పాలమూరు ప్రాజెక్టులో రూల్స్ పాటించలే

పాలమూరు ప్రాజెక్టులో రూల్స్ పాటించలే

హైదరాబాద్‌‌, వెలుగు: పాలమూరు–రంగారెడ్డి లిఫ్ట్‌‌ స్కీమ్​లో పర్యావరణ ఉల్లంఘనలు జరిగాయని ఎన్జీటీకి ఎక్స్​పర్ట్ కమిటీ రిపోర్టు ఇచ్చింది. ఉద్దండాపూర్‌‌ రిజర్వాయర్‌‌ నిర్మాణం కోసం నిబంధనల మేరకే చెరువుల్లోని మట్టిని తవ్వినా, పర్మిషన్‌‌ లేకుండా కట్ట నిర్మాణానికి ఉపయోగించారని స్పష్టం చేసింది. చెరువుల్లో అనుమతి లేకుండా తవ్వకాలు జరిపి, ఆ మట్టిని రిజర్వాయర్ల నిర్మాణానికి ఉపయోగిస్తున్నారని పేర్కొంటూ మహబూబ్‌‌నగర్‌‌ జిల్లాకు చెందిన కోస్గి వెంకటయ్య ఎన్జీటీ చెన్నై బెంచ్‌‌లో పిటిషన్‌‌ వేశారు. దీనిపై విచారణ చేపట్టిన ఎన్జీటీ.. కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖ హైదరాబాద్‌‌ రీజినల్‌‌ సెంటర్‌‌ సైంటిస్ట్‌‌ డాక్టర్‌‌ అరోకియా లెనిన్‌‌, పొల్యూషన్‌‌ కంట్రోల్‌‌ బోర్డు (చెన్నై) సైంటిస్ట్‌‌ పూర్ణిమ, నీరి సైంటిస్ట్‌‌ షేక్‌‌ భాషా, కేఆర్‌‌ఎంబీ మెంబర్‌‌ (పవర్‌‌) ఎల్‌‌బీ మౌన్‌‌తంగ్‌‌, మహబూబ్‌‌ నగర్‌‌ కలెక్టర్‌‌ వెంకట్‌‌రావుతో ఎక్స్‌‌పర్ట్‌‌ కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీ సెప్టెంబర్‌‌ 15, 16 తేదీల్లో ఫీల్డ్‌‌ విజిట్‌‌ చేసింది. ఉద్దండాపూర్‌‌ రిజర్వాయర్‌‌ (16 కి.మీ) కట్ట నిర్మాణం కోసం చెరువుల్లోని మట్టిని పెద్ద ఎత్తున తవ్వి తరలించడం నిజమేనని కమిటీ తేల్చింది. కాగా, తెలంగాణ ప్రభుత్వం రిజర్వాయర్ల నిర్మాణంలో పర్యావరణ ఉల్లంఘనలకు పాల్పడిందని, దీంతో చర్యలు తీసుకోవాలని ఎన్జీటీని ఎక్స్​పర్ట్​ కమిటీ కోరింది.