ఔట్ సోర్సింగ్ జాబ్ కు రూ.2.50లక్షల లంచం

నాంపల్లి, వెలుగు:  ఓ నిరుద్యోగికి ఔట్ సోర్సింగ్ ఉద్యోగం ఇప్పిస్తామని  మున్సిపల్ సూపరింటెండెంట్ లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. మున్సిపల్ సూపరింటెండెంట్ గతంలో ఏసీబీకి పట్టుబడ్డ కేశంపేట ఎమ్మార్వో లావణ్య భర్త కావడం గమనార్హం. ఏసీబీ అధికారుల సమాచారం మేరకు  నాంపల్లి రెడ్ హిల్స్ లోని రీజినల్ డైరెక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసులో సూపరింటెండెంట్ గా పని చేస్తున్న నునవత్ వెంకటేశ్వర నాయక్ అదే ఆఫీసులో ఔట్ సోర్సింగ్ ఉద్యోగం ఇప్పిస్తానని హన్మకొండ కు చెందిన వంగల రణధీర్ ను 2లక్షల 50 వేలు డిమాండ్ చేశాడు.

ఈ వ్యవహారాన్ని మధ్యవర్తిగా కందుకూరి ప్రకాష్ అనే వ్యక్తితో నడిపించాడు. మరో రూ.40 వేలు చెల్లిస్తే రెగ్యులర్ తో పాటు, ఈఎస్ఐ, పీఎఫ్ వచ్చేలా చూసుకుంటానని వెంకటేశ్వర నాయక్ రణధీర్ తో చెప్పాడు. రణధీర్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. శుక్రవారం రణధీర్ డబ్బును మధ్యవర్తి ప్రకాష్ కు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అతడితో పాటు అధికారి వెంకటేశ్వర్ నాయక్ ను జడ్జి ముందు ప్రవేశపెట్టి శనివారం రిమాండ్ కు తరలించారు.

Latest Updates