వరకు మిగులుతాయంటోంది ఈ  బామ్మ.

ఇప్పటికీ రుబ్బురోలే…

ఈ వయసులోనూ రుబ్బురోలునే వాడుతోంది ఈ బామ్మ. పిండి, చట్నీలను వాటిలోనే రుబ్బుతుంది. తాను ఇప్పటికీ ఇంత బలంగా ఉండటానికి కారణం తన ఆహార అలవాట్లేనని గట్టిగా చెప్తోంది. ‘నీ ఆరోగ్య రహస్యం ఏంట’ని అడిగితే… ‘‘నేను రాగి జావ తాగేదాన్ని. అలాంటి ఆహారం తినడం వల్లే నేను ఇప్పటికీ పనిచేస్తున్నా. ఇప్పుడు అందరూ ఎక్కువగా అన్నం తింటున్నారు. కానీ, బియ్యంలో సరైన పోషకాలు ఉండవు” అంటోంది.

రోజూ ఒకే దినచర్య…

‘’నేను గత 30 ఏళ్లుగా ఇడ్లీల వ్యాపారం చేస్తున్నా. మాది ఉమ్మడి కుటుంబం. అందుకే ఎంతమందికైనా వండగలగడం అలవాటైంది. నా కుటుంబ సభ్యులంతా ఉదయాన్నే పొలానికి వెళ్లేవాళ్లు. ఇంట్లో ఒంటరిగా ఉండటంతో కాలక్షేపం అయ్యేది కాదు. అందుకే ఇడ్లీ వ్యాపారాన్ని మొదలుపెట్టా. మొదట్లో ఇడ్లీ కేవలం రూ.50 పైసలకే అమ్మేదాన్ని. కానీ ప్రస్తుతం అది చెల్లుబాటు కావడం లేదు. అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో రూపాయి చేయాల్సి వచ్చింది. ఇడ్లీ పిండి కోసం ఆరు కిలోల బియ్యం, మినపప్పును నానబెడతా. ప్రతిరోజూ సాయంత్రం రోట్లోనే వాటిని రుబ్బుతా. దానికి నాకు నాలుగు గంటల సమయం పడుతుంది. రాత్రిపూట పిండిని పులియబెట్టి మరుసటి రోజు ఉదయాన్నే ఇడ్లీలు వేస్తా. నా దగ్గర ఉన్న ఇడ్లీపాత్రలో దఫాకు 37 ఇడ్లీలు వస్తాయి. అలా రోజుకు వెయ్యి ఇడ్లీలు పెడతా. అయితే ఇదంతా కూడా కట్టెలపొయ్యి మీదే చేస్తా. ఇడ్లీలోకి తాజా కొబ్బరి, ఇతర పదార్థాలతో పచ్చడి, కొన్ని కూరగాయలను తరిగి ఒక కుండలో సాంబార్‌‌‌‌ చేస్తా. ఈ ఇడ్లీలను మా పొలంలోని టేకు ఆకులు, మర్రి ఆకుల్లో పెట్టి అందిస్తా”  అంటోంది కమలతాల్‌‌‌‌ బామ్మ.

ఆకలి మాత్రమే చూస్తా..

‘‘మా ప్రాంతంలో ఉండే ప్రజల్లో ఎక్కువమంది రోజువారీ కూలీలే. ఇంట్లో టిఫిన్​ చేసుకునే స్తోమత వాళ్లకు ఉండదు. అలాగే బయట హోటళ్లలో ఎక్కువ డబ్బు పెట్టి కడుపు నింపుకోలేరు. దాంతో చాలాసార్లు పస్తులుండాల్సి వస్తుంది. అందువల్లే అనారోగ్యాలకు గురవుతారు. ముఖ్యంగా నా వ్యాపారం అలాంటి వాళ్ల కోసమే. అందుకే నా ఇంటికి వచ్చిన వాళ్ల ఆకలిని మాత్రమే చూస్తా. లాభాల కోసం కాకుండా… పదిమంది కడుపు నింపాననే తృప్తి కోసం పని చేస్తా.  ‘ఈ వయసులో కష్టపడటం ఎందుకు? మేము నిన్ను బాగా చూసుకుంటాం’ అని నా మనవరాళ్లు అంటుంటారు. నిజానికి పని చేస్తేనే నేను ఆనందంగా ఉంటా’ అంటోంది. ‘కేవలం రూపాయికే ఇడ్లీ అమ్మడం ఏంటి? అందరిలా రేటు పెంచమని కొందరు వ్యాపారులు నాపై ఒత్తిడి తెచ్చారు. కానీ నేను మాత్రం వాళ్లకు సున్నితంగా సమాధానం చెప్పా. ఈ మధ్య కాలంలో కొందరు కస్టమర్ల కోరిక మేరకు బోండాలు (పునుగులు) వేస్తున్నా. ఒక్క బోండా ధర రూ.2.50 పైసలు. నేను చనిపోయేవరకు ఇడ్లీని రూపాయికే అమ్ముతా ” అని గట్టిగా చెప్పే ఈ బామ్మ అందరికీ ఆదర్శం.

Latest Updates