ఆర్టీసీని విలీనం చేయాల్సిందే!

  • ఏపీలో నిర్ణయంతో సర్కార్​పై పెరుగుతున్న ఒత్తిడి
  • ఇప్పటికే పలు యూనియన్ల ఆందోళనలు
  • అదేబాటలో మరికొన్నిసంఘాలు కూడా..
  • విలీనంపై అధికారులు, కార్మికుల భిన్నవాదనలు

హైదరాబాద్‌‌, వెలుగు: నష్టాల్లో ఉన్న ఆర్టీసీని కాపాడాలంటే ప్రభుత్వంలో విలీనం చేయాల్సిందే అనే డిమాండ్లు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఏపీఎస్​ ఆర్టీసీ విలీనానికి సంబంధించి ఇటీవల ఏపీ సర్కారు నిర్ణయం తీసుకోవడంతో ఇక్కడా అమలు చేయాలంటూ ఒత్తిడి పెరుగుతోంది. ఆర్టీసీ విలీనానికి సంబంధించి ఎన్నికలకు ముందు సీఎం కేసీఆర్‌‌ హామీ ఇచ్చారని, దాన్ని అమలు చేయాలని యూనియన్లు విజ్ఞప్తి చేస్తున్నాయి. దీనికి సంబంధించి కొన్ని యూనియన్లు ఆందోళనకు దిగగా, మరికొన్ని కార్మిక సంఘాలు ఉదమ్య కార్యాచరణను సిద్ధం చేసుకుంటున్నాయి.

ఏటా వెయ్యి కోట్ల నష్టం

రాష్ట్రంలో మొత్తం 10,400 ఆర్టీసీ బస్సులున్నాయి. వీటి ద్వారా రోజుకు సగటున రూ.11 కోట్ల చొప్పున ఏడాదికి రూ.3,960 కోట్ల ఆదాయం వస్తోంది. బస్టాండ్లలోని గదుల అద్దెలు, పార్సిల్స్ తదితర వాణిజ్య ఆదాయం సుమారు రూ.920 కోట్లు వస్తోంది. అన్నీ కలిపి ఆర్టీసీకి ఏడాది రూ.4,880 కోట్ల వరకు ఆదాయం ఉంటుంది. ఏటా వేల కోట్లలో ఆదాయం వస్తున్నా ఖర్చులు అంతకంటే ఎక్కువగా ఉంటున్నాయి. సిబ్బంది జీతభత్యాలు, అద్దె బస్సుల నిర్వహణ, ప్రమాద బాధితులకు ఎక్స్‌‌గ్రేషియా, మరమ్మతులు, అప్పులపై వడ్డీల చెల్లింపులకు ఏడాదికి రూ. 5,755 కోట్లు చెల్లించాల్సి వస్తోంది. దీంతో ఏటా రూ.వెయ్యి కోట్ల మేర నష్టాలు వస్తున్నాయి.

విలీనంపై భిన్న వాదనలు

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తే నష్టాల నుంచి బయటపడవచ్చని కార్మిక సంఘాల నేతలు చెబుతున్నారు. అయితే ఎన్నో ఏళ్లుగా ఈ అంశం అమలుకు నోచుకోవట్లేదు. విలీనంతో రూ.15 వేల కోట్ల విలువైన ఆర్టీసీ ఆస్తులు ప్రభుత్వ ఖాతాలో జమవుతాయని, వీటి ద్వారా ప్రభుత్వానికి భారీగా ఆదాయం వచ్చే అవకాశం ఉంటుందని కార్మిక సంఘాల నేతలు అంటున్నారు. అధికారుల వాదన మరోలా ఉంది. ఆర్టీసీ విలీనంతో ప్రభుత్వంపై రూ.5,300 కోట్ల భారం పడే అవకాశం ఉందని చెబుతున్నారు. ట్యాక్స్ రూపంలో బస్సులపై వస్తున్న రూ.200 కోట్ల ఆదాయాన్నీ కోల్పోవాల్సి ఉంటుందని అంటున్నారు.

సంఘాల ఆందోళన బాట

ఏపీఎస్​ఆర్టీసీ విలీనానికి చర్యలు వేగం కావడంతో రాష్ట్రంలోని యూనియన్లు కూడా ఆందోళన బాట పడుతున్నాయి. ఆర్టీసీ గుర్తింపు సంఘం తెలంగాణ మజ్దూర్‌‌ యూనియన్‌‌ ప్రెస్‌‌ మీట్‌‌ పెట్టి ప్రభుత్వంపై ఫైర్‌‌ అయ్యింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని డిపోల ఎదుట ధర్నాలు చేసింది. మరో సంఘం తెలంగాణ జాతీయ మజ్దూర్‌‌ యూనియన్‌‌ కూడా అన్ని డిపోల ఎదుట ధర్నాలు, ఇందిరాపార్క్‌‌ వద్ద ఒక్క రోజు నిరాహార దీక్ష చేపట్టింది. ఇతర యూనియన్లు సైతం ఆందోళనలకు సిద్ధమవుతున్నాయి.

జులైలో చైతన్యయాత్రలు

ఆర్టీసీ విలీనంపై సీఎం హామీ ఇచ్చారు. కానీ ఇప్పుడు ఆర్టీసీని పట్టించుకోవడం లేదు. సర్కార్‌‌లో విలీనం చేస్తే కార్మికుల గుండెల్లో ఆయన చిరస్థాయిగా నిలిచిపోతారు. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు ఇప్పటికే కార్యచరణ ప్రకటించాం. జులై మొదటి వారంలో అన్ని డిపోల పరిధిలో చైతన్య యాత్రలు నిర్వహిస్తాం.- హనుమంతు ముదిరాజ్‌‌, ప్రధాన కార్యదర్శి, టీజేఎంయూ

Latest Updates