ఆర్టీసీ జాగాలు ఆం బుక్క

లైఫ్​ లాంగ్​ లీజ్ దక్కేలా 
రూట్ క్లియర్
మూడేళ్లుగా లీజు రెంట్
ఎగ్గొట్టిన యువ ఎమ్మెల్యే
పెట్రోల్​ బంక్ లన్నీ బంధువుకిచ్చేలా
చక్రం తిప్పిన ఎంపీ
వరంగల్​, కరీంనగర్​లో ఆస్తులకు ఎసరు పెట్టిన
ఎంపీ, మాజీ ఎంపీ

హైదరాబాద్,​ వెలుగు: ఆర్టీసీ ఆస్తులను కొల్లగొట్టడంలో అధికార పార్టీ నేతలే టాప్​ లిస్ట్ లో ఉన్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న  కోట్లాది రూపాయల విలువ చేసే ఆర్టీసీ స్థలాలను ధారాదత్తం చేసుకున్న వారిలో కొందరు  టీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, వాళ్ల బంధువుల పేర్లు వినిపిస్తున్నాయి. వివిధ కంపెనీల పేర్లతో టెండర్లు దాఖలు చేసి లీజుల పేరిట ఆర్టీసీ స్థలాలను సొంతం చేసుకున్నారు.

ప్రభుత్వం తమదే కావటంతో  నిబంధనలన్నీ తమకు అనుగుణంగా మలుచుకుని… జీవితాంతం ఆర్టీసీ స్థలాలను అనుభవించేలా ప్లాన్​ చేసుకున్నారు. (మొదటి పేజీ తరువాయి)

33 ఏళ్లు.. అవసరమైతే ఆ తర్వాత పొడిగించుకునేందుకు వీలుగా స్కెచ్ వేసుకున్నారు.  అన్ని సిటీలు, టౌన్లలో ఆర్టీసీ బస్​ స్టాండ్​లు, బస్ డిపోలు, వర్క్ షాపులు ప్రధాన సెంటర్లలోనే ఉన్నాయి. వీటి విలువ ఇప్పుడు కోట్లల్లోకి చేరింది. అందుకే ఆర్టీసీ స్థలాల్లో షాపింగ్ మాల్స్, మల్టీప్లెక్స్‌‌‌‌లు.. పెట్రోల్​ బంక్​లు పెట్టేందుకు చాపకింద నీరులాగ ఫైళ్లు కదిపారు.

ఆర్మూర్‌‌‌‌ బస్టాండ్‌‌‌‌ పక్కన..

నిజామాబాద్​ జిల్లాలోని ఆర్మూర్ ఆర్టీసీ బస్టాండ్ పక్కన ఉన్న ఏడు వేల గజాల స్థలాన్ని అయిదేళ్ల కిందటే బీవోటీ పద్ధతిలో లీజు​కు కట్టబెట్టారు. 100 కోట్ల రూపాయల విలువ చేసే ఈ షాపింగ్​ మాల్​ ఇప్పుడు అధికార పార్టీ ఎమ్మెల్యే భార్య పేరిట ఉంది. ఏడాదికి రూ.38 లక్షలు కిరాయి కట్టే ఒప్పందంపై ఈ స్థలాన్ని సొంతం చేసుకున్నారు.
మూడేళ్లుగా స్థలంకు లీజ్​ రెంట్​ను చెల్లించకుండా ఎమ్మెల్యే బకాయి పడటం ఆర్టీసీకి నష్టం తెచ్చినట్లయిందని సోషల్​ మీడియాలో వార్తలు గుప్పుమంటున్నాయి.

వరంగల్‌‌‌‌ సిటీ నడిబొడ్డున

వరంగల్​ సిటీ నడి బొడ్డున  హంటర్ రోడ్డులో ఆర్టీసీ  టైర్ రిట్రేడింగ్ స్థలాన్ని లీజు పేరుతో  ఉమ్మడి జిల్లాకు చెందిన ఎంపీ సొంతం చేసుకున్నారు. ఇందులో ఉమ్మడి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలకు వాటాలున్నట్లు ప్రచారంలో ఉంది. దాదాపు రూ.80 కోట్లు విలువ చేసే ఈ స్థలాన్ని ఏడాదికి రూ.48 లక్షలు ఇచే అగ్రిమెంట్‌‌‌‌తో దక్కించుకున్నారు. త్వరలోనే ఇక్కడ మల్టీప్లెక్స్​ నిర్మించనున్నారు. ఇదే సిటీలో వరంగల్​ పాత బస్​ డిపో దగ్గరున్న రూ.25 కోట్ల విలువైన స్టాఫ్‍ క్వార్టర్స్​ స్థలాన్ని 33 ఏళ్లకు లీజుకు ఇచ్చారు. ఇందులోనే గులాబీ నేతలే సిండికేట్​గా ఉన్నారు.

115 బంకులు ఒక్కరికే..

రాష్ట్రంలో దాదాపు115 చోట్ల పెట్రోల్‌‌‌‌‌‌‌‌ బంక్​ల ఏర్పాటుకు ఒకే వ్యక్తికి అవకాశం ఇచ్చారు. 80 చోట్ల ఎన్‌‌‌‌‌‌‌‌ఓసీలూ ఇచ్చేశారు. మిగతా చోట్ల  ఎన్‌‌‌‌‌‌‌‌ఓసీలు రాక పెండింగ్​లో పెట్టినట్లు సమాచారం. ఎన్‌‌‌‌వోసీలు ఇచ్చిన చోట.. 56 బంక్‌‌‌‌‌‌‌‌లను ప్రారంభించారు. తొలుత పెట్రోల్‌‌‌‌‌‌‌‌ కంపెనీలకు రిజిస్ట్రేషన్‌‌‌‌‌‌‌‌ చేసి రెండేళ్ల తర్వాత డీలర్ పేరిట తాము అనుకున్న వ్యక్తికి లీజుకిచ్చేలా రూట్​ క్లియర్​ చేసుకున్నారు. బంకులకు ఆర్టీసీ స్థలాలు కట్టబెట్టేందుకు ప్రగతి భవన్​ కేంద్రంగా ఓ ఎంపీ చక్రం తిప్పినట్లు ప్రచారంలో ఉంది. సిరిసిల్ల జిల్లాకు చెందిన తన బంధువుకు ఈ స్థలాలు అప్పగించటం దుమారం రేపుతోంది.

కరీంనగర్‌‌‌‌లో వందల కోట్లు

కరీంనగర్‍ డిపో.. బస్ స్టేషన్‍ కలిపి 18 ఎకరాలు. వీటి విలువ సుమారు రూ. 400 కోట్లు. కరీంనగర్​ జగిత్యాల రూట్​ లో ఉన్న జోనల్‍ వర్క్ షాప్ 53 ఎకరాల్లో ఉంటుంది. దీని విలువ సుమారు రూ. 750 కోట్లు. బస్టాండ్​ చుట్టుపక్కల ఎకరం స్థలంలో కమర్షియల్‌‌‌‌‌‌‌‌ షాపింగ్​ కాంప్లెక్స్​తో పాటు ఆంధ్రా బ్యాంకుకు లీజుకిచ్చారు. ప్రసుతం ప్రతిమ మల్టీప్లెక్స్ ఉన్న ఎకరం స్థలాన్ని గతంలోనే 33 ఏళ్లకు లీజుకిచ్చారు. దీని విలువ సుమారు రూ.25 కోట్లు. ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ కుటుంబీకులకు చెందిన ప్రతిమ గ్రూపు ఆఫ్‍ కంపెనీస్‍ పేరిట స్థలం లీజుకు తీసుకున్నారు. గతంలో ఏడాదికి రూ. లక్ష చొప్పున చెల్లించగా,  ఇప్పుడు ఏడాదికి రూ.1.11 కోట్లు కడుతున్నట్టు ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. పక్కనున్న డిపోనే వర్క్ షాపు దగ్గరకు తరలించి.. వర్క్ షాపును సిద్దిపేటకు పంపడానికి నిరుడు విఫలయత్నం చేశారు. వర్క్ షాపు ప్రాంతంలో పెట్రోల్ బంక్​కు టెండర్లు నిర్వహించారు.

Latest Updates