ఏపీలో 3 నెలల్లో ఆర్టీసీ విలీనం

  • పబ్లిక్ ట్రాన్స్​పోర్ట్ డిపార్ట్​మెంట్​గా కార్పొరేషన్​
  • ప్రభుత్వ ఉద్యోగులుగా 53,261 మంది ఆర్టీసీ ఉద్యోగులు
  • ఇక లాభనష్టాలు ప్రభుత్వానివే

అమరావతి, వెలుగు:

ఏపీలో ఆర్టీసీ ఉద్యోగుల కల నెరవేరుతోంది. ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయాలన్న కార్మిక సంఘాల పోరాటాలు ఫలించాయి. మరో 3 నెలల్లో ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం కానుంది. 53,261 మంది ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులుగా మారనున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల తరహాలోనే వీరికి పదవీ విరమణ వయసు 58 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు పెరగనుంది. రాష్ర్ట ప్రభుత్వ ఉద్యోగులకు అందే అన్ని ప్రయోజనాలు ఆర్టీసీ ఉద్యోగులకు కూడా అందనున్నాయి.

 ఆర్టీసీ విలీనం ఇలా…

ముందుగా ఆర్టీసీని విలీనం చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటిస్తుంది. పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్ పేరుతో కొత్త శాఖను ఏర్పాటు చేస్తుంది. రవాణా శాఖలో అంతర్భాగంగా ఇది పని చేస్తుంది. ఆర్టీసీలో ప్రస్తుతం ఉన్న అధికారులను అదే పోస్టుల్లో ఉంచి వారి డెసిగ్నేషన్లను మాత్రం రవాణా శాఖ కింద మారుస్తారు. అధికారికంగా విలీన నోటిఫికేషన్ వెలువడిన నాటి నుంచి ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా రాష్ర్ట ప్రభుత్వం గుర్తిస్తుంది. ఆర్టీసీలో ప్రస్తుతం ఉన్న సర్వీస్‌‌ రూల్స్‌‌నే కొనసాగిస్తారు. ఐఏఎస్ ర్యాంకుకు తగ్గని అధికారిని పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ డిపార్ట్ మెంట్ డైరెక్టర్‌‌ జనరల్‌‌గా ప్రభుత్వం నియమిస్తుంది. ఆర్టీసీ వీసీ అండ్‌‌ ఎండీ ఎక్స్‌‌ అఫీషియో సభ్యుడిగా కొనసాగుతారు. ఈడీలను అడిషనల్‌‌ డైరెక్టర్లుగా, రీజినల్‌‌ మేనేజర్లను జాయింట్‌‌ డైరెక్టర్లుగా, డివిజనల్‌‌ మేనేజర్లను డిప్యూటీ డైరెక్టర్లుగా, డిపో మేనేజర్లను అసిస్టెంట్‌‌ డైరెక్టర్లుగా రీ డెసిగ్నేషన్ చేస్తారు. ఇన్సెంటివ్ లు, పే స్కేళ్లలో నష్టం కలగకుండా చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం కమిటీ వేస్తుంది. ఆర్టీసీ ఉద్యోగులు పీఎఫ్‌‌ ఖాతాలను పబ్లిక్‌‌ ప్రావిడెంట్‌‌ ఫండ్‌‌ (పీపీఎఫ్‌‌)లో ఉంచుకోవడమా.. లేక నోషన్‌‌ పెన్షన్‌‌ స్కీంలో కలపడమా అన్నది సిబ్బంది ఇష్టానికే వదిలేస్తారు. కాంట్రాక్టు కార్మికులు ప్రజా రవాణా శాఖలోనూ కొనసాగుతారు.

నేరుగా విలీనం చెల్లదు

రోడ్ ట్రాన్స్ పోర్ట్ యాక్ట్ 1950 ప్రకారం ఆర్టీసీలను కంపెనీలు, కార్పొరేషన్లు, ప్రభుత్వ శాఖల్లో విలీనం చేయరాదనే నిబంధన ఉంది. ప్రభుత్వాలు ఆదాయం కోసం రవాణా వ్యవస్థను విలీనం చేసుకుంటాయనే ఉద్దేశంతో అప్పట్లో ఈ నిబంధన పెట్టారు. అందుకే ఏపీ సర్కారు నూతన ప్రక్రియను ఎంచుకుంది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూనే పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ డిపార్ట్ మెంట్ రూపంలో ప్రత్యేక శాఖను ఏర్పాటు చేస్తోంది. 1950 ఆర్టీసీల చట్టం ప్రకారం సంస్థ పేరును మారుస్తున్నట్లు తీర్మానం చేస్తుంది. ఆర్టీసీ ఉద్యోగులు, ఆస్తులను ఈ శాఖకు బదిలీ చేస్తూ తీర్మానం చేస్తుంది. ఆర్టీసీ పేరును పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ డిపార్ట్ మెంట్ గా మారుస్తూ చట్టం కూడా చేయనుంది. ఇలా ఆర్టీసీ రాష్ర్ట ప్రభుత్వంలో విలీనం కానుంది. పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ డిపార్ట్ మెంట్ నిర్వహణ బాధ్యతలను చూసుకుంటే.. ఆర్టీసీ ఆదాయం, ఖర్చులను రవాణా శాఖ ద్వారా ప్రభుత్వమే పర్యవేక్షిస్తుంది. లాభనష్టాలను ప్రభుత్వమే భరిస్తుంది.

RTC will merge with the AP government within 3 months

Latest Updates