RTA యాప్ : సెల్ఫీ అప్​లోడ్​తో బండి రిజిస్టర్​ 

బండిని రిజిస్టర్​ చేసుకోవాల్నా సెల్ఫీ అప్​లోడ్​ చేస్తే సరి!
త్వరలోనే రవాణా శాఖ ప్రత్యేక యాప్​ 
వాహనదారులకు తీరనున్న తిప్పలు
త్వరలోనే అందుబాటులోకి

ప్రస్తుతం యాప్​ తయారీ దశలోనే ఉంది. త్వరలోనే అందుబాటులోకి తీసుకొస్తం. దీనిలో అప్లికేషన్​తోపాటు సెల్ఫీ దిగి అప్​లోడ్​ చేస్తే సరిపోతుంది. ఆర్టీఏ కార్యాలయానికి రావాల్సిన అవసరం ఉండదు. మొదట కొన్ని సేవలు తెస్తం. ఆ తర్వాత పూర్తిగా అమల్లోకి వస్తయి. – రమేశ్​, జాయింట్​ ట్రాన్స్​పోర్ట్​ కమిషనర్

హైదరాబాద్​, వెలుగు: లైసెన్స్​ కావాలన్నా, బండి రిజిస్టర్​ చేసుకోవాలన్నా ఆర్టీఏ ఆఫీసుల్లో క్యూ కట్టాల్సిన పరిస్థితి. ఏజెంట్లను నమ్ముకుని జేబులు గుల్ల చేసుకోవాల్సిన దుస్థితి. అక్కడ పడే తిప్పలు అన్నీ ఇన్నీ కావు. ఇకపై ఆ తిప్పలకు చెక్​ చెప్పేలా అరచేతిలోనే ఆర్టీఏ సేవలు అందనున్నాయి. ఒక్క సెల్ఫీ దిగి, దరఖాస్తుతో పాటు అప్​లోడ్​ చేస్తే సరి.. అన్ని పనులు ఇంటి నుంచే అయిపోతాయి. అందుకోసం త్వరలోనే ప్రత్యేక యాప్​ను తీసుకురాబోతోంది రవాణా శాఖ. ప్రస్తుతం అది టెస్టింగ్​ దశలోనే ఉందని, త్వరలోనే దానిని ప్రారంభిస్తామని అధికారులు చెబుతున్నారు. యాప్​ తయారీ బాధ్యతను ఓ ప్రైవేట్​ కంపెనీకి ఇచ్చారు. ఇప్పటికే ఏజెంట్ల బెడదను తప్పించి పనులు ఈజీగా కావడానికి 59 రకాల సేవలను ఆన్​లైన్​లో అందిస్తోంది ఆర్టీఏ. మిగతా పనులకు ఆఫీసుకు వెళ్లడం తప్పనిసరి.

వాటికీ చెక్​ చెప్పి ఇంటి నుంచే అన్ని పనులూ చేసుకునేలా ఈ కొత్త యాప్​ను తయారు చేయిస్తోంది. రెండు దశల్లో యాప్​ను అందుబాటులోకి తీసుకురానున్నారు. మొదటి దశలో 34 సర్వీసులు, రెండో దశలో మరికొన్ని సర్వీసులు అందుబాటులోకి తీసుకొస్తారు. ఆల్రెడీ దిగిన ఫొటోలను అప్​లోడ్​ చేయకుండా, అప్పటికప్పుడు సెల్ఫీ దిగి అప్​లోడ్​ చేసేలా యాప్​కు సెక్యూరిటీ ఫీచర్లు పెడుతున్నారు. అవసరమైన ఐడీ కార్డులను అప్​లోడ్​ చేసేందుకూ అందులోనే అవకాశం కల్పిస్తారు. అన్నీ కరెక్ట్​గా ఉంటే నేరుగా ఇంటికే మనం అప్లై చేసుకున్న పేపర్లను పంపిస్తారు. డ్రైవింగ్​ లైసెన్స్​కు అప్లై చేసుకున్నోళ్లు మాత్రం డ్రైవింగ్​ టెస్ట్​ కోసం ఒక్కసారి ఆఫీసుకు వెళ్లాల్సి ఉంటుంది.

SEE ALSO:ఎమ్మెల్యేలు, మంత్రులకు ఇయ్యాల పరీక్షే

Latest Updates