పంచాయతీలకు ప్రతీ నెల రూ.339 కోట్లు : సీఎం కేసీఆర్

గ్రామ పంచాయతీలకు ఎట్టి పరిస్థితుల్లోనూ నిధుల కొరత రానివ్వబోమని సీఎం కేసీఆర్​ స్పష్టం చేశారు. గ్రామాల అభివృద్ధికి ప్రతి నెల రూ.339 కోట్లు విడుదల చేయాలనే నిర్ణయానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. పల్లెలు బాగుపడాలనే ఉద్దేశంతో గ్రామ కార్యదర్శి నుంచి డీపీవో వరకు అన్నిఖాళీలను భర్తీ చేసినట్లు ఆయన వెల్లడించారు. పల్లెల్లో పచ్చదనం, పరిశుభ్రత లక్ష్యంగా రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన 30 రోజుల యాక్షన్‌‌‌‌ ప్లాన్​ విజయవంతమైందని తెలిపారు. విద్యుత్ సమస్యలు  పరిష్కరించడంలో విద్యుత్‌‌‌‌ శాఖ అద్భుతంగా పనిచేసి, అన్ని శాఖల్లోకెల్లా నంబర్ వన్‌‌‌‌గా నిలిచిందని ప్రశంసించారు. యాక్షన్​ ప్లాన్​పై మంత్రులు, కలెక్టర్లు, డీపీవోలు, డీఎల్పీవోలు, ముఖ్యకార్యదర్శులతో సీఎం కేసీఆర్​ గురువారం ప్రగతి భవన్ లో సమావేశమై చర్చించారు. యాక్షన్‌‌‌‌ ప్లాన్‌‌‌‌లో భాగంగా శ్మశానవాటికలు, డంప్‌‌‌‌ యార్డులు,  నర్సరీల ఏర్పాటుకు చాలా గ్రామాల్లో స్థలాలను గుర్తించారని, మిగిలిన గ్రామాల్లో కూడా వీలైనంత త్వరగా వాటిని గుర్తించాలని, ఏ శాఖ పరిధిలో ఉన్నా సరే,  ప్రభుత్వ భూమి ఉంటే దాన్ని సామాజిక అవసరాల కోసం వాడుకోవాలని సీఎం సూచించారు. గ్రామ పంచాయతీల్లో మొక్కలకు నీళ్లు పోయడానికి, చెత్త సేకరణకు ట్రాక్టర్లు కొనుగోలు చేయాలని, ప్రతి ట్రాక్టర్ కు ట్యాంకర్, ట్రాలీ, ఫ్రంట్ బ్లేడ్ ఉండాలన్నారు. గ్రామాభివృద్ధి, పారిశుధ్యం, మొక్కల పెంపకం తదితర వాటి కోసం అత్యవసరమైన చోట ఖర్చు పెట్టడానికి వీలుగా ప్రతి జిల్లా కలెక్టర్‌‌‌‌కు రూ. 2 కోట్ల ప్రత్యేక నిధులు ఇవ్వనున్నట్లు సీఎం చెప్పారు. ఈ నిధులను కలెక్టర్లు విచక్షణతో వినియోగించాలన్నారు.

అడవులు తక్కువున్న చోట ప్రత్యేక కార్యక్రమాలు

రాష్ట్రంలో పచ్చదనం పెంచే లక్ష్యంతో అడవులు తక్కువగా ఉన్న కరీంనగర్, జనగామ, యాదాద్రి, సూర్యాపేట, వరంగల్ అర్బన్, గద్వాల్, నారాయణపేట తదితర జిల్లాల్లో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని అధికారులకు సీఎం సూచించారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం నుంచి అవార్డులు అందుకున్న పెద్దపల్లి కలెక్టర్ దేవసేన, సంగారెడ్డి కలెక్టర్ హనుమంతరావు, భూపాలపల్లి కలెక్టర్ వెంకటేశ్వర్లును సీఎం ప్రత్యేకంగా అభినందించారు. సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి తదితరులు పాల్గొన్నారు.

ఏజెన్సీల్లో త్రీఫేస్‌‌‌‌ కరెంటు కోసం కమిటీ

ఏజెన్సీ ప్రాంతాలతోపాటు ఇతర ఎస్టీ తండాలు, గూడేలు ఉన్న ప్రాంతాల్లో త్రీఫేజ్ విద్యుత్ సౌకర్యం కల్పించాలని సీఎం ఆదేశించారు. ఎస్టీలు నివసించే ప్రాంతాల్లో విద్యుత్ సమస్య పరిష్కరించడానికి ముగ్గురు సీనియర్ ఐఏఎస్ అధికారులతో కమిటీ నియమించారు. సోమేశ్ కుమార్, రఘునందన్ రావు, అజయ్ మిశ్రా ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు.

రాష్ట్రం లో ప్లాస్టిక్ పై నిషేధం

ప్లాస్టి క్ ఉత్పత్తి , అమ్మకాలను రాష్ట్రం లో నిషేధిం చాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. త్వరలోనే కేబినెట్ భేటీలో దీనిపై చర్చిం చి, ఉత్తర్వులు జారీ చేస్తామన్నారు. దీనికి సంబంధించి విధానాలు ఖరారు చేయాలని అధికారులను ఆదేశించారు. పర్యావరణాన్ని విపరీతంగా దెబ్బతీస్తూ, జీవకోటి మనుగడకే ముప్పుగా ప్లాస్టి క్ మారిందని ఆయన అన్నారు.

Latest Updates