మిడ్​మానేరు టూరిజానికి రూ.400 కోట్లు

రాజన్నసిరిసిల్ల, వెలుగు:  సిరిసిల్ల మిడ్​మానేరును టూరిజం స్పాట్​గా తీర్చిదిద్దేందుకు ప్రతిపాదనలు రెడీ చేస్తున్నారు. మిడ్​మానేరు​బ్యాక్​వాటర్​ సమీపంలో 150 ఎకరాల్లో కాటేజీలు, హౌసింగ్​బోట్లు, ఆక్వాహబ్, పార్క్​లు, జల క్రీడల ఏర్పాటు, రోప్​వే, వేలాడే వంతెన, రిసార్ట్స్, హరితహోటల్, హెలిప్యాడ్ నిర్మించాలని ప్రాథమికంగా నిర్ణయించారు. మిడ్​మానేరు తీరం సుమారు 23 కి.మీ. పొడవు ఉంది. గుట్టలను ఆనుకుని ఎఫ్ టీఎల్​లెవల్​కంటే ఎత్తులో కనీసం 15 కి.మీ. రోడ్డు నిర్మించనున్నారు. ఈ పనులన్నింటికి సుమారు రూ.400 కోట్లు అవసరమవుతాయని అధికారుల అంచనా. దీంతోపాటు జిల్లాలోని నాంపల్లి గుట్టపై నెలవైన లక్ష్మీనరసింహ స్వామి గుట్ట నుంచి వేములవాడ రాజన్న ఆలయం వరకు కేబుల్​కార్స్​ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు తయారు చేశారు. రోడ్లు మెరుగుపడితే హైదరాబాద్​నుంచి రెండు గంటల్లో సిరిసిల్ల చేరుకోవచ్చని, ఐటీ ఉద్యోగులు సైతం వీకెండ్​ఎంజాయ్​ కోసం సిరిసిల్ల సందర్శించే అవకాశాలు ఉంటాయని అధికారులు చెబుతున్నారు.

90 శాతం ప్రభుత్వ భూములే…

ఈ నెల 11,12న అధికారులు రెండు రోజులపాటు హైదరాబాద్​లో సమీక్షా సమావేశాన్ని నిర్వహించి మిడ్​మానేరును పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. మిడ్​మానేరు బ్యాక్​వాటర్​సమీపంలో 90 శాతానికి పైగా ప్రభుత్వ భూములు ఉండటంతో భూసేకరణకు పెద్దగా ఖర్చవదు. మిడ్​మానేరు​బ్యాక్​వాటర్, సిరిసిల్లకు అతి సమీపంలో  సుమారు 550 మీటర్ల ఎత్తున్న రామప్పగుట్ట ఉండటం, ఈ గుట్టపై 40 ఎకరాలకు పైగా అనుకూలమైన స్థలం ఉండటంతో  అతిథిగృహం నిర్మించడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. మిడ్​మానేర్​ప్రాంతంలో రామప్పగుట్టను ఆనుకుని కాటేజీలు, 100 ఎకరాల్లో ఆక్వా హబ్, 50 ఎకరాల్లో కాటేజీలతోపాటు, జలక్రీడలు, చిల్ర్డన్​పార్క్, హౌస్​​ బోటింగ్, మానేరుపై ఊగే వంతెన, రైల్వే బ్రిడ్జి, రోప్​వే, మానేరు బ్యాక్​వాటర్​ఐలాండ్​లో విడిది కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక రూపొందించారు. నిధుల సమీకరణలో ప్రభుత్వంపై భారం పడకుండా పబ్లిక్, ప్రైవేట్(పీపీపీ) పద్ధతిలో టూరిజం స్పాట్​ను ఏర్పాటు చేస్తామని చెబుతున్నారు.

టూరిజానికి అనుకూల ప్రాంతం

మిడ్​మానేరును పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు మంత్రి కేటీఆర్​ఆదేశాలతో ముందుకు వెళ్తున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లాలో సహజసిద్ధమైన వనరులున్నాయి. ఇటు ఆధ్యాత్మికంగా.. అటు ప్రకృతి పర్యాటకంగా అభివృద్ధి  చెందేందుకు అన్ని అవకాశాలు ఉన్నాయి. జిల్లా కేంద్రానికి కేవలం మూడు కి.మీ. దూరంలో టూరిజం స్పాట్​ఉంటుంది. ఆ పక్కనే వేములవాడ రాజరాజేశ్వర ఆలయం, నాంపల్లి పుణ్యక్షేత్రం ఇవన్నీ కలసివస్తాయి. రాజన్న దర్శనానికి వచ్చే భక్తులు మిడ్​మానేరు ప్రాంతంలో నిర్మించే కాటేజీలో విడిది చేసి.. దర్శనానికి వెళ్లే రోజులు రానున్నాయి.

– కృష్ణభాస్కర్, కలెక్టర్, రాజన్నసిరిసిల్ల

Latest Updates