టీఆర్ఎస్ కు ఓటేయకుంటే.. పుట్టే బిడ్డల్నీ కననీయరేమో

కేసీఆర్ పై ఆర్టీసీ జేఏసీ నేతల ధ్వజం

హైదరాబాద్: సీఎం కేసీఆర్ పిచ్చి తుగ్లక్ లా మాట్లాడుతున్నారని ఆర్టీసీ జేఏసీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీసీలో కొత్తగా ఉద్యోగంలో చేరే వాళ్లు ఏ యూనియన్ లోనూ చేరబోనని షరతు పట్టడంపై మండిపడ్డారు ఈయూ నేత రాజిరెడ్డి. ‘పిల్లల్ని కనేటప్పుడు ఆపరేషన్ రూమ్ లోకి వెళ్లి ఆ పుట్టే బిడ్డ టీఆర్ఎస్ కు ఓటు వేసేలా అయితే సరే లేదంటే బిడ్డని కనొద్దు అనే దుర్మార్గపు ఆలోచన ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్’ అని ఎద్దేవా చేశారు. ఆయన తీరును ఖండిస్తున్నామని అన్నారు. ఇతర రాష్ట్రాల కంటే ఎక్కువ జీతాలు తెలంగాణలో ఉన్నాయని సీఎం అబద్దాలు చెబుతున్నారని, అది నిరూపిస్తే సమ్మె ఆపేసి, విధుల్లో చేరుతామని సవాలు విసిరారు.

మరో సకల జనుల సమ్మె.. బతుకు తెలంగాణ కావాలె

ముఖ్యమంత్రి స్థాయిలో ఎంత భయపెట్టినా వెనక్కి తగ్గకుండా కార్మికులు సమ్మె చేస్తున్నారని రాజిరెడ్డి అభినందించారు. సమ్మె నాయకులు చేయడం లేదని, కార్మికుల్లోనుంచి పుట్టిందన్నారు. దీన్ని ఎవరూ అణచివేయలేరని, ఇది మరో సకల జనుల సమ్మె కావాలన్నారు. బంగారు తెలంగాణ అంటూ ప్రజల్ని కేసీఆర్ మభ్యపెడుతున్నారని, తమకు ముందు బతుకు తెలంగాణ కావాలని అన్నారు.

నిరుద్యోగుల్లారా వెళ్లొద్దు

ఆర్టీసీ సమ్మెకు ప్రజలు, నిరుద్యోగులు సహకరించాలని కోరారు జేఏసీ నేత రాజిరెడ్డి. తాత్కాలిక ఉద్యోగాలకు నిరుద్యోగ యువత వెళ్లొద్దని పిలుపునిచ్చారు. ఈ సమ్మె తెలంగాణ యువత కోసమేనని, తమ డిమాండ్లు నెరవేరితే కొత్తగా 6 వేల ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయని చెప్పారు.

రెండ్రోజులకే దోచుకుంటున్నారు

రెండ్రోజులు ఆర్టీసీ లేకుంటేనే ప్రైవేటు రవాణా సంస్థలు దోచుకుంటున్నాయని, దీన్ని ప్రజలు ప్రత్యక్షంగా చూస్తున్నారని అన్నారు రాజిరెడ్డి. అదే రవాణా వ్యవస్థ శాశ్వతంగా ప్రైవేటు చేతుల్లోకి వెళ్లిపోతే ఏమైపోతుందో ఆలోచించాలని కోరారు. ఆర్టీసీని కాపాడేందుకు తాము ప్రయత్నిస్తున్నామని, ఇప్పడు జరిగిన తాత్కాలిక ఇబ్బందికి మన్నించాలని, కార్మికులకు సహకరించాలని కోరారు. మరో తెలంగాణ ఉద్యమంలా ప్రజలంతా కలిసి పోరాడాలని అన్నారు.

Latest Updates