ఉద్యోగ సంఘాలు మాలో ఆత్మస్థైర్యం నింపాయి: అశ్వత్థామ రెడ్డి

  • ఆర్టీసీ కార్మికుల సమ్మెకు TEA మద్దతు

హైదరాబాద్: రోజు రోజుకూ తమ సమ్మెకు మద్దతు పెరుగుతోందని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి అన్నారు. తమకు అండగా నిలుస్తున్న అన్ని ఉద్యోగ సంఘాలకు ఆయన ధన్యవాదాలు చెప్పారు. బుధవారం హైదరాబాద్ లోని లిబర్టీలో తెలంగాణ ఎంప్లాయిస్ అసోసియేషన్ (TEA) నేతలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆర్టీసీ సమ్మెకు మద్దతు కోరగా.. వారు సానుకూలంగా స్పందించారు. ఆర్టీసీ కార్మికులకు పూర్తి మద్దతు ఉంటుందని, ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని TEA అధ్యక్షుడు సంపత్ సూచించారు. అన్ని ఉద్యోగ సంఘాలను కలుపుకొని పోరాటం ద్వారా హక్కులు సాధించుకుందామని చెప్పారు.

TEA మద్దతు ప్రకటించినందుకు అశ్వత్థామరెడ్డి కృతజ్ఞతలు చెప్పారు. తమ సమ్మెకు ఉద్యోగ సంఘాలు మద్దతు ప్రకటించడం ద్వారా కార్మికుల్లో ఆత్మస్థైర్యం నింపుతున్నాయని అన్నారు.

రవాణా వ్యవస్థను నాశనం చేశారు

తెలంగాణ ఉద్యమంలో ప్రమేయం లేనివారితో చర్చలు జరపబోమని అశ్వత్థామరెడ్డి స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ తమ పోరాటానికి ప్రజల్ని దూరం చేయాలని చూస్తున్నారని ఆరోపించారాయన. ఆ ప్రయత్నాలేవీ ఫలించవన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత బస్సులు తగ్గాయని, రవాణా వ్యవస్థను నాశనం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ.1500 కోట్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెల్లిస్తుంటే 750కోట్ల నష్టం ఎట్లా వస్తోందని ప్రశ్నించారు.

తర్వాత ఏ ఉద్యోగ సంఘాన్ని టార్గెట్ చేస్తారో

సీఎం కేసీఆర్ రెవెన్యూ ఉద్యోగులను, ఆర్టీసీ కార్మికులను టార్గెట్ చేస్తున్నారని, త్వరలో అన్ని ఉద్యోగ సంఘాలకు ఈ పరిస్థితే వస్తుందని అన్నారు అశ్వత్థామ రెడ్డి. ప్రజా రవాణా వ్యవస్థను ,ఆర్టీసీ ఆస్తులను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. భవిష్యత్ లో ఎవరికి ఎలాంటి సహాయ సహకారాలు అవసరమైన ఆర్టీసీ జేఏసీ పూర్తిగా సహకరిస్తుందని చెప్పారాయన.

Latest Updates