హిమాచల్ సైనికుడికి రూ.20 లక్షల పరిహారం

  • 2 రోజుల ముందే సెలవు నుంచి విధుల్లోకి
  • అంతలో దారుణం.. అమరుడైన తిలక్ రాజ్
  • సంతాపం ప్రకటించిన హిమాచల్ సీఎం

పుల్వామా దాడిలో అమరులైన జవాన్లకు హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి జై రామ్ ఠాకూర్ సంతాపం ప్రకటించారు. వీర జవాన్ల కుటుంబాలకు అండగా నిలుస్తామని ఆయన చెప్పారు. దాడిలో ప్రాణాలు కోల్పోయిన తమ రాష్ట్ర సైనికుడు తిలక్ రాజ్ కుటుంబానికి  రూ.20 లక్షలు పరిహారంగా అందిస్తామని అన్నారు.

 

22 రోజుల వయసు కొడుకును వదిలి.. దేశం కోసం..

పుల్వామాలో నిన్న సీఆర్పీఎఫ్ జవాన్ల కాన్వాయ్ పై ఉగ్రవాదులు దాడి చేశారు. ఆ ఘటనలో 40 మందికి పైగా సైనికులు అమరులయ్యారు. వారిలో హిమాచల్ ప్రదేశ్ కు చెందిన తిలక్ రాజ్  (31) ఒకరు. కంగ్రా జిల్లాలో ఓ గ్రామానికి చెందిన ఆయన 2007 ఏప్రిల్ లో సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ గా చేరారు. విధుల్లో చేరే 22 రోజుల ముందే ఆయన భార్య సావిత్రి దేవి పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఆ పసికందును విడిచి పోవడానికి మనసు రాకపోయినా.. దేశ రక్షణలో భాగం కావాలన్న సంకల్పంతో ముందుకు సాగారు.

రెండ్రోజుల ముందే తిరిగి విధుల్లోకి..

12ఏళ్ల డ్యూటీలో అనేక ఆపరేషన్లలో పాల్గొన్నారు తిలక్ రాజ్. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో కూంబింగ్ లో యాక్టివ్ గా ముందుకు సాగారు. ఎన్ కౌంటర్ల సమయంలో ధైర్యంగా ఎదురుదాడికి దిగేవారు. కశ్మీర్ ప్రాంతంలో విధుల్లోకి వచ్చాక నిత్యం ఎదురయ్యే సవాళ్లను ఏ మాత్రం వెనుకడుగేయకుండా ఎదుర్కొనేవారు. వెన్ను చూపకుండా ముష్కర మూక ఏరివేతలో దూసుకెళ్లేవారు. విధుల్లో నిబద్ధతతో సాగే తిలక్ రాజ్ ఇటీవలే సెలవుపై ఇంటికి వచ్చారు. వెకేషన్ ముంగించుకుని రెండు రోజుల ముందే డ్యూటీలో చేరారు. అంతలో ఈ దారుణం జరిగిపోయిందని ఆయన కుటుంబ సభ్యులు విలపిస్తున్నారు. వారిని ఓదార్చడం ఎవరి తరం కావడం లేదు.

Latest Updates