డ్రైవర్ కు ఫిట్స్..క్వాలీస్ ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు

కామారెడ్డి : డ్రైవర్ కు ఫిట్స్ రావడంతో ఎదురుగా వస్తున్న క్వాలీస్ ను ఢీకొట్టింది ఆర్టీసీ బస్సు. ఈ సంఘటన కామారెడ్డి మండలం అడ్లూరు బైపాస్‌ నేషనల్ హైవే దగ్గర బుధవారం సాయంత్రం జరిగింది. అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగనప్పటికీ కొంతమందికి స్వల్ప గాయాలయ్యాయి.  హైదారాబాద్‌ నుంచి నిజామాబాద్‌ వెళ్తున్న నిజామాబాద్‌ డిపో-2 రాజధాని బస్సు డ్రైవర్‌ రాంలాల్‌ అకస్మాత్తుగా ఫిట్స్‌ రావడంతో బస్సు అదుపుతప్పి డివైడర్‌ ను దాటి.. ఎదురుగా వస్తున్న క్వాలీస్‌ ను ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో క్వాలీస్‌ తో పాటు బస్సు 100 మీటర్లు మేర దూసుకెళ్లింది. రోడ్డు పక్కన ఉన్న సైడ్ వాల్‌ ను ఢీకొట్టి బస్సు ఆగింది. ఈ ప్రమాదంలో బస్సు, క్వాలిస్‌ ముందు భాగాలు దెబ్బతిన్నాయి. క్వాలిస్ లో ఉన్న ప్రయాణికులు సురక్షితంగా బయటపడగా.. బస్సులోని కొందరు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. బస్సులో ప్రయాణిస్తున్న డాక్టర్లు కొందరు అప్రమత్తమై డ్రైవర్‌ ను వెంటనే 108 వాహనంలో కామారెడ్డి హస్పిటల్ కు తరలించారు. డ్రైవర్‌ కు ఎలాంటి ప్రాణాపాయం లేదని తెలిపారు డాక్టర్లు. తృటిలో పెద్ద ప్రమాదం తప్పిందని ఊపిరిపీల్చుకున్నారు ప్రయాణికులు.

Latest Updates