రెండుగా చీలిన ఆర్టీసీ టీఎంయూ

ఆర్టీసీ తెలంగాణ మజ్దూర్‌‌‌‌‌‌‌‌ యూనియన్ రెండు వర్గాలుగా చీలిపోయింది. టీఎంయూ ప్రధాన కార్యదర్శిగా అశ్వత్థామరెడ్డి కొనసాగడాన్ని వ్యతిరేకిస్తూ ఓ వర్గం ఎదురుతిరిగింది. టీఎంయూకు వర్కింగ్‌‌‌‌‌‌‌‌ ప్రెసిడెంట్‌‌‌‌‌‌‌‌ థామస్‌‌‌‌‌‌‌‌ రెడ్డి, కొందరు రాష్ట్ర సెక్రటరీలు, రీజినల్‌‌‌‌‌‌‌‌, జోనల్‌‌‌‌‌‌‌‌, డిపో స్థాయి నేతలు యూనియన్​ పదవులకు సోమవారం రాజీనామా చేశారు. అయితే తాము టీఎంయూలోనే కొనసాగుతామని.. జనరల్‌‌‌‌‌‌‌‌ సెక్రటరీ పదవికి అశ్వత్థామరెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్‌‌‌‌‌‌‌‌ చేశారు. మరికొందరు నేతలు అశ్వత్థామరెడ్డిని సమర్థించారు. దీంతో యూనియన్‌‌‌‌‌‌‌‌ రెండుగా చీలిపోయింది.

అసలు ఏమైంది?

గతేడాది డిసెంబర్‌‌‌‌‌‌‌‌లో ఆర్టీసీ సమ్మె ముగిసిన తర్వాత రాష్ట్ర సర్కారు పలు యూనియన్లను నిర్వీర్యం చేసే పని మొదలుపెట్టింది. గుర్తింపు పొందిన యూనియన్‌‌‌‌‌‌‌‌ గా టీఎంయూకు అప్పటిదాకా వర్తించిన వివిధ ఫెసిలిటీస్‌‌‌‌‌‌‌‌, ఓడీల వంటి వాటిని రద్దు చేసింది. ఆ తర్వాత టీఎంయూ సైలెంట్‌‌‌‌‌‌‌‌ అయిపోయింది. ఉద్యోగులు ఎన్ని ఇబ్బందులు పడినా, వేధింపులకు గురైనా టీఎంయూ సహా ఏ యూనియన్​ పట్టించుకోలేదు. కొన్నిరోజుల తర్వాత మిగతా యూనియన్లు తెరమీదకు వచ్చినా.. టీఎంయూ మాత్రం సైలెంట్‌‌‌‌‌‌‌‌గానే ఉండిపోయింది. పర్మిషన్‌‌‌‌‌‌‌‌ లేకుండా డ్యూటీలకు డుమ్మా కొడుతున్నారంటూ అశ్వత్థామరెడ్డికి పలుసార్లు ఆర్టీసీ నోటీసులిచ్చింది. దీంతో యూనియన్​ జనరల్‌‌‌‌‌‌‌‌ సెక్రటరీ పదవి తనకు కావాలని థామస్‌‌‌‌‌‌‌‌ రెడ్డి ప్రతిపాదించారు. మొదట్లో దీనికి ఒప్పుకొన్న అశ్వత్థామరెడ్డి వెనక్కి తగ్గారని మీడియాలో వార్తలు కూడా వచ్చాయి. యూనియన్​ కేంద్ర కమిటీ ఆదివారం హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో సమావేశమైంది. జనరల్‌‌‌‌‌‌‌‌ సెక్రటరీగా అశ్వత్థామరెడ్డి కొనసాగాలని కేంద్ర కమిటీ నిర్ణయించిందని టీఎంయూ ప్రకటించింది. దీనిపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. థామస్‌‌‌‌‌‌‌‌ రెడ్డి సహా 13 మంది రాష్ట్ర కార్యదర్శులు, 10 మంది జోనల్‌‌‌‌‌‌‌‌, రీజనల్‌‌‌‌‌‌‌‌ సెక్రటరీలు, మరికొందరు నేతలు రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు.

అశ్వత్థామరెడ్డివి ఏకపక్ష నిర్ణయాలు: థామస్‌‌‌‌‌‌‌‌ రెడ్డి

యూనియన్​ జనరల్​ సెక్రటరీ అశ్వత్థామరెడ్డి ఒంటెద్దు పోకడ, ఏకపక్ష నిర్ణయాలతో ఉద్యోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని థామస్‌‌‌‌‌‌‌‌ రెడ్డి విమర్శించారు. సమ్మె టైంలో మరణించిన స్టాఫ్​ కుటుంబాలను పట్టించుకోలేదన్నారు. ఉద్యోగుల ప్రయోజనాలను తాకట్టు పెట్టిన అశ్వత్థామరెడ్డి వెంటనే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌‌‌‌‌‌‌‌ చేశారు. ఆర్టీసీని కాపాడటమే తమ లక్ష్యమని.. టీఎంయూలోనే కొనసాగుతామని, త్వరలో భవిష్యత్​ కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పారు.

Latest Updates