బుట్టల పంపిణీలో రూ.4 కోట్లు గోల్ మాల్!

హైదరాబాద్, వెలుగు: పత్తిలో గులాబీ రంగు పురుగు (పింక్​బోల్ వార్మ్)ను నివారించేందుకు ప్రభుత్వం ఇచ్చిన ఫెరోమోన్ ట్రాప్స్(లింగాకర్షక బుట్టలు) పంపిణీలో అవినీతి జరిగిందని ఇంటర్నల్​డిపార్ట్​మెంటల్ కమిటీ తేల్చింది. టెండర్ల దగ్గర్నుంచి సప్లై వరకు ప్రతిచోట అక్రమాలు జరిగాయని గుర్తించింది. ఇందులో దాదాపు రూ.4 కోట్ల వరకు గోల్​మాల్ జరిగినట్లు అధికారులు చెబుతున్నారు. 2019 ఖరీఫ్ లో పత్తి పంటకు గులాబీ రంగు తెగులు ఎక్కువగా సోకడంతో రైతులకు ఫెరోమోన్​ట్రాప్స్, లూరెస్​లను పంపిణీ చేయాలని వ్యవసాయ శాఖ నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా 372 మండలాల్లో రెండు లక్షల ఎకరాలకు  రూ.8.27 కోట్లతో 16.76 లక్షల ఫెరోమోన్​ట్రాప్స్, 33.52 లక్షల లూరెస్ లను పంపిణీ చేయాలని ప్లాన్​చేసింది. ఒక్క యూనిట్​కు 8 ట్రాప్స్, 16 లూరెస్​చొప్పున టెండర్లు పిలిచారు. అయితే రూ.లక్ష కంటే ఎక్కువైనప్పుడు ఈ–-టెండర్ వేయాల్సి ఉండగా.. రూల్స్ కు విరుద్ధంగా షార్ట్ టెండర్లు నిర్వహించారు. మరోవైపు అంతకుముందు ఇండియన్​ఇనిస్టిట్యూట్​ఆఫ్​ కెమికల్ టెక్నాలజీ(ఐఐసీటీ) పంపిణీ చేసిన ఫెరోమోన్​ట్రాప్స్​కంటే 50 శాతం ఎక్కువకు టెండర్ ను కియా బయోటిక్​సంస్థకు ఇచ్చారు. సబ్​కాంట్రాక్ట్​ఇవ్వకూడదనే నిబంధననూ ఉల్లంఘించారు.

డీఏఓల సంతకాలు ఫోర్జరీ..

ఫెరోమోన్​ట్రాప్స్ 10 లక్షల లోపే రైతులకు పంపిణీ చేసినట్లు కమిటీ గుర్తించింది. బుట్టలు పంపిణీ చేయని చోట కూడా చేసినట్లు కంపెనీ సర్టిఫికెట్లు సబ్మిట్ చేసినట్లు పేర్కొంది. డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్ల (డీఏఓ) సంతకాలను ఫోర్జరీ చేసి యుటిలైజేషన్ సర్టిఫికెట్స్ (యూసీ) ఇచ్చినట్లు తేల్చింది. మరోవైపు 41 మండలాల్లో పత్తి తీసే సమయంలో ట్రాప్స్ ను పంపిణీ చేసినట్లు పేర్కొంది. సంతకాల ఫోర్జరీపై ఆయా డీఏఓలు కేసులు పెట్టాలని కమిటీ సూచించింది

Latest Updates