సమ్మె విరమించేది లేదు..విధుల్లోకి చేరేది లేదు : అశ్వత్థామ

సమ్మె విరమించేది లేదని ఆర్టీసీ జేఏసీ కన్వినర్ అశ్వత్థామరెడ్డి అన్నారు. శుక్రవారం ఆర్టీసీపై క్యాబినెట్ లో చర్చ జరిగింది. చర్చ అనంతరం సీఎం కేసీఆర్ మాట్లాడుతూ కార్మికులు, చిరు ఉద్యోగుల పొట్టలు కొట్టే సంస్కృతికి తమది కాదన్నారు.  మరో మూడు రోజుల్లో నవంబర్ 5వ తేదీ అర్ధరాత్రి లోపు విధులలో చేరి బేషరతు పత్రాలను సమర్పించాలని సూచించారు. ఆర్టీసీ కార్మికులను తమ బిడ్డలుగానే భావించి ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.

ప్రభుత్వం ఇచ్చిన ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని…లేదంటే చేసేది ఏమీ లేదని తేల్చి చెప్పారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రసక్తే లేదన్నారు. దీనిపై కేబినెట్ నిర్ణయం తీసుకుందన్నారు.

అయితే కేసీఆర్ వ్యాఖ్యల్ని ఆర్టీసీ జేఏసీ నేతలు ఖండిస్తున్నారు.  సమ్మెపై వెనక్కి తగ్గేది లేదని అన్నారు. హామీ లేకుండా కార్మికులు విధులకు వెళ్లరని తేల్చిచెప్పారు. కేసీఆర్ వ్యాఖ్యల్ని ఏ కోణంలో చూడాలి..? సమ్మెను మరింత ఉదృతంగా ఎలా చేయాలి..? ఆర్టీసీని మరింత బలోపేతం చేసేందుకు ఎలా ముందుకు సాగాలనే అంశాలపై జేఏసీ నేతలు రాష్ట్ర టీఎంయూ (తెలంగాణ మజ్దూర్ యూనియన్) కార్యాలయంలో చర్చిస్తున్నారు. ఈ చర్చల్లో ప్రధానంగా ఆర్టీసీ కార్మికుల సమ్మెను మరింత ఉదృతం చేసేలా నిర్ణయించుకున్నారు.  

 నవంబర్ 4న అన్నీ రాజకీయ పార్టీలతో డిపోల దగ్గర కార్మికుల దీక్ష, 5న రహదారుల దిగ్భంధం, 6న అన్నీడిపోల ముందు నిరసనలు, 7న కార్మికుల కుటుంబాలు, రాజకీయ పార్టీలతో డిపోల ముందు దీక్ష, 8న ఛలో ట్యాంక్ బండ్, 9న ట్యాంక్ బండ్ పై దీక్ష నిరసన కార్యక్రమాలు చేపట్టేలా జేఏసీ నిర్ణయం తీసుకుంటుందని జేఏసీ నేతలు నిర్ణయం తీసుకున్నారు.   .  

Latest Updates