విలీనంపై తగ్గేది లేదు.. ఏ ఒక్క డిమాండ్​నూ వదులుకోం

  • ఈ డిమాండ్ వదులుకుంటామని కోర్టులో చెప్పినట్లు నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధమే
  • దమ్ముంటే ప్రభుత్వాన్ని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లాలె
  • డిమాండ్ల పరిశీలన కమిటీకి చట్టబద్ధత లేదు
  • వాళ్లు ఎవరితో చర్చిస్తారు, ఏంతేల్చుతరు?: అశ్వత్థామరెడ్డి
  • హైదరాబాద్​లోని దిల్​సుఖ్​నగర్​ డిపో వద్ద ధూంధాం, వంటావార్పు
  • హాజరై సంఘీభావం ప్రకటించిన అఖిలపక్ష నేతలు

హైదరాబాద్‌‌, వెలుగు:

తాము పెట్టిన అన్ని డిమాండ్లు నెరవేరే వరకు కూడా సమ్మె ఆగదని, విలీనంపై వెనక్కి తగ్గినట్టు తాము ఎక్కడా చెప్పలేదని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్‌‌ అశ్వత్థామరెడ్డి స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్​ పూటకో మాట మాట్లాడుతున్నారని, యూనియన్ల నేతల మధ్య చిచ్చురేపి, చీలిక తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ఆర్టీసీ విలీనం అవసరం లేదని లాయర్లు కోర్టులో అన్నట్టు నిరూపిస్తే దేనికైనా సిద్ధమని సవాలు చేశారు. ఉప ఎన్నికలు వేరు, సాధారణ ఎన్నికలు వేరని, టీఆర్ఎస్‌‌ కు దమ్ముంటే ప్రభుత్వాన్ని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లాలన్నారు. ఆర్టీసీ సమస్యలపై ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలని, తమ పోరాటం సరికాదని వారు అంటే వెంటనే డ్యూటీల్లో చేరుతామని అన్నారు. ఆర్టీసీ సమ్మె, నిరసన కార్యక్రమాల్లో భాగంగా బుధవారం హైదరాబాద్​లోని దిల్‌‌సుఖ్‌‌నగర్‌‌ బస్ డిపో వద్ద ధూంధాం, వంటావార్పు కార్యక్రమాన్ని నిర్వహించారు. అఖిలపక్ష నేతలు ఇందులో పాల్గొని సంఘీభావం తెలిపారు. తర్వాత అశ్వత్థామరెడ్డి మీడియాతో మాట్లాడారు. ఎలక్షన్లు వస్తున్నాయని లక్ష జెండాలు తయారు చేయించామని, ఇక జెండా కలర్‌‌ మార్చాల్సిన అవసరం ఏర్పడిందని పేర్కొన్నారు. ఆర్టీసీ సమస్యలను పట్టించుకోని ఏ ప్రభుత్వం, ఏ పార్టీ అయినా తమకు దూరమేనని చెప్పారు. అబద్ధాలు చెబుతున్నారంటూ తమపై ఆరోపణలు చేస్తున్నారని, దేనిపై అయినా తాము బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.

రాష్ట్రం నిర్బంధాల వేదిక అయింది: చాడ

1932లో ఆర్టీసీ ఆవిర్భవించినప్పుడే సంఘం ఏర్పాటైందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి అన్నారు. యూనియన్లు వద్దంటున్నారని, మరి ప్రైవేట్ సిబ్బంది కూడా సంఘాలు పెట్టుకోవడం లేదా అని నిలదీశారు.

కేసీఆర్‌‌ ఇంట్లో పనిచేసే వంటవాళ్లకు కూడా యూనియన్‌‌ ఉందని, సంఘం పెట్టుకునే హక్కు ఎవరికైనా ఉందని స్పష్టం చేశారు. ప్రజలు తిరుగుబాటు చేస్తే పోలీసులు, నాయకులు ఎవరూ ఆపలేరని.. హక్కులను సాధించుకునే దాకా ఉద్యమిస్తామని చెప్పారు. రాష్ట్రాన్ని నిర్బంధాల వేదికగా మార్చారని మండిపడ్డారు.

కేసీఆర్‌‌పై కేసులు పెట్టాలె: నర్సిరెడ్డి

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం కుదరదని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌‌ రావు అంటున్నారని, టీడీఎల్పీని టీఆర్‌‌ఎస్‌‌లో విలీనం చేయడం మాత్రం కుదిరిందా అని టీడీపీ నేత నర్సిరెడ్డి నిలదీశారు. కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. కార్మికుల ఆత్మహత్యలకు కారణమైన కేసీఆర్‌‌పై కేసులు పెట్టాలన్నారు. సకాలంలో మందు ఇచ్చారని సంతోష్‌‌ కుమార్‌‌కు రాజ్యసభ పదవిని, మందులో సోడా కల్పినందుకు జగదీశ్‌‌ రెడ్డికి మంత్రి పదవిని ఇచ్చారని, ప్రజలకు మాత్రం ఏం చేయలేదని కామెంట్​ చేశారు. రాష్ట్రం అప్పుల్లో ఉందని, దాన్ని కూడా అమ్మేస్తారా అని నిలదీశారు.

పువ్వాడ రాజీనామా చేయాలె:రాములు నాయక్‌‌

రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌‌కుమార్‌‌కు చీమూనెత్తురు ఉంటే మంత్రి పదవికి రాజీనామా చేయాలని రాములునాయక్​ డిమాండ్‌‌ చేశారు. కార్మికుల సమ్మెకు కాంగ్రెస్‌‌ పార్టీ పూర్తిగా మద్దతిస్తోందన్నారు. యూనియన్లు ఉండొద్దని అంటున్నారని, మరి కేసీఆర్‌‌ అడ్వైయిజర్‌‌గా ఉన్న సింగరేణి యూనియన్‌‌ను, టీఎన్జీవో సంఘాన్ని కూడా రద్దు చేయాలని డిమాండ్‌‌ చేశారు.

కాలయాపన కోసమే కమిటీలు

డిమాండ్ల పరిశీలన కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీకి చట్టబద్ధత లేదని అశ్వత్థామరెడ్డి అన్నారు. తాము పెట్టిన అన్ని డిమాండ్లను నెరవేర్చాల్సిందేనని, ఏ ఒక్కదాన్నీ వదులుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.

చర్చల కోసం ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆహ్వానం అందలేదని, కమిటీ ఎవరితో చర్చిస్తుందో చెప్పాలని డిమాండ్‌ చేశారు. కమిటీల పేరుతో కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడానికి ఉన్న ఇబ్బందేమిటో సీఎం కేసీఆర్​ చెప్పాలని డిమాండ్​ చేశారు. తెలంగాణ వస్తే ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామని కేసీఆర్​ చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. సీఎం కేసీఆర్ కు ఆర్టీసీ కార్మికులు వద్దుగానీ, ఆర్టీసీ ఆస్తులు మాత్రం కావాలని, వాటిని కాజేసేందుకు కేసీఆర్ కంకణం కట్టుకున్నారని విమర్శించారు.

రేపు ఓయూలో బహిరంగ సభ

ఆర్టీసీ కార్మికుల పోరాటానికి మద్దతుగా ఈ నెల 25న ఉస్మాని యా యూనివర్సిటీలో స్టూడెంట్స్​ జేఏసీ ఆధ్వర్యంలో సభ నిర్వహిం చనున్నారు. అఖిలపక్ష నేతలు ఈ సభ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాల్లో మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, పీవోడబ్ల్యూ నేత సంధ్య, టీజేఎస్‌ నేత వెంకట్‌రెడ్డి, పలు ప్రజా సంఘాలు, ఆర్టీసీ జేఏసీ నేతలు పాల్గొన్నారు.

 

 

Latest Updates