ఐదు రాష్ట్రాల అదనపు రుణాలకు కేంద్రం అనుమతి

ఆర్థిక మంత్రిత్వ శాఖలోని వ్యయాల విభాగం అదనపు ఆదాయ వనరులు సమకూర్చుకోడానికి ఐదు రాష్ట్రాలకు అనుమతి మంజూరు చేసింది. బహిరంగ మార్కెట్ నుంచి మొత్తం రూ. 9,913 కోట్ల వరకు అప్పు సమీకరించుకోవటానికి అనుమతి లభించినట్టైంది. ఐదు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, గోవా, కర్ణాటక, త్రిపుర ఉన్నాయి. ఈ రాష్ట్రాలు వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ వ్యవస్థకు అవసరమైన అగ్రిమెంట్ నియమాలను పూర్తిచేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది.

రాష్ట్రాల వారీగా వివరాలు..

ఆంధ్రప్రదేశ్ –  రూ. 2525 కోట్లు

తెలంగాణ –   రూ. 2,508 కోట్లు

కర్ణాటక –      రూ.4,509 కోట్లు

గోవా –         రూ.223 కోట్లు

త్రిపుర –      రూ. 148 కోట్లు

కరోనా వైరస్ కారణంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలు అదనంగా ఋణాలు సమీకరించుకోవటానికి అనుమతించింది. అయితే, ఇది  2020-21 ఆర్థిక సంవత్సరానికి GDP లో 2%  మించకూడదు. ఆ విధంగా మొత్తం రూ. 4,27,302కోట్ల వరకు రాష్ట్రాలు రుణం సమీకరించుకోవచ్చు. ఇందులో 1 శాతం ఈ కింద తెలిపిన నాలుగు రాష్ట్ర స్థాయి సంస్కరణలకు ఖర్చు చేయాలి. ఒక్కో సంస్కరణకు GSDP 0.25% వెయిటేజ్ లభిస్తుంది. వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ వ్యవస్థ అమలు, వ్యాపార నిర్వహణను సులభతరం చేసే సంస్కరణలు, పట్టణప్రాంత స్థానిక సంస్థ, వినియోగదారు సేవల సంస్కరణ, విద్యుత్ రంగ సంస్కరణలు.

ఇంకా మిగిలిన 1 శాతం అదనపు రుణ పరిమితి రెండు విడతలుగా 0.5 శాతం చొప్పున విడుదల చేస్తారు. ముందు అన్ని రాష్ట్రాలకూ కలిపి ఉమ్మడిగా, రెండోవిడతగా కనీసం మూడింటికి ఖర్చు చేస్తామన్న హామీతో  విడుదలచేస్తారు. భారత ప్రభుత్వం ఇప్పటికే 0.5 శాతం ఒఎంబి రూపంలో సమీకరించుకోవటానికి 2020 జూన్ లో అనుమతి మంజూరు చేసింది. ఇది రాష్ట్రాలు అందుబాటులో ఉంచిన రూ. 1,06,830 కోట్లకు అదనం.

Latest Updates