న‌దిలోకి 20 వేల ట‌న్నుల డీజిల్ లీక్.. క్లీన్ చెయ్యడానికి పదేళ్లు ప‌ట్టే చాన్స్

ఓ వైపు క‌రోనా మ‌హ‌మ్మారితో అల్ల‌క‌ల్లోలం అవుతున్న స‌మ‌యంలో ర‌ష్యాకు మ‌రో పెను విప‌త్తు ఎదురైంది. 20 వేల ట‌న్నుల ఆయిల్ న‌దిలోకి లీక్ కావ‌డంతో ఆ దేశ అధ్య‌క్షుడు పుతిన్ ఎమ‌ర్జెన్సీ విధించాల్సి వ‌చ్చింది. ర‌ష్యాలోని నోరిల‌స్క్ సిటీ స‌మీపంలో ఉన్న ప‌వ‌ర్ ప్లాంట్ లో డీజిల్ ట్యాంక్ నుంచి లీక్ అయి దాదాపు 20 వేల ట‌న్నుల డీజిల్ అంబ‌ర్న‌యా న‌దిలోకి చేరింది. గ‌త శుక్ర‌వారం జ‌రిగిన లీకేజీతో ఇప్ప‌టికే డీజిల్ న‌దిలో 12 కిలోమీట‌ర్ల మేర వ్యాపించింది. అయితే ఆ న‌ది నీరు ప్యాసినో స‌ర‌స్సు ద్వారా మ‌రో న‌దిలోకి క‌లిసి, ఆపై ఆర్కిటిక్ స‌ముద్రంలోకి క‌లుస్తుంది. ఆయిల్ వేగం వ్యాపిస్తూ న‌దీ జ‌లాల‌ను మొత్తం క‌లుషితం చేస్తోంది. దాల్దిక‌న్ న‌దిలోకి కూడా ఆయిల్ వ్యాపించింద‌ని రాయిట‌ర్స్ సంస్థ క‌థ‌నాల‌ను ప్ర‌చురించింది.

దీంతో ఈ న‌దులుపై ఆధార‌ప‌డిన ప్రాంతాల్లో ప్ర‌జ‌ల జీవ‌వ‌నం అస్త‌వ్య‌స్త‌మ‌య్యే ప్ర‌మాదం ఉంది. తాగు, సాగు నీటికి క‌ష్టం ఏర్ప‌డే అవ‌కాశం ఉంది. అలాగే ఈ న‌దుల్లో జీవించే జ‌లచ‌ర జీవులు ఊపిరాడ‌క మ‌ర‌ణించే ప్ర‌మాదం ఉంది. దీంతో త‌క్ష‌ణం ఎమర్జెన్సీ విధించిన ర‌ష్యా అధ్య‌క్షుడు పుతిన్.. క్లీనింగ్ కు త‌క్ష‌ణం చ‌ర్య‌లు చేప‌ట్టాల్సిందిగా సంబంధిత శాఖ‌ల‌ను ఆదేశించారు.

ఈ న‌దిలోకి వ్యాపిస్తున్న డీజిల్ ను క్లీన్ చేయ‌డానికి ఐదు నుంచి ప‌దేళ్ల వ‌ర‌కు ప‌డుతుంద‌ని ప‌ర్యావ‌ర‌ణ నిపుణులు అంచ‌నా వేస్తున్నారు. ఇందుకోసం దాదాపు ల‌క్షా 13 వేల కోట్ల రూపాయ‌ల‌కు పైగా ఖ‌ర్చ‌వుతుంద‌ని చెబుతున్నారు.

ఆల‌స్యంగా.. సోష‌ల్ మీడియా ద్వారా అధికారుల దృష్టికి

ప్ర‌పంచంలోనే అతి పెద్ద నికెల్, ప‌ల్లాడియం ఉత్ప‌త్తి కంపెనీ నోరిల‌స్క్ నికెల్ కు చెందిన పవ‌ర్ ప్లాంట్ లోని ఓ అయిల్ ట్యాంక్ నుంచి ఈ లీకేజీ జ‌రిగింది. ప‌వ‌ర్ ప్లాంట్ లో ఉన్న ఆయిల్ ట్యాంక్ పిల్ల‌ర్ కుంగిపోవ‌డంతో ఈ ఘ‌ట‌న జ‌రిగిట్లు ఆ కంపెనీ సీఈవో సెర్గే చెప్పారు. అయితే గ‌త శుక్ర‌వారం లీకేజీ జ‌రిగితే ఆదివారానికి గానీ అధికారుల‌కు విష‌యం తెలియ‌లేదు. అప్ప‌టికి కూడా కంపెనీ గుర్తించి చెప్ప‌లేద‌ని, సోష‌ల్ మీడియా ద్వారా అధికారుల దృష్టికి ఈ విష‌యం వ‌చ్చింద‌ని రాయిట‌ర్స్ ప్ర‌చురించింది. నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించిన ప‌వ‌ర్ ప్లాంట్ డైరెక్ట‌ర్ వ్యాచెస్ల‌వ్ స్టారోస్టిన్ ను ర‌ష్యా పోలీసులు అరెస్టు చేశారు. అత‌డికి జూలై 31 వ‌ర‌కు క‌స్ట‌డీ విధించిన‌ట్లు తెలుస్తోంది.

Latest Updates