తెలంగాణ ఉద్యమమే స్ఫూర్తి: ఆర్టీసీ మహిళా ఉద్యోగులు

ప్రజా రవాణ వ్యవస్థను కాపాడడం కోసమే తాము సమ్మె చేస్తున్నామని ఆర్టీసీ మహిళా ఉద్యోగులు చెప్పారు. ప్రజలు తమను అర్థం చేసుకుని ఈ పోరాటానికి మద్దతు ఇవ్వాలని కోరారు. సోమజిగూడ ప్రెస్ క్లబ్ లో ఆర్టీసీ మహిళా ఉద్యోగులతో V6 ముఖాముఖీ మాట్లాడింది. ఈ సందర్భంగా వారు తమ ఆవేదనను వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి అబద్దాలు చెబుతూ, తమ నిందలు వేయడం దారుణమని  అన్నారు. 26 ఏళ్లుగా కండక్టర్ గా పని చేస్తున్న తనకు రూ.29,500 జీతం వస్తోందని చెప్పారు ఓ మహిళా ఉద్యోగి. ఇన్ని ఏళ్లుగా ఉద్యోగం చేస్తున్న తన పరిస్థితే ఇలా ఉంటే.. సీఎం కేసీఆర్ చెప్పిన రూ.50 వేలు జీతం ఎవరికి వస్తున్నట్లని ప్రశ్నించారు.

సమ్మె సంస్థ కోసమే..

తెలంగాణ ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకుని తమ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పారు మహిళా ఉద్యోగులు. సమ్మె తమ కోసం కాదని, ఆర్టీసీ ఆస్తులను కాపాడడం కోసమని చెప్పారు. కావాలని కేసీఆర్ తమపై నిందలు వేస్తున్నారని అన్నారు.  ప్రజా రవాణా వ్యవస్థను కాపాడడం కోసమే తాము సమ్మె చేస్తున్నామని,  ప్రజలు అర్ధం చేసుకోని అండగా నిలుస్తారని ఆశిస్తున్నామని అన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. ఆర్టీసీ హాస్పిటల్ లో వైద్యం నిలిపివేయడం దారుణమని, దీనిని తాము ఖండిస్తున్నామని చెప్పారు. తిరిగి వైద్య సేవలను వెంటనే ప్రారంభించాలని కోరారు.

Latest Updates