చిట్టీల పేరుతో రూ.6 కోట్లు వ‌సూలు.. డ‌బ్బుతో ఉడాయించిన డిపో కంట్రోలర్

హైద‌రాబాద్: చిట్టీల వ్యాపారం చేస్తున్నట్లు న‌మ్మించి.. తోటి కార్మికుల నుంచి రూ.6 కోట్లు వ‌సూలు చేసి ఉడాయించిన ఆర్టీసీ డిపో కంట్రోల‌ర్‌పై బాధితులు రాచ‌కొండ సీపీ కి ఫిర్యాదు చేశారు. వివ‌రాల ప్ర‌కారం.. ‌ దిల్‌సుఖ్‌నగర్‌ డిపోలో కంట్రోలర్‌గా ప‌నిచేసే కందూరి సురేందర్ అనే వ్య‌క్తి.. ‌ చిట్టీల వ్యాపారం, ఫిక్స్​డ్​ డిపాజిట్ల పేరుతో తోటి ఆర్టీసీ కార్మికుల నుంచి రూ.5లక్షల నుంచి రూ.30లక్షల వరకు వ‌సూలు చేశారు. అలా దిల్‌సుఖ్‌నగర్‌, హయత్‌నగర్‌, మిథానీ, ఉప్పల్‌, రాణిగంజ్‌ తదితర డిపోలకు చెందిన 100మందికి పైగా ఆర్టీసీ కార్మికులు సురేందర్‌ వద్ద చిట్టీలు, ఎఫ్‌డీలు చెల్లించారు. ఇలా. రూ. 6-7 కోట్లు వసూలు చేసిన సురేంద‌ర్ ఆ త‌ర్వాత క‌నిపించ‌కుండా మాయ‌మ‌య్యాడు.

రిటైర్డ్​ ఉద్యోగులైన తాము సురేందర్​ ని నమ్మి చిట్టీలు వేశామని, డబ్బులు అడిగినప్పుడల్లా ఇస్తానంటూ మాయమాటలు చెప్పి మోసం చేశాడ‌ని బాధితులు వాపోయారు. కరోనా సమయంలో కలెక్షన్​ అవ్వడం లేదంటూ.. గత రెండు నెలలుగా ​ తప్పించుకుని తిరుగుతున్నాడ‌ని, అతనితోపాటు పి.ఆర్​. రెడ్డి, అమర్​నాథ్​ రెడ్డి అనే ఇద్దరు వ్య‌క్తులు​ కూడా ఇందులో ఉన్నార‌న్నారు. కూతురు పెళ్లికోసం దాచుకున్న డబ్బులు..ఇలా మోస‌గాళ్ల చేతిలో ప‌డటంతో ఏమి చేయాలో తెలియక ఆందోళన చెందుతున్నామని ఓ రిటైర్డ్ ఉద్యోగి ఆవేద‌న వ్య‌క్తం చేశారు. వెంటనే నిందితుడైన సురేందర్​ని అదుపులోకి తీసుకుని తమకు న్యాయం చేయాలని బాధితులు రాచకొండ సీపీ మహేష్​ భగవత్​కు ఫిర్యాదు చేశారు.

Latest Updates