డ్వాక్రా మహిళలందరికీ రూ.2 లక్షల బీమా  

డ్వాక్రా మహిళలందరికీ రూ.2 లక్షల బీమా  

పీఎంఎస్ బీవై కింద చేర్పించాలని రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం 
రూ.350 ప్రీమియం కడితే రూ.2 లక్షల ఇన్సూరెన్స్

హైదరాబాద్, వెలుగు: డ్వాక్రా గ్రూపుల్లో సభ్యులుగా ఉన్న మహిళలందరికీ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో చాలా మంది కరోనా బారినపడి చనిపోతున్నారు. ఫలితంగా ఆ కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతున్నాయి. అందుకే డ్వాక్రా సంఘాల సభ్యులు లేదా వారి జీవిత భాగస్వాములు కవర్ అయ్యేలా ప్రధాన మంత్రి సురేఖ బీమా యోజన(పీఎంఎస్ బీవై)లో చేర్పించాలని ఆయా రాష్ట్రాల గ్రామీణాభివృద్ధి శాఖలను కోరింది. ఇందుకోసం చర్యలు తీసుకోవాలని సూచిస్తూ రాష్ట్ర ప్రభుత్వాలకు ఇటీవల లేఖ రాసింది. అలాగే ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన(పీఎంజేజేబీవై) కింద కనీసం 70 శాతం మంది కవర్ అయ్యేలా చూడాలని పేర్కొంది. డ్వాక్రా గ్రూపుల సభ్యులు తీసుకునే వడ్డీ లేని రుణాల నుంచి లేదా వారి గ్రూపులోని కార్పస్ ఫండ్ నుంచి ఇన్సూరెన్స్ ప్రీమియం రూ.350 చెల్లించాలని సూచించింది. ప్రీమియం చెల్లించిన సభ్యులు ఏదైనా కారణంతో  దురదృష్టవశాత్తూ చనిపోతే వారి కుటుంబానికి రూ.2 లక్షలు అందించనున్నారు. 
రాష్ట్రంలో 41 లక్షల మందికి.. 
రాష్ట్రంలో పీఎంఎస్ బీవై కింద 41,16,977 మందిని చేర్పించాలని కేంద్రం రాష్ట్ర అధికారులకు టార్గెట్ పెట్టింది. పీఎంజేజేబీవై/లైఫ్ ఇన్సూరెన్స్ స్కీమ్ లో 21,91,235 మందిని చేర్పించాలని ఆదేశించింది. మహిళా సభ్యులకు, వారి జీవిత భాగస్వాములకు గ్రూప్ ఇన్సూరెన్స్ చేయించడంతోపాటు సభ్యులు చనిపోతే క్లెయిమ్ సెటిల్మెంట్ చేయడంలో కూడా ఫీల్డ్ స్టాఫ్ సహకరించాలని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సెక్రటరీ నాగేంద్ర నాథ్ సిన్హా ఈ మేరకు అన్ని రాష్ట్రాల సీఎస్ లను ఆదేశించారు.