- అక్టోబర్ 12 టెండర్ సమర్పణకు తుది గడువు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో రూ.5,756 కోట్లతో చేపట్టనున్న ప్రతిష్టాత్మక అండర్ గ్రౌండ్ కేబుల్ ప్రాజెక్టు ప్రీ-బిడ్ సమావేశానికి దేశవ్యాప్తంగా 50 కంపెనీల ప్రతినిధులు హాజరయ్యారు. గురువారం మింట్ కాంపౌండ్‌లో జరిగిన ఈ భేటీలో పలు రాష్ట్రాల నుంచి కేబుల్ తయారీ, జాయింటింగ్ కిట్లు, నిర్మాణ రంగ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. అక్టోబర్ 12 నాటికి టెండర్ సమర్పణకు తుది గడువు ఉండడంతో.. డిస్కమ్ అధికారులు టెండర్ విధానం, పనుల నాణ్యతా ప్రమాణాలను వారికి వివరించారు.
ఈ సందర్భంగా సదరన్ డిస్కమ్ సీఎండీ జితేశ్ వి.పాటిల్ మాట్లాడుతూ.. ఇది తెలంగాణను దేశానికే ఆదర్శంగా నిలిపే కీలక విద్యుత్ ప్రాజెక్టని తెలిపారు. హైదరాబాద్ నగర ప్రతిష్టకు ప్రతీకగా నిలిచే ఈ ప్రాజెక్టులో నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడబోమని, అత్యుత్తమ ప్రమాణాలతో పనులు చేపడతామని స్పష్టం చేశారు. పారదర్శకత, నాణ్యత, వేగవంతమైన అమలు అనే మూడు ప్రధాన సూత్రాలతో ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్తామన్నారు.
సమావేశంలో పాల్గొన్న వివిధ కంపెనీల ప్రతినిధులు టెండర్ నిబంధనలు, అర్హతలు, బ్యాంకు గ్యారంటీలు, సాంకేతిక స్పెసిఫికేషన్లపై పలు ప్రశ్నలు లేవనెత్తగా.. అధికారులు వాటిని నమోదు చేసుకున్నారు. వెండర్ల సందేహాలను ప్రాజెక్ట్ డైరెక్టర్ వి.శివాజీ, చీఫ్ ఇంజనీర్ మోహన్ వివరంగా నివృత్తి చేశారు. అవసరమైన అన్ని అంశాలపై త్వరలోనే లిఖితపూర్వక స్పష్టత ఇస్తామని అధికారులు తెలిపారు. ఈ ప్రాజెక్టు విజయవంతమైతే హైదరాబాద్ దేశంలోని ఇతర మెట్రో నగరాలకు రోల్ మోడల్‌గా మారుతుందని, జాతీయ స్థాయిలో రాష్ట్రానికి మరింత మంచి గుర్తింపు వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
