సిటీ శివారులో బస్​ టెర్మినల్స్

హైదరాబాద్, వెలుగు: సిటిలో పెరుగుతున్న ట్రాఫిక్ ను దృష్టిలో పెట్టుకొని ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆర్టీసీ అధికారులు భావిస్తున్నారు. ముఖ్యంగా సిటీ సెంటర్ లో ఉన్న బస్టాఫ్ లపై భారాన్ని తగ్గిస్తూ శివారు ప్రాంతాల్లో ఎక్కడికక్కడ బస్ టెర్మినల్ నిర్మించాలని యోచిస్తోంది. ప్రస్తుతం కోఠి, కాచిగూడ, కూకట్ పల్లి సహా నగరంలో ఎనిమిది ప్రాంతాల్లో బస్ టెర్మినళ్లను ఏర్పాటు చేశారు. ఈ టెర్మినళ్ల నుంచి పలు ప్రాంతాలకు బస్సులను నడిపిస్తున్నారు. ఐతే ఇవన్నీ సిటి సెంట్రిక్ గా ఉండడంతో ప్రయాణికులకు ట్రాఫిక్ ఇబ్బందులు తప్పడం లేదు. గంటల కొద్దీ సమయం సిటిలోనే వృథా అవుతోంది. ఉదాహరణ కు విజయవాడ లాంటి ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులైతే ఎంజీబీఎస్ దాటుకొని ఎల్. బి నగర్ వైపు ఉంటే  వారంతా ఎంజీబీఎస్ కు రాకుండా ఎల్. బి నగర్ వద్దే బస్సు ఎక్కవచ్చు. కానీ ఎల్. బి నగర్ సరిగ్గా బస్సు ఎక్కడ ఆగుతుందో ఎక్కడ వేచి ఉండాలో తెలియక చాలా మంది ఎంజీబీఎస్ కే వెళ్తున్నారు. దీనివల్ల వారికి సమయం వృథా తో పాటు గంటల కొద్దీ ఎక్కువ సమయం ప్రయాణం చేయాల్సి ఉంటోంది. ఇది ఒక్క విజయవాడ కు వెళ్లే ప్రయాణికులకే కాదు నగరం నాలుగు వైపులా ప్రయాణికులకు ఇలాంటి సమస్యే ఉంది. వరంగల్, యాదిగిరి గుట్ట వెళ్లే వారు, కరీంనగర్, మంచిర్యాల, గోదావరి ఖని వెళ్లే వారు చాలా మంది సైతం సిటిలోని ప్రధాన బస్టాఫ్ వరకు రావాల్సి ఉండటంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. దీంతో ఈ  సమస్యపై ఆర్టీసీ అధికారులు దృష్టి పెట్టారు. ఆర్టీసీ ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించే దిశలో ముఖ్యంగా సిటి నాలుగు దిక్కులా అధునిక బస్ టెర్మినల్స్ నిర్మించాలని భావిస్తున్నారు.

పండుగ వేళ్లల్లో శివారు నుంచే బస్సులు

ప్రస్తుతం దసరా, సంక్రాంతి లాంటి పండుగ వేళల్లో జనం రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఆయా సమయాల్లో సిటి లో ట్రాఫిక్ బాధలు తప్పించుకునేందుకు శివారు నుంచే బస్సు సర్వీసులను నడిపిస్తుంటారు.  ఉప్పల్, ఎల్.బి నగర్, జేబీఎస్, కూకట్ పల్లి లాంటి ప్రాంతాల నుంచే బస్సు సర్వీస్ లు మొదలవుతాయి. ప్రస్తుతం ఏ పద్ధతి లేకుండా ఇష్టానుసారంగా బస్సులు ఉప్పల్, ఎల్.బినగర్ లాంటి ప్రాంతాల్లో నిలుస్తున్నాయి. వేచి చూసేందుకు సరైన సౌకర్యాలు లేవు. దీంతో ఇక్కడ బస్సు టెర్మినళ్లను నిర్మించాలని యోచిస్తున్నారు.

Latest Updates